Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 01 Jun 2022 13:37 IST

1. గతేడాది ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర ఐటీ ఉద్యోగాలు: కేటీఆర్‌

కరోనా పరిస్థితులు ఉన్నా గతేడాది ఐటీ రంగంలో అంచనాలకు మించి రాణించామని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ చెప్పారు. హైదరాబాద్‌లో గత 8 ఏళ్లలో ఐటీ పరిశ్రమ వేగంగా అభివృద్ధి సాధించిందన్నారు. హైటెక్‌సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో 2021-22 ఏడాదికి ఐటీ వార్షిక నివేదిక విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

2. మహానాడుకు వచ్చిన జనాన్ని చూస్తే వాళ్ల గుండె ఆగుతుంది: అయ్యన్న

ఇటీవల ఒంగోలులో నిర్వహించిన మహానాడుకు వచ్చిన జనాలను చూస్తే వైకాపా నాయకుల గుండె ఆగిపోతుందని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. అరాచక పాలన అంతానికి మహానాడు సభ నాంది అని చెప్పారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో అయ్యన్న కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.


Video: అదనపు కట్నం కోసం భార్యను వేధించి,చంపిన భర్త


3. గుడ్‌ న్యూస్‌.. వాణిజ్య సిలిండర్‌పై భారీ తగ్గింపు..

నిత్యావసరాల ధరల మోతతో అల్లాడిపోతున్న వేళ ఇంధన తయారీ సంస్థలు ఓ శుభవార్త చెప్పాయి. వాణిజ్య సిలిండర్‌ ధరపై భారీ తగ్గింపు ప్రకటించాయి. 19 కేజీల కమర్షియల్‌ సిలిండర్‌పై రూ.135 మేర తగ్గిస్తున్నట్లు చమురు సంస్థలు బుధవారం వెల్లడించాయి. ఈ తగ్గింపు నేటి(జూన్‌ 1) నుంచే అమల్లోకి వస్తుందని తెలిపాయి. తాజా తగ్గింపుతో దిల్లీలో 19 కేజీల వాణిజ్య సిలిండర్‌  ధర రూ.2,335.50 నుంచి రూ.2,219కు దిగొచ్చింది. 

4. తగ్గిన విమాన ఇంధన ధరలు.. ఈ ఏడాదిలో తొలిసారి

విమాన ఇంధనం ఏవియేషన్‌ టర్బైన్ ఫ్యుయల్‌ ధరల్ని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ బుధవారం తగ్గించింది. ఈ ఏడాది ధరల్ని తగ్గించడం ఇదే తొలిసారి. ప్రస్తుతం దిల్లీలో కిలో లీటర్‌ ఏటీఎఫ్‌ ధర 1.3 శాతం తగ్గి రూ.1.21 లక్షలకు చేరింది. మే 16న ఏటీఎఫ్‌ ధరలు 5 శాతం పెరగడంతో కిలోలీటర్‌ ధర రూ.1.23 లక్షలకు చేరింది. ఈ ఏడాది ఆరంభంలో రూ.72,062గా ఉన్న కిలోలీటర్‌ విమాన ఇంధన ధర భారీగా పెరిగి రూ.1.23 లక్షల వద్ద జీవనకాల గరిష్ఠానికి చేరింది.

5. 18 వేల మార్కు దాటిన క్రియాశీల కేసులు

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉంది. అయితే.. క్రియాశీల కేసులు క్రమంగా పెరుగుతుండటం కాస్త ఆందోళన కలిగిస్తోంది. బుధవారం కేంద్రం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. క్రియాశీల కేసులు 18 వేల మార్కు దాటాయి. నిన్న 4.55 లక్షల మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,745 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం పాజివిటీ రేటు 0.60 శాతానికి చేరింది. 24 గంటల వ్యవధిలో 2,236 మంది కోలుకున్నారు. 


Video: ఆంక్షలు రష్యాపై.. ప్రభావం ఐరోపాపై..!


6. రష్యన్లను అడ్డుకోవడానికి రాకెట్లు కావాలా.. తీసుకోండి..!

డాన్‌బాస్‌ ప్రాంతంలోకి చొచ్చుకొస్తున్న రష్యాను అడ్డుకొనేందుకు ఉక్రెయిన్‌ చేతికి అమెరికా అత్యాధునిక రాకెట్‌ లాంఛర్లను ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ధ్రువీకరించారు. ఉక్రెయిన్‌ గురిచూసి దాడి చేసే సామర్థ్యాన్ని అత్యాధునిక రాకెట్లు మరింత పెంచుతాయన్నారు. అయితే.. ఈ రాకెట్లతో రష్యా భూభాగంలో ఎలాంటి దాడులు చేయబోమని ఉక్రెయిన్‌ హామీ ఇవ్వడంతో బైడెన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ లభించినట్లు సమాచారం.

7. సిద్ధూ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటాం.. తెరపైకి మరో గ్యాంగ్‌స్టర్‌

ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యతో పంజాబ్‌లో మరోసారి ముఠాకక్షలు తెరపైకి వచ్చాయి. సిద్ధూ హత్య తన పనేనని గోల్డీ బ్రార్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ ఫేస్‌బుక్‌లో పెట్టిన విషయం తెలిసిందే. కాగా.. ఈ హత్యకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ తాజాగా మరో గ్యాంగ్‌స్టర్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడం కలకలం రేపుతోంది. గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ బావ్నాకు సంబంధించిన ఓ సోషల్‌మీడియా ఖాతాలో నిన్న ఓ పోస్ట్‌ కన్పించింది.

8. కాంగ్రెస్‌తో పనిచేయడమా..? అది నన్నూ ముంచేస్తుంది..!

ఎన్నికల్లో వరుస ఓటములు, నాయకత్వ లేమితో కాంగ్రెస్ పార్టీ కొట్టుమిట్టాడుతోంది. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్(పీకే) ఆ పార్టీతో కలిసిపనిచేస్తారని వార్తలు వినిపించినా.. అవి కార్యరూపం దాల్చలేదు. తాజాగా బిహార్‌లో పర్యటిస్తోన్న ఆయన ఇక తానెప్పుడూ కాంగ్రెస్‌ పార్టీతో కలిసి పనిచేయనని దండం పెట్టి మరీ చెప్పారు.


‘మనం రేపు బతికున్నా లేకున్నా’.. అభిమానులతో కేకే ఆఖరి మజిలీ


9. ప్రపంచ నంబర్‌ 1కు షాక్‌.. జకోవిచ్‌ను ఓడించిన రఫెల్‌ నాదల్‌

ఫ్రెంచ్ ఓపెన్‌లో స్పెయిన్‌ బుల్‌, మట్టి కోర్టు రారాజు రఫెల్‌ నాదల్‌ మరోసారి అదరగొట్టాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన పురుషుల సింగిల్స్‌ విభాగం క్వార్టర్‌ ఫైనల్స్‌లో ప్రపంచ నంబర్‌ 1 నొవాక్‌ జకోవిచ్‌ను మట్టికరిపించి సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. క్వార్టర్‌ ఫైనల్స్‌లో  6-2, 4-6, 6-2, 7-6 (7/4) తేడాతో జకోవిచ్‌పై నాదల్‌ విజయం సాధించాడు. ఈ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో నాదల్‌ సెమీస్‌ చేరడం ఇది 15వ సారి.

10. రష్యా అణు యుద్ధ విన్యాసాలు..!

ఉక్రెయిన్‌పై యుద్ధం తీవ్రమవుతున్న కొద్దీ రష్యా అణు సన్నద్ధతను పెంచుకొంటోంది. తాజాగా 1,000 మంది సిబ్బందితో యుద్ధవిన్యాసాలు చేపట్టింది. ఈ విషయాన్ని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మాస్కోలోని ఇవనోవ్‌ ప్రావిన్స్‌లో ఈ విన్యాసాలను చేపట్టింది. దీనిలో 100 వాహనాలతో పాటు యార్స్‌ ఖండాంతర బాలిస్టిక్‌ మిసైల్‌ లాంఛర్లను కూడా వినియోగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని