Updated : 24 May 2022 13:11 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. Vundavalli: ఆ మూడు పార్టీల మద్దతు భాజపాకే.. అందుకే ఏమీ అనరు: ఉండవల్లి

దేశంలోని పరిణామాలను చూస్తే ఆందోళన కలుగుతోందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ అన్నారు. రాజకీయాల్లోకి మతాన్ని తీసుకొచ్చి వివాదం చేయొద్దని ఆయన హితవు పలికారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘అసలు మనం ఎటుపోతున్నామో తెలియని పరిస్థితి నెలకొని ఉంది. రాష్ట్రంలోని వైకాపా, తెదేపా, జనసేన.. ఈ మూడు పార్టీలూ  భాజపాకే మద్దతిస్తున్నాయి. ఆ పార్టీల నేతలు వాళ్లలో వాళ్లు తిట్టుకుంటారు కానీ.. భాజపాను ఒక్క మాట కూడా అనరు’’ అని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వాళ్లే ‘శేఖర్‌’ సినిమాను చంపేశారు: నిర్మాత సుధాకర్‌రెడ్డి

రాజశేఖర్‌ కథానాయకుడిగా తాను నిర్మించిన ‘శేఖర్‌’ సినిమాను ఆపేసి అన్యాయం చేశారని ఆ చిత్ర నిర్మాత సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సినిమాలో శివానీ, శివాత్మక పేర్లు మాత్రమే ఉన్నాయని.. వారు నిర్మాతలు కాదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.‘‘డిజిటల్‌ ప్రొవైడర్లు ఆపేయడం వల్లే ‘శేఖర్‌’ సినిమా ఆగిపోయింది. సినిమా ఆపేయాలని కోర్టు ఎక్కడా చెప్పలేదు. డిజిటల్‌ ప్రొవైడర్లకు డబ్బు కట్టి ఒప్పందం చేసుకున్నా. వాళ్లు ‘శేఖర్‌’ సినిమాను చంపేశారు’’ అని సుధాకర్‌రెడ్డి చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఐఎస్‌బీ విద్యార్థులపై నిఘా.. దుర్మార్గమైన చర్య: నారాయణ

ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) 20వ వార్షికోత్సవం, స్నాతకోత్సవాన్ని ఈనెల 26న హైదరాబాద్‌లో నిర్వహించనున్నారు. దీనికి ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో ఐఎస్‌బీ విద్యార్థులపై నిఘా పెట్టారని.. అది అప్రజాస్వామికమని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన బిజినెస్‌ స్కూల్‌ అని.. అందులో శిక్షణ పొందిన విద్యార్థులు కూడా అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పాత్ర వహించే అవకాశం ఉందని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీ సీఎం జగన్‌ను కలిసిన తెలంగాణ మంత్రి కేటీఆర్‌

ఏపీ సీఎం జగన్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్‌ కలిశారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఇరు రాష్ట్రాల నుంచి తమ ప్రతినిధులతో వెళ్లిన జగన్‌, కేటీఆర్‌.. వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు. పర్యటనలో భాగంగా మంగళవారం జగన్‌తో కేటీఆర్‌ సమావేశమయ్యారు. ఈ మేరకు కేటీఆర్‌ ట్వీట్‌ చేస్తూ జగన్‌తో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Sri Lanka Crisis: లీటర్‌ పెట్రోల్‌ రూ.420, డీజిల్‌ రూ.400

పొరుగున ఉన్న ద్వీపదేశం శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆ దేశాన్ని ఇంధన కొరత తీవ్రంగా వేధిస్తోంది. దాంతో మంగళవారం చమురు ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. లీటర్ పెట్రోల్‌ ధర 24.3 శాతం మేర పెరిగింది. డీజిల్ ధర 38.4 శాతం అధికమైంది. ఆర్థికంగా ఇక్కట్లు పడుతోన్న ఆ దేశంలో ఏప్రిల్ 19 తర్వాత చేసిన రెండో సవరణ ఇది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.82 పెరగ్గా.. ప్రస్తుతం రూ.420కి లభిస్తోంది. రూ.111 అదనపు భారం పడటంతో.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. India Corona: అదుపులో కరోనా.. రెండు వేల దిగువకు కొత్త కేసులు

స్వల్పహెచ్చుతగ్గులతో దేశంలో కరోనావైరస్ వ్యాప్తి అదుపులోనే ఉంది. సోమవారం 4 లక్షల మంది వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయించుకోగా.. 1,675 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 400 మేర కేసులు తగ్గాయి. ఇప్పటివరకూ 4.31 కోట్ల మందికి పైగా కరోనా బారినపడగా.. 4.26 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. నిన్న ఒక్కరోజే 1,635 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. క్రియాశీల కేసులు 14,841కి చేరాయి. రికవరీ రేటు 98.75 శాతంగా ఉండగా.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ITR: ఈ 10 సందర్భాల్లో ఐటీఆర్‌ సమర్పించాల్సిందే.. మరి మీరు ఈ కేటగిరీలో ఉన్నారా?

సాధారణంగా ఆదాయం పన్ను మినహాయింపు పరిమితి దాటినప్పుడు లేదా మన ఆదాయంలో మూలం వద్దే పన్ను కోత ఉంటేనే ఐటీ రిటర్నులు దాఖలు చేయాలని (ITR Filing) భావిస్తుంటారు. కానీ, అది నిజం కాదు. ఆదాయ పన్ను చట్టం (IT Act)లోని సెక్షన్‌ 139 ఏయే సందర్భాల్లో ఐటీఆర్‌ (ITR) దాఖలు చేయాలో స్పష్టంగా చెబుతోంది. ఈ నిబంధనల్లో ఇటీవల కేంద్రం కొన్ని మార్పులు కూడా చేసింది. మరి రిటర్నులు సమర్పించాల్సిన 10 సందర్భాలేంటో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అప్పుడు జహీర్‌, నెహ్రాను చూశా.. ఇప్పుడు అర్ష్‌దీప్‌: సెహ్వాగ్

పంజాబ్‌ యువ పేసర్‌ అర్ష్‌దీప్‌సింగ్‌ టీమ్‌ఇండియాకు ఎంపికవ్వడంపై మాజీ ఓపెనర్‌ వీరేందర్‌ సెహ్వాగ్‌ హర్షం వ్యక్తం చేశాడు. అర్ష్‌దీప్‌సింగ్‌ ఈ సీజన్‌లో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 10 వికెట్లే తీసినా ఎకానమీ 7.70గా నమోదైంది. దీంతో టీమ్‌ఇండియా సెలెక్షన్‌ కమిటీ వచ్చేనెల దక్షిణాప్రికాతో జరిగే 5 టీ20ల సిరీస్‌కు అతడిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో అతడి బౌలింగ్‌పై సెహ్వాగ్‌ ఓ క్రీడా ఛానల్‌తో స్పందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మ్యూజికల్‌ సన్యాసిగా మారుదామనుకున్నా..కోటి

సుస్వరాల సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు తనయుడిగా, సంగీత చక్రవర్తికి శిష్యుడిగా ఎన్నో వందల చిత్రాలకు పని చేశారు సాలూరి కోటేశ్వరరావు అలియాస్‌ కోటి. పాటల పూదోటలో విరబూసిన గులాబీలాంటి వారు ఆయన. అగ్ర సంగీత దర్శకుల హవా నడుస్తున్న సమయంలోనే తనదైన బాణీలతో మెలోడీ పాటలతో ఆకట్టుకున్నారు. దాదాపుగా 400 చిత్రాలకు సంగీతాన్ని అందించారు. అంతేకాదు ఔత్సాహిక గాయనీగాయకులు ఎంతో మందిని ప్రోత్సహిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌లో సత్తా చాటుకున్న ప్రముఖ సంగీత దర్శకుడు కోటి ‘ఈటీవీ చెప్పాలని ఉంది’ కార్యక్రమంలో ఎన్నో విశేషాలను తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. 12 రోజుల క్రితం అదృశ్యమైన గాయని ఘటన విషాదాంతం...

దేశ రాజధానిలో 12 రోజుల క్రితం అదృశ్యమైన హరియాణాకు చెందిన గాయని ఘటన విషాదాంతమైంది. హరియాణాలోని రోహతక్‌ జిల్లాలోని మెహమ్‌ హైవే సమీపంలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. దిల్లీలో నివసించే గాయని సంగీత.. మే 11 నుంచి కనిపించడం లేదు.  మూడ్రోజుల అనంతరం యువతి అదృశ్యమైనట్లు ఆమె కుటుంబసభ్యులు సమీప పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పనిచేస్తున్న రవి, రోహిత్‌లు కిడ్నాప్‌ చేశారని వారు అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని