Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Jul 2022 13:09 IST

1. మీర్‌పేట్‌ను మంత్రి సబిత నాశనం చేస్తున్నారు: తీగల తీవ్ర ఆరోపణలు

తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డిపై జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌, తెరాస నేత తీగల కృష్ణారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. మీర్‌పేట్‌ను సబిత నాశనం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. తమ ప్రాంతం కోసం అవసరమైతే ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని చెప్పారు. సబిత కబ్జాలను ప్రోత్సహిస్తున్నారని.. చెరువులు, పాఠశాలల స్థలాలను వదలడం లేదని తీగల ఆరోపించారు. తమ పార్టీ నుంచి సబిత ఎమ్మెల్యేగా గెలవలేదన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. తుపాకీ నీడన అమెరికా.. అత్యాధునిక ఆయుధంతో 22ఏళ్ల యువకుడి కాల్పులు

అమెరికాను తుపాకీ నీడ వీడటంలేదు. ఆ దేశ స్వాతంత్ర్య దినోత్సవ పరేడ్‌లో కూడా ఓ దుండగుడు అత్యాధునిక రైఫిల్‌తో మారణహోమానికి పాల్పడ్డాడు. ఫలితంగా ఆరు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. జులై 4వ తేదీన అమెరికాలోని చికాగో శివార్లలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల పరేడ్‌లో ఓ ముష్కరుడు విచ్చలవిడిగా కాల్పులు జరిపాడు. ఫలితంగా ఆరుగురు చనిపోగా 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. దుండగుడు  ఓ రిటైల్‌ స్టోర్‌పైకి ఎక్కి అక్కడి  నుంచి పరేడ్‌పై కాల్పులు జరిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి కన్నుమూత

సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి (86) కన్నుమూశారు. అనారోగ్యంతో హైదరాబాద్‌లోని నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ‘ఈనాడు’ సహా పలు దినపత్రికల్లో శ్రీహరి పనిచేశారు. 55 ఏళ్లపాటు సినీ విశ్లేషకుడిగా, పాత్రికేయుడిగా సేవలందించారు. ‘తెలుగు ఫిలిం ఇండస్ట్రీ’ అనే పుస్తకాన్ని ఆయన రచించారు. గుడిపూడి శ్రీహరి మృతికి పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆ చిన్నారిని కలిశాక.. నాలో విశ్వాసం పెరిగింది: మోదీ

గుజరాత్‌లోని గాంధీనగర్‌లో ‘డిజిటల్‌ భారత్‌’ వారోత్సవాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ 11 ఏళ్ల దివ్యాంగ చిన్నారితో ముచ్చటించిన ప్రధాని.. ఆ బాలుడ్ని చూసి ముచ్చటపడిపోయారు. ఆ చిన్నారిని కలిశాక.. ఈ దేశం ఎక్కడా ఆగిపోదని తనలో విశ్వాసం మరింత పెరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. డిజిటల్‌ ఇండియా వారోత్సవాలను ప్రారంభించిన ప్రధాని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ప్రీమియం తగ్గించుకోండిలా..

5. మురుగు కాల్వలో దిగి వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి నిరసన

నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని ఉమ్మారెడ్డి గుంటలో వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నిరసనకు దిగారు. మురుగు కాల్వ ఉన్న ప్రాంతంలో వంతెన నిర్మాణం చేపట్టాలని గత కొంతకాలంగా ఆయన డిమాండ్‌ చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే కాల్వలోకి దిగి నిరసన తెలిపారు. ఇప్పుడు తాము అధికారంలో ఉన్నప్పటికీ వంతెన నిర్మాణం జరగలేదని కోటంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవం

నగరంలోని బల్కంపేటలో ఉన్న ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, దేవాదాయశాఖ కమిషనర్‌ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అమ్మవారి కల్యాణాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచే బారులు తీరారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘నాన్న మీరే నా హీరో’ : ఆస్పత్రిలో లాలూ.. భావోద్వేగ పోస్టు పెట్టిన కుమార్తె..!

రెండురోజుల క్రితం మెట్లపైనుంచి జారిపడిన రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత, బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీపు భాగాన గాయమై భుజం విరగడంతో ఆయనకు పట్నాలోని పారస్‌ ఆసుపత్రిలో ఐసీయూలో వైద్యం అందిస్తున్నారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మూత్రపిండ మార్పిడి చికిత్స కోసం విదేశాలకు వెళ్లేందుకు ఎదురుచూస్తున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

జలమయమైన ముంబయి.. మరోసారి భారీ వర్ష సూచన

8. టెస్టు క్రికెట్‌ చరిత్రలో టాప్‌-4 భారీ లక్ష్య ఛేదనలు ఇవే..!

భారత్‌తో కరోనా కారణంగా వాయిదాపడిన ఐదో టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ విజయం వైపు దూసుకెళ్తోంది. 378 పరుగుల లక్ష్య ఛేదనలో ఇప్పటికే 259/3 స్కోరు చేసిన ఇంగ్లాండ్‌ ఆఖరి రోజు మరో 119 పరుగులు మాత్రమే చేయాల్సి ఉంది. ఒక వేళ ఇంగ్లాండ్‌ విజయం సాధిస్తే ఐదు టెస్టుల సిరీస్‌ 2-2తో సమమవుతుంది. మన బౌలర్లు విజృంభించి వికెట్లు పడగొడితే భారత్‌ 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. ఈ క్రమంలో టెస్టు క్రికెట్‌లో అత్యధిక పరుగుల ఛేదన చేసిన టాప్‌-4  మ్యాచ్‌లేవి..? ఇంగ్లాండ్‌ ఛేదించిన భారీ లక్ష్యమెంత..? పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పుచ్చకాయలకు ఇళ్లు.. సంక్షోభంలో చైనా రియల్‌ ఎస్టేట్‌ ..!

‘‘నాన్‌జింగ్‌లోని ఓ రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్‌ కిలో పుచ్చకాయలకు 20 యువాన్ల చొప్పున లెక్క గట్టి గృహ కొనుగోలు చెల్లింపులుగా అంగీకరిస్తోంది’’ అంటూ చైనా ప్రభుత్వ రంగ పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ ఇటీవల గొప్పగా ఓ కథనం రాసింది. దానిలోనే రియల్‌ ఎస్టేట్‌ డెవలపర్లు గోధుమలు, అల్లం ఇతర వ్యవసాయోత్పత్తుల రూపంలో చెల్లింపులు స్వీకరిస్తూ ఇళ్లను విక్రయిస్తున్నారని వెల్లడించింది. ఇదంతా రైతులు ఇళ్లు కొనేలా ప్రోత్సహించేందుకు చేస్తున్నట్లు పేర్కొంది. చైనా వాస్తవ పరిస్థితిని కప్పిపెట్టేందుకు గ్లోబల్‌ టైమ్స్‌ వండి వార్చిన కథనం అది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘సీసా’ తో షేక్ చేస్తున్న అన్వేషి జైన్.. హుషారు వెనక విషాదం ఇదీ!

 ‘ఊ అంటావా మావా’ పాటతో సమంత ఇటీవల ఎంత మత్తెక్కించిందో ఇప్పుడు ‘నా పేరు సీసా’ (Naa Peru Seesa) అంటూ అన్వేషి జైన్‌ (Anveshi Jain) అంతే కిక్కేక్కిస్తోంది. ‘సీకాకుళం సారంగి’గా తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగిస్తోంది. ఒకే ఒక్క పాటతో తన గురించి తెలుసుకునేలా చేస్తోంది. ఈ క్రమంలో అన్వేషి పేరు ట్రెండింగ్‌లో నిలిచింది. తెరపై కనిపిస్తున్న ఆమె హుషారైన డ్యాన్స్‌ వెనక చాలామందికి తెలియని ఎన్నో విషాద సంఘటనలు దాగున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని