Top Ten New @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 23 Apr 2022 13:02 IST

1. ఆ కుర్చీకున్న విలువేంటో ఆమెకు తెలుసా?: బొండా ఉమా

విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో యువతిపై అత్యాచార ఘటనలో న్యాయం కోరితే తమకే నోటీసులిస్తారా అని తెదేపా సీనియర్‌ నేత బొండా ఉమా ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూర్చున్న కుర్చీ విలువ ఏంటో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌కు తెలుసా అని నిలదీశారు. విజయవాడలో బొండా ఉమా మీడియాతో మాట్లాడారు.

2. ఎస్వీబీసీ ఛానల్‌ నిర్వహణ రాజకీయ నాయకులకెందుకు?: సోము

ఎస్వీబీసీ ఛానల్‌లో సినిమా పాటలు ప్రసారమవుతున్నాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. తితిదే ఆధ్వర్యంలోని ఛానల్‌ నిర్వహణ రాజకీయ నాయకులకు ఎందుకు అని ప్రశ్నించారు. తిరుపతిలో సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. భక్తులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత తితిదేది. ఇటీవల భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధాన నిర్ణయాలకు ముందు అందరితో చర్చించాలన్నారు.


Video: గాడిదలతో పరుగు పందేలు


3. బాధితురాలి వద్ద బలప్రదర్శన చేస్తారా?: వాసిరెడ్డి పద్మ

విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద నిన్నటి పరిణామాలపై తెదేపా అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సీనియర్‌ నేత బొండా ఉమాలకు సమన్లు జారీ చేసినట్లు ఏపీ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. సమన్లు జారీకి కారణాలు చెప్పాల్సిన బాధ్యత కమిషన్‌పై ఉందని తెలిపారు. మహిళల కన్నీళ్లు తుడవడానికే మహిళా కమిషన్‌ ఉందని వివరించారు. అత్యాచారం ఘటనకు కారకులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందే అని ఆమె చెప్పారు. బాధితురాలి వద్ద బల ప్రదర్శన చేస్తారా అని ప్రశ్నించారు.

4. ముంబయిలో హైడ్రామా.. భారీ ఎత్తున బలగాల మోహరింపు!

ముంబయిలో శనివారం ఉదయం నుంచీ హైడ్రామా కొనసాగుతోంది. ముఖ్యమంత్రి వ్యక్తిగత నివాసం ‘మాతోశ్రీ’ ముందు హనుమాన్‌ చాలీసా పఠించి తీరతామంటూ ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులు విసిరిన సవాల్‌ను నిరసిస్తూ శివసేన పార్టీ కార్యకర్తలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనకు దిగారు. ఇటు మాతోశ్రీతో పాటు, రాణా దంపతుల నివాసం వద్ద కార్యకర్తలు భారీ ఎత్తున గుమిగూడారు. రాణా దంపతుల ఇంటికి కొద్దిదూరంలో ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను సైతం ధ్వంసం చేశారు.

5. 15 వేలు దాటిన క్రియాశీల కేసులు..!

గత కొద్ది రోజులుగా దేశంలో కరోనా కేసులు స్వల్ప స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. దిల్లీలో వెయ్యికి సమీపంలో కేసులొస్తున్నాయి. తాజా వ్యాప్తితో క్రియాశీల కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ మేరకు కేంద్రం గణాంకాలు వెల్లడించింది. శుక్రవారం 4.5 లక్షల మందికి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,527 మందికి పాజిటివ్‌గా తేలింది. దిల్లీలో 1,042 మందికి కరోనా సోకింది. దేశంలో పాజిటివిటీ రేటు 0.56 శాతానికి చేరింది.


Video: విజయవాడలో.. నడిరోడ్డుపై విద్యార్థినుల సిగపట్లు


6. ‘సర్కారు వారి పాట’ వచ్చేసిందోచ్‌..!

సూపర్‌స్టార్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌ వచ్చేసింది. మహేశ్‌బాబు హీరోగా నటిస్తోన్న ‘సర్కారువారి పాట’ నుంచి మరో మ్యూజికల్‌ ట్రీట్‌ విడుదలైంది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదలకానున్న నేపథ్యంలో.. ప్రమోషన్స్‌లో భాగంగా చిత్రబృందం శనివారం ఉదయం ‘సర్కారువారి పాట’ టైటిల్‌ సాంగ్‌ని అభిమానులతో పంచుకుంది. ‘సరా సరా సర్కారు వారి పాట.. షురూ షురూ అన్నాడురా అల్లూరి వారి బేటా’  అంటూ సాగే ఈ పాటను సింగర్‌ హారికా నారాయణ్‌ ఆలపించారు.

7. ఆ విషయంలో భారత్‌ను ప్రోత్సహించలేం: అమెరికా

భారత్‌-రష్యా బంధంపై అగ్రరాజ్యం అమెరికా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. భారత్‌ తన రక్షణ అవసరాల నిమిత్తం రష్యాపై ఆధారపడడాన్ని అమెరికా ఏమాత్రం పోత్సహించడం లేదని ఆ దేశ రక్షణశాఖ కార్యాలయం పెంటగాన్‌ అభిప్రాయపడింది. 2018లో భారత్‌ ఎస్‌-400 గగనతల క్షిపణి వ్యవస్థ కొనుగోలు నిమిత్తం రష్యాతో ఐదు బిలియన్‌ డాలర్ల ఒప్పందం చేసుకున్న విషయం తెలిసిందే.

8. అది కరెక్ట్‌ కాదు కానీ.. మాక్కూడా అన్యాయం జరిగింది: పంత్

రాజస్థాన్‌తో మ్యాచ్‌లో చివరి ఓవర్‌లో నోబాల్‌ వివాదంపై దిల్లీ కెప్టెన్‌ రిషభ్‌ పంత్‌ స్పందించాడు. మ్యాచ్‌ అనంతరం అతడు మాట్లాడుతూ తాము ప్రవర్తించిన తీరు కచ్చితంగా సరైంది కాదని ఒప్పుకొన్నాడు. అయితే, తమకు కూడా అన్యాయం జరిగిందని చెప్పుకొచ్చాడు. 223 పరుగుల భారీ ఛేదనలో దిల్లీ విజయానికి చివరి ఓవర్‌లో 36 పరుగులు అవసరమైన మేళ రోమన్‌ పావెల్‌ (36) వరుసగా మూడు సిక్సర్లు కొట్టి దిల్లీ శిబిరంలో ఆశలు రేపాడు. అయితే, మూడో బంతి నోబాల్‌లా కనిపించినా అంపైర్లు పట్టించుకోలేదు. దీంతో కాసేపు వివాదం తలెత్తి మ్యాచ్‌ నిలిచిపోయింది.


Video: అజోవ్‌స్తల్‌పై పుతిన్ ప్రత్యేక దృష్టి


9. గాడ్సేను కీర్తిస్తూ.. నూలు నేసేందుకు సబర్మతీకే వెళ్తారేంటో..!

‘ఒకవైపు నాథూరాం గాడ్సేను కీర్తిస్తుంటారు.. మరోవైపు విదేశీ ప్రముఖుల్ని సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్తుంటారు’ అంటూ శివసేన పార్టీ భాజపాపై విమర్శలు గుప్పించింది. ఇప్పటికీ భారత్‌ అంటే గుర్తొచ్చేది మహాత్మా గాంధీనే అంటూ తన పార్టీ పత్రికలో సామ్నాలో వ్యాఖ్యానించింది. ‘వారు నాథూరం గాడ్సే సిద్ధాంతాలకు మద్దతు ఇస్తారు. విదేశాల నుంచి ఎవరైనా ప్రముఖులు వస్తే మాత్రం.. నూలు నేసేందుకు సబర్మతి ఆశ్రమానికి తీసుకెళ్తారు. ఇదంతా ఆశ్చర్యంగా ఉంటుంది’ అంటూ శివసేన భాజపా వైఖరిని విమర్శించింది.

10. విజయవాడలో విషాదం.. ఎలక్ట్రికల్‌ బైక్‌ బ్యాటరీ పేలుడు..

అతడు కొత్తగా ఎలక్ట్రికల్‌ బైక్‌ కొన్నాడు. అయితే.. ఆ ఆనందం గంటల్లోనే ఆవిరైంది. ఆ వాహనమే అతడి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. బైక్‌ బ్యాటరీకి ఛార్జింగ్‌  పెట్టిన అనంతరం అది పేలింది. ఈ ఘటనలో కుటుంబ పెద్ద మృతి చెందగా.. అతడి భార్య పరిస్థితి విషమంగా ఉంది. వారి పిల్లలిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు