Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Jun 2022 13:11 IST

1. CM Jagan: ఆ శక్తి చదువుకే ఉంది: సీఎం జగన్‌

సమాజం, దేశం, మనిషి తలరాత మార్చే శక్తి చదువుకే ఉందని సీఎం జగన్‌ అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ‘జగనన్న అమ్మఒడి’ నిధుల విడుదల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. చదువే నిజమైన ఆస్తి అని గ్రహించాలన్నారు. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతికే శక్తి చదువుకే ఉందని జగన్ తెలిపారు.‘‘ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డకు చదువు అందాలన్నదే నా తపన.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. LAC: భారత సరిహద్దుల్లో బలపడిన డ్రాగన్‌ రెక్కలు..!

వాస్తవాధీన రేఖ వెంట చైనా భారీ ఆయుధాలను చేర్చింది. అత్యాధునిక ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలను సరిహద్దులకు తరలించింది. వెస్ట్రన్‌ సెక్టార్‌లో ఎల్‌ఏసీ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోపు దీర్ఘశ్రేణి శతఘ్నులు, రాకెట్‌ వ్యవస్థలను ఏర్పాటు చేయడంతోపాటు రన్‌వేల అభివృద్ధి చేపట్టింది. వీటితోపాటు ఫైటర్‌ జెట్‌లను భద్రపర్చేందుకు బ్లాస్ట్‌ప్రూఫ్‌ బంకర్ల నిర్మాణం కూడా చేపట్టింది. భారత్‌తో వివాదం మొదలైన రెండేళ్లలోనే వీటిని సిద్ధం చేసినట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు అంచనావేశాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. నిందితుల డీఎన్‌ఏ సేకరణకు కోర్టు అనుమతి

రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్‌లో (Jubilee hills) బాలికపై సామూహిక అత్యాచారం (Gang Rape) కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో నిందితుల డీఎన్‌ఏ (DNA) సేకరించటానికి నాంపల్లి కోర్టు (Nampally Court) అనుమతినిచ్చింది. దీంతో పోలీసులు నిందితుల డీఎన్‌ఏను సేకరించి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపనున్నారు. అత్యాచారం జరిగినట్లు పోలీసులు తెలిపిన ఇన్నోవా వాహనంలో ఇప్పటికే అధికారుల బృందం ఆధారాలను సేకరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. Maharashtra: ఒక్కో ఎమ్మెల్యే రూ.50కోట్లకు అమ్ముడుపోయారు..

శివసేనపై తిరుగుబావుటా ఎగురవేసిన అసమ్మతి ఎమ్మెల్యేలకు కేంద్ర ప్రభుత్వం ‘వై ప్లస్‌’ భద్రత కల్పించడంపై ఆ పార్టీ తీవ్ర స్థాయిలో విరుకుపడింది. భాజపా అసలు రంగు బయటపడిందంటూ దుయ్యబట్టింది. ఈ మేరకు శివసేన అధికారిక పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో ఘాటు వ్యాఖ్యలు చేసింది. అసమ్మతి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు రూ.50కోట్లకు అమ్ముడుపోయారంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* ప్రతిపక్షంలో మేమింకా 2-3 రోజులే.. భాజపా మంత్రి కీలక వ్యాఖ్యలు..!

5. Andhra News: ముఖ్యమంత్రి పర్యటనలో కేంద్ర మాజీ మంత్రి అలక

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి (CM Jagan) శ్రీకాకుళం పర్యటనలో ప్రోటోకాల్‌ వివాదం తలెత్తింది. ప్రొటోకాల్‌ జాబితాలో తన పేరు లేదంటూ కేంద్ర మాజీ మంత్రి, వైకాపా నేత కిల్లి కృపారాణి (Killi Krupa Rani) అలిగారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహం వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్‌ వద్దకు వచ్చిన కృపారాణి.. ప్రోటోకాల్‌ జాబితాలో పేరు లేకపోవడంపై అసంతృప్తికి గురయ్యారు. ఇదేమైనా న్యాయమా అంటూ అధికారులను నిలదీశారు. ‘నా పేరే మర్చిపోయారా..’ అంటూ ఆక్రోశం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Chiranjeevi: చిరు మాటలకు రావురమేశ్‌ ఉద్వేగం.. వీడియో వైరల్‌

అలనాటి విలక్షణ నటుడు రావు గోపాలరావు(Rao GopalRao), ఆయన కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi). అప్పట్లో ఆయన టైమింగ్‌ని తాను ఇష్టపడ్డానని.. ఇప్పుడు వాళ్లబ్బాయి రావు రమేశ్‌(Rao Ramesh) నటన తనకెంతో నచ్చుతోందని చిరు అన్నారు. ‘పక్కా కమర్షియల్‌’(Pakka Commercial) ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా చిరు పాల్గొన్నారు. ‘‘రావుగోపాలరావుతో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన్ని నేను చిన్నమామయ్య అని పిలిచేవాడిని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Russia: 104 ఏళ్ల తర్వాత తొలిసారి రుణ చెల్లింపులో రష్యా విఫలం ..!

విదేశీ రుణాల చెల్లింపులు చేయలేని స్థితికి రష్యా చేరింది. దాదాపు 100 ఏళ్ల తర్వాత మాస్కో ఇలాంటి పరిస్థితికి చేరడం గమనార్హం. ఈ విషయాన్ని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. రష్యా వద్ద 100 మిలియన్‌ డాలర్ల రుణ చెల్లింపులు చేసేందుకు నిధులు ఉన్నాయి. కానీ, ఆంక్షల కారణంగా అంతర్జాతీయ రుణదాతలకు చెల్లింపులు చేయలేకపోయింది. ఇప్పటికే రుణచెల్లింపులు ఆపకూడదని భావించిన క్రెమ్లిన్‌కు ఇది పెద్ద ఎదురు దెబ్బ. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. HMDA: ప్రారంభమైన రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల లాటరీ ప్రక్రియ

బండ్లగూడ, పోచారంలోని రాజీవ్‌ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించిన విషయం తెలిసిందే. ఈ ఫ్లాట్ల విక్రయానికి హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) నోటిఫికేషన్‌ ఇవ్వగా.. ఇవాళ ఉదయం 9 గంటలకు లాటరీ ప్రక్రియను ప్రారంభించారు. బండ్లగూడలోని 2,246 ఫ్లాట్ల కొనుగోలు కోసం 33,161 దరఖాస్తులు రాగా.. పోచారంలోని 1,470 ఫ్లాట్ల కోసం 5,921 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తుదారులకు లాటరీ పద్ధతిలో ఇవాళ ఫ్లాట్లను కేటాయించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అశ్వారావుపేటలో ఉద్రిక్తత.. రణరంగంగా మారిన గిరిజనల ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామన్నగూడెం గిరిజనులు తలపెట్టిన ‘ప్రగతిభవన్‌కు పాదయాత్ర’ కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. భూసమస్యలు పరిష్కరించాలంటూ ఈ ఉదయం రామన్నగూడెం నుంచి పాదయాత్రగా 200 మంది గూడెం వాసులు తమ పిల్లలతో కలిసి హైదరాబాద్ ప్రగతి భవన్‌కు బయలుదేరారు. భూ సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేసేది లేదని వారు తేల్చి చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Hardik Pandya: టీమ్‌ఇండియా టీ20 సారథిగా హార్దిక్‌ కొత్త రికార్డు

గతరాత్రి ఐర్లాండ్‌తో జరిగిన పోరులో టీమ్‌ఇండియా సునాయాస విజయం సాధించింది. ఆతిథ్య జట్టు నిర్దేశించిన 109 పరుగుల లక్ష్యాన్ని 9.2 ఓవర్లలో ఛేదించి సిరీస్‌లో 1-0తో శుభారంభం చేసింది. అయితే, ఇదే మ్యాచ్‌లో తొలిసారి అంతర్జాతీయ క్రికెట్‌లో కెప్టెన్సీ చేపట్టిన హార్దిక్‌.. మరోకొత్త రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. పొట్టి ఫార్మాట్‌లో టీమ్‌ఇండియా ఎనిమిదో సారథిగా బాధ్యతలు చేపట్టిన అతడు.. ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ ఓపెనర్‌ స్టిర్లింగ్‌ (4)ను ఔట్‌ చేయడం ద్వారా వికెట్‌ తీసిన తొలి సారథిగా అరుదైన రికార్డు నెలకొల్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

India Corona: తగ్గినట్లే తగ్గి.. మళ్లీ పెరిగిన కొత్త కేసులు..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని