Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Published : 12 May 2022 13:00 IST

1. మౌలిక సదుపాయాలు కల్పించడంలో హైదరాబాద్‌ ముందుంది: కేటీఆర్‌

భారత్‌లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు నివాసయోగ్యమైన నగరాల్లో హైదరాబాద్‌ ముందుందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. హైదరాబాద్‌ రాయదుర్గంలోని నాలెడ్జ్‌ సెంటర్‌లో అమెరికాకు చెందిన ‘కాల్‌అవే’ గోల్ఫ్‌ సంస్థ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్‌ మాట్లాడుతూ అమెరికాలోని శాండియాగోలో కాల్‌అవే సంస్థ క్వాల్కం కేంద్ర కార్యాలయం ఉందన్నారు.

2. ఆడబిడ్డలకు రక్షణంటే నిందితులను కాపాడటమేనా?: నారా లోకేశ్‌

ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే గన్‌ కంటే ముందొస్తానని రూ.కోట్లతో ప్రచారం చేయించుకున్న సీఎం జగన్‌.. ఆయన సొంత జిల్లా ప్రొద్దుటూరులో దళిత బాలికపై అత్యాచారం జరిగితే ఎక్కడా? అని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ప్రశ్నించారు. ఏదా గన్‌? ఎక్కడా జగన్‌? అని నిలదీశారు. అమాయక బాలికపై లైంగిక దాడిని మహిళా పోలీసులు వెలుగులోకి తెస్తే నిందితులను పట్టించుకోకుండా కేసు మాఫీ చేయాలని ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు.


Video: 18 ప్రభుత్వ ఆసుపత్రుల్లో మూడు పూటలా భోజనం..


3. వాయుగుండంగా బలహీనపడిన ‘అసని’.. కానీ.!

‘అసని’ తుపాను మచిలీపట్నం తీరానికి దగ్గరగా తీవ్ర వాయుగుండం నుంచి వాయుగుండంగా బలహీనపడింది. గత ఆరు గంటల్లో స్థిరంగా ఉండి అక్కడే బలహీనపడింది. కొన్ని గంటలు ఇదే ప్రాంతం చుట్టూ తిరుగుతూ మరింత బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో కోస్తాంధ్ర, రాయలసీమ వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, అక్కడకక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

4. రెండేళ్లు దాటినా.. కరోనా బాధితుల్లో ఆ లక్షణాలు..!

కరోనా మహమ్మారి రోజుల్లోనే నయమవుతున్నా.. కొంత మందిని మాత్రం దీర్ఘకాల కొవిడ్‌ వేధిస్తోంది. దీనివల్ల వారు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. కరోనా సోకి ఆసుపత్రిలో చేరిన బాధితుల్లో దాదాపు సగం మందిలో రెండేళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని లక్షణాలు వేధిస్తున్నాయట. ఈ మేరకు లాన్సెంట్‌ అధ్యయనం వెల్లడించింది. రెండేళ్ల క్రితం కరోనా వెలుగులోకి వచ్చిన తొలినాళ్లలో ఈ వైరస్‌ కారణంగా చాలా మంది ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. 

5. కిమ్‌ రాజ్యంలోకి కరోనా తొలి అడుగు..!

కరోనా మహమ్మారి ముందు ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్ ఉన్‌ ఓడిపోయారు. రెండేళ్లపాటు దేశంలోకి వైరస్ రాకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. తమ దేశంలో కరోనా అడుగుపెట్టిందని చివరకు కిమ్ అంగీకరించాల్సి వచ్చింది..! తాజాగా ఉత్తరకొరియా తొలి కొవిడ్-19 కేసును ధ్రువీకరించింది. దాంతో అక్కడి ప్రభుత్వం ‘తీవ్రస్థాయి జాతీయ అత్యయిక పరిస్థితి’ని విధించింది. దేశంలో బయటపడిన ఈ వైరస్‌ను పారదోలేందుకు కిమ్ ప్రతిజ్ఞ చేసినట్లు అక్కడి మీడియా సంస్థ వెల్లడించింది.


రివ్యూ: సర్కారువారి పాట


6. కరోనా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ..!

దేశంలో కరోనా వైరస్‌ అదుపులోనే ఉంది. తాజాగా 4.71 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,827 కొత్త కేసులొచ్చాయి. మరోరోజు మూడు వేల దిగువనే నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో 3,230 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా కొత్త కేసులు కంటే రికవరీలే ఎక్కువగా ఉండటం ఊరటనిస్తోంది. క్రియాశీల కేసులు 19 వేలకు పడిపోయాయి. సుమారు రెండేళ్లలో 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 98.74 శాతం మంది వైరస్‌ను జయించారు.

7. పుతిన్‌ ఆర్థిక బలం ఆమె..!

రష్యా పదేళ్ల వ్యవధి లోపలే రెండు యుద్ధాలు చూసింది. ఈ క్రమంలో అమెరికా సహా పశ్చిమ దేశాలు అత్యంత కఠినమైన ఆంక్షలు విధించి మాస్కోను అణచివేయాలని యత్నిస్తున్నాయి. కానీ, వాటన్నింటిని తట్టుకొని రష్యా నిలదొక్కుకొంది. ఒక దశలో అమెరికా ఆర్థిక ఖడ్గమైన డాలర్‌తో తలపడేందుకు కూడా సిద్ధమైంది. అధ్యక్షుడు పుతిన్‌ వ్యూహాలకు తగినట్లు దేశ ఆర్థిక ప్రణాళికను తయారు చేసి.. దానిని పక్కాగా అమలు చేయడంలో క్రెమ్లిన్‌ బృందం ఇప్పటి వరకు సఫలమైంది.

8. 122 మంది ప్రయాణికులు ఉన్న విమానంలో మంటలు

చైనాలో త్రుటిలో పెను విమాన ప్రమాదం తప్పింది. చాంగ్‌కింగ్ విమానాశ్రయంలో టేకాఫ్‌ అవుతున్న విమానంలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే, సిబ్బంది అప్రమత్తమై ప్రయాణికులను దించేయడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో 25 మంది గాయపడ్డారు.  టిబెట్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం నింగ్చి ప్రాంతానికి బయల్దేరుతుండగా ఈ ఘటన జరిగింది.


Viral Video: కదులుతున్న రైలు నుంచి జారిన మహిళ.. రక్షించిన కానిస్టేబుల్‌..


9. అందుకే నాకు పెళ్లి కావడం లేదు: కంగన

బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ వివాహ వార్త కోసం ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆమె ఎవరితో ఏడు అడుగులు వేయనున్నారు? అనే అంశంపై ఆసక్తిగా ఉన్నారు. ఈ తరుణంలో తన పెళ్లిపై కంగన స్పందించారు. కొంతమంది వ్యాప్తి చేస్తోన్న పుకార్ల వల్లే తనకు పెళ్లి కావడం లేదని కంగన అన్నారు. ప్రస్తుతం ‘ధకడ్‌‌’ సినిమా ప్రమోషన్స్‌ పనుల్లో ఆమె బిజీగా ఉన్నారు. స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

10. నేను సెలెక్టర్ అయితే.. టీ20 ప్రపంచకప్‌లో డీకే పక్కా: గావస్కర్‌

బెంగళూరు బ్యాట్స్‌మన్‌, వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తీక్ ప్రస్తుతం జరుగుతోన్న టీ20 లీగ్ 15వ సీజన్‌లో రెచ్చిపోతున్న సంగతి తెలిసిందే. ఫినిషర్‌గా దంచికొడుతూ ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీంతో ఎలాగైనా రాబోయే టీ20 ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోవాలని చూస్తున్నాడు. ఇదే విషయంపై బ్యాటింగ్‌ దిగ్గజం సునీల్‌ గావస్కర్‌ స్పందిస్తూ.. తాను టీమ్‌ఇండియా సెలెక్టర్‌ అయితే కచ్చితంగా అతడిని ఎంపిక చేస్తానని చెబుతున్నాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని