Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Jan 2022 13:09 IST

1. Ts News: రోజుకు లక్ష ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయండి: సర్కార్‌కు హైకోర్టు ఆదేశం

ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కొవిడ్‌ పరిస్థితులపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రోజుకు లక్ష ఆర్‌టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయాలని ఆదేశించింది. ఆర్‌టీ-పీసీఆర్‌, ర్యాపిడ్‌ పరీక్షల వివరాలు వేర్వేరుగా ఇవ్వాలని తెలిపింది. భౌతికదూరం, మాస్కుల నిబంధనలు కచ్చితంగా పాటించాలని స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని అభిప్రాయపడింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఫోన్‌ స్టోరేజ్‌ ఫుల్ అయిందా..? ఇలా చేస్తే ఎప్పటికీ నిండదు!

కొత్త ప్రదేశాలకు వెళ్లినప్పుడు ప్రతి క్షణాన్ని మధుర స్మృతులుగా మార్చుకోవాలనుకుంటాం. అందుకోసం అక్కడి దృశ్యాలను ఫొటోలు తీస్తుంటాం. కొన్నిసార్లు మొబైల్‌లో ఫొటో తీసుకునే సమయానికి స్టోరేజ్‌ ఫుల్ అనే సందేశం కనిపిస్తుంది. స్టోరేజ్‌ పరిమితి ఎంబీల నుంచి జీబీలకు మారినా.. చాలా మంది ఫోన్‌లో మెమొరీ సరిపోవడం లేదంటుంటారు. ఫోన్‌కు ఎస్‌డీ కార్డ్‌ సపోర్ట్‌ ఉంటే సరే. ఒకవేళ ఎస్‌డీ కార్డ్ సపోర్ట్ లేకపోతే, కొత్తగా వచ్చే ఫొటోలు, వీడియోలు, ఇతర ఫైల్స్‌ను ఫోన్‌లో స్టోర్‌ చేసేందుకు ఏం చేయాలో చూద్దాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Omicron: ఒమిక్రాన్‌ తీరు.. కొవిడ్‌కు పూర్తి భిన్నం

 కొవిడ్‌-19 మహమ్మారి తీరుతెన్నులకు విరుద్ధంగా ఒమిక్రాన్‌ వేరియంట్‌ పోకడ ఉందని ప్రముఖ వైరాలజిస్టు టి.జాకోబ్‌ జాన్‌ పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం రెండు రకాల మహమ్మారులు కొనసాగుతున్నట్లుగా భావించాలని ఆయన సూత్రీకరించారు. ఇందులో ఒకటి.. డెల్టా, దానితో ముడిపడి ఉన్న వేరియంట్ల వల్ల ఉత్పన్నమవుతోందన్నారు. రెండోది ఒమిక్రాన్‌తో తలెత్తుతోందని చెప్పారు. ఈ రెండు రకాల వల్ల కలుగుతున్న వ్యాధులూ భిన్నంగా ఉంటున్నాయని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మున్ముందు మరిన్ని ఆందోళనకర వేరియంట్లు?

4. Ap News: ఏపీ సీఐడీ పోలీసులకు ఎంపీ రఘురామ లేఖ

ఆంధ్రప్రదేశ్‌ సీఐడీ పోలీసులకు నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణ రాజు లేఖ రాశారు. ఏపీ సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ హైదరాబాద్‌లోని నివాసంలో సంక్రాంతికి ముందు సీఐడీ అధికారులు రఘురామకు నోటీసులు ఇచ్చారు. ఇవాళ రఘురామ సీఐడీ విచారణకు హాజరుకావాల్సి ఉండగా.. అనారోగ్య కారణాలతో విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు లేఖలో పేర్కొన్నారు. దిల్లీ వెళ్లాక అనారోగ్యానికి గురయ్యానని.. విచారణకు హాజరయ్యేందుకు 4 వారాలు గడువు కావాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Vaccine: బలవంతంగా కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయలేం: కేంద్రం

కొవిడ్‌ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ జారీ చేసిన మార్గదర్శకాలు ఒక వ్యక్తి సమ్మతి లేకుండా కొవిడ్‌ టీకా వేయాలని సూచించడం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బలవంతంగా టీకా ఇవ్వడం తమ ఉద్దేశం కాదని స్పష్టం చేసింది. కొన్ని రకాల సేవలు పొందేందుకు కొవిడ్ వ్యాక్సినేషన్‌ సర్టిఫికెట్‌ చూపించాలన్న నిబంధన నుంచి దివ్యాంగులకు మినహాయింపునివ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కేంద్రం ఈ విషయాన్ని సుప్రీంకోర్టుకు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Ts News: అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరీక్షలు వాయిదా

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో తెలుగు రాష్ట్రాల పరిధిలో నిర్వహించనున్న అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి. ఈ మేరకు పరీక్షలు వాయిదా వేసినట్లు విశ్వవిద్యాలయం పరీక్షల నియంత్రణ అధికారి డా.ఏవీఎన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీ వరకు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేసినట్లు ప్రకటించారు. వాయిదా పడ్డ పరీక్షలను ఎప్పుడు నిర్వహిస్తారనే వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Covid 19: భారత్‌లో పెరుగుతున్న పాజిటివిటీ రేటు.. 2.58లక్షల కొత్త కేసులు.!

భారత్‌లో కొవిడ్‌ పాజిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. తాజాగా ఇది 16.28శాతం నుంచి 19.65శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 13,13,444 లక్షల పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,58,089 లక్షల మందికి కొవిడ్‌ సోకినట్లు తేలింది. నిన్న 358 మంది కొవిడ్‌ కారణంగా  ప్రాణాలు కోల్పోయారు. ఈ వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసింది. భారత్‌లో ఒమిక్రాన్‌గా నిర్ధారించిన కేసుల సంఖ్య 6.02శాతం పెరిగి 8,209కు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Punjab Polls: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలువాయిదా? నేడు ఈసీ నిర్ణయం!

పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ తేదీని మార్చాలని అధికార కాంగ్రెస్‌ సహా అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. ఈసీ ఇటీవల ప్రకటించిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకారం.. పంజాబ్‌లో ఫిబ్రవరి 14న ఒకే విడతలో పోలింగ్‌ జరగాల్సి ఉంది. కానీ, ఫిబ్రవరి 16న గురు రవిదాస్‌ జయంతి ఉంది. దానికి సంబంధించిన ఉత్సవాలు ముందే ప్రారంభమవుతాయి. పైగా, జయంతి నేపథ్యంలో లక్షలాది మంది భక్తులు ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసికి వెళ్తారని.. దీంతో ఓటు వేసే అవకాశం కోల్పోతారని పార్టీలు ఈసీకి తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Ts News: బీఆర్కే భవన్‌ వద్ద ఉపాధ్యాయుల ఆందోళన.. అరెస్టు

తొలుత ఎంపిక చేసుకున్న మల్టీ జోన్‌కు తమ బదిలీలు చేయాలని రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానోపాధ్యాయులు కోరుకున్న జోన్లకు కాకుండా ఇతర జోన్లకు కేటాయించడంతో కొద్ది రోజులుగా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫలితం లేకపోవడంతో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్కే భవన్ ముందు ఇవాళ ఆందోళనకు దిగారు. జీఏడీ నిబంధనల మేరకే బదిలీలు చేశామని అధికారులు చెప్పారని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ప్రముఖ కథక్‌ కళాకారుడు పండిట్‌ బిర్జూ మహారాజ్‌ కన్నుమూత

 ప్రముఖ కథక్‌ కళాకారుడు పండిట్‌ బిర్జూ మహారాజ్‌ (83) కన్నుమూశారు. బిర్జూ మహారాజ్‌ దేశ, విదేశాల్లో ఎన్నో నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. కళాశ్రమం పేరుతో దిల్లీలో నృత్య పాఠశాలను నిర్వహిస్తున్నారు. ఉమ్రాన్‌ జాన్, దేవదాస్, బాజీరావు మస్తానీ బాలీవుడ్ చిత్రాలకు కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. బిర్జూ మహారాజ్‌ 1986లో పద్మ విభూషణ్‌ పురస్కారం అందుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని