Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 25 Sep 2022 13:11 IST

1. నేడు ధోనీ కీలక ప్రకటన.. ఆందోళనలో అభిమానులు..

భారత మాజీ సారథి ఎంఎస్‌ ధోనీ.. సోషల్‌మీడియా వేదికగా శనివారం అభిమానులనుద్దేశించి పెట్టిన ఓ కీలక ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఓ ఆసక్తికర వార్తతో మీ ముందుకు వస్తానని ధోనీ ప్రకటించాడు. దీంతో మహీ ఏం ప్రకటిస్తాడోనని అభిమానులు అతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే.. భారత టీ20 లీగ్‌ నుంచి కూడా రిటైర్మెంట్‌ ప్రకటిస్తాడా..? అని పలువురు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అవార్డు వస్తే.. డబ్బులతో కొన్నానని ట్రోల్‌ చేశారు: దుల్కర్‌ సల్మాన్‌

‘మహానటి’తో తెలుగువారికి ఎంతగానో చేరువైన మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్ (Dulquer Salmaan)‌. ‘సీతారామం’  లాంటి మనసుని హత్తుకొనే ప్రేమకావ్యంలో ఓ వైపు ప్రేమికుడిగా, మరోవైపు సైనికుడిగా తన నటనతో ఆయన అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్నాడు. ఇప్పుడైతే దుల్కర్‌ ప్రశంసలు అందుకుంటున్నారు కానీ గతంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. స్టార్‌హీరో మమ్ముట్టి కుమారుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటికీ దుల్కర్‌ సూటిపోటి మాటలు ఎదుర్కొక తప్పలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘ఆధారాలు నాశనం చేసేందుకే రిసార్టు కూల్చివేత’..!

ఉత్తరాఖండ్‌లో కొద్దిరోజులుగా కనిపించకుండా పోయి, శవమై తేలిన యువతి హత్యకేసు దర్యాప్తు మలుపులు తిరుగుతోంది. ఆ యువతి నీట మునిగి చనిపోయినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదిక పేర్కొంది. రిషికేశ్‌లోని ఎయిమ్స్‌ ఈ నివేదకను విడుదల చేసింది. చనిపోవడానికి ముందు ఎవరో తీవ్రంగా కొట్టినట్లు ఆధారాలు ఉన్నాయని దానిలో పేర్కొన్నారు. మరోవైపు మృతురాలి కుటుంబీకులు పోస్టుమార్టం తుది నివేదిక వచ్చేవరకూ అంత్యక్రియలు నిర్వహించమని బాధితురాలి తండ్రి తేల్చిచెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కాళ్లవాపు వస్తే కిడ్నీ జబ్బు ఉన్నట్టేనా..? నిజమెంతో తెలుసుకోండి..!

నడుంనొప్పి వస్తే చాలు కిడ్నీ జబ్బు వచ్చిందని, అందులో రాళ్లు ఉన్నాయని భయపడతాం. అలాగే మూత్రం రంగు మారితే, కాళ్ల వాపు వస్తే కిడ్నీలు పాడైనట్టు అనుమానిస్తాం. ఇందులో కొంత నిజం లేకపోలేదని వైద్యులు చెబుతున్నారు. శరీరంలో ఏ మార్పు వచ్చినా జాగ్రత్తగా గమనించాలి. ఏ మాత్రం నిర్లక్ష్యం చేసినా ప్రమాదం బారిన పడే వీలుంది. కొన్నిరకాల జబ్బుల్లోనూ కాళ్ల వాపు వస్తుందని ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్‌ శ్రీభూషణ్‌ రాజు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. భారత్‌ ఒక వారధి.. గళం.. దారి.. దృక్కోణం: జైశంకర్‌

భిన్న ధ్రువాలుగా విడిపోయిన ప్రస్తుత ప్రపంచంలో భారతదేశ పాత్ర చాలా కీలకమైందని విదేశాంగమంత్రి జైశంకర్‌ అన్నారు. ప్రపంచం భారత్‌ను తృతీయ ప్రపంచ దేశాల గళంగా పరిగణిస్తోందని తెలిపారు. ఐరాస సర్వప్రతినిధి సభలో శనివారం ప్రసంగించిన ఆయన సుదీర్ఘ అమెరికా పర్యటనలో ఒక భాగం పూర్తిచేసుకున్నారు. ఆదివారం వాషింగ్టన్‌కు బయలుదేరనున్న ఆయన మరిన్ని సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇప్పటి వరకు ఆయన వివిధ దేశాలకు చెందిన దాదాపు 100 మందికి పైగా ప్రతినిధులు, విదేశాంగమంత్రులతో భేటీ అయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మరోసారి కవ్వించిన ఉత్తరకొరియా..!

ఉత్తరకొరియా మరోసారి ఉద్రిక్తతలను రాజేసింది. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 7గంటలకు స్వల్పశ్రేణి క్షిపణిని ప్రయోగించింది. ఈ విషయాన్ని దక్షిణ కొరియా సైన్యం వెల్లడించింది. టైకాన్‌ అనే ప్రదేశం నుంచి ప్రయోగించిన ఈ క్షిపణి 60 కిలోమీటర్ల ఎత్తులో ప్రయాణించి దాదాపు 600 కిలోమీటర్ల దూరంలో పడింది. దక్షిణ కొరియాతో సంయుక్తంగా నిర్వహించనున్న సైనిక విన్యాసాల కోసం అమెరికా అణుశక్తి ఎయిర్‌ క్రాఫ్ట్‌ క్యారియర్‌ రోనాల్డ్‌ రీగన్‌ కొరియా ద్వీపకల్పంలోని బుసాన్‌ పోర్టుకు చేరుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

👆లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

7. ఎన్టీఆర్‌ పేరు మార్పు.. వైకాపా చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే: జీవీఎల్‌

ఏపీ ప్రభుత్వం ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చడంపై విమర్శల వెల్లువ కొనసాగుతోంది. ఇప్పటికే విపక్ష నేతలతో పాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని సంఘాల ప్రతినిధులు వైకాపా ప్రభుత్వం తీరును తప్పుబట్టారు. ఈ నిర్ణయంపై తాజాగా భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. అల్లుఅర్జున్‌ అంటే ఇష్టమంటున్న ప్రముఖ బాలీవుడ్‌ నటుడు..

ప్రముఖ నటుడు అల్లుఅర్జున్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశ వ్యాప్తంగా ఫ్యాన్‌ఫాలోయింగ్‌ ఉంది. ఈ ఐకాన్‌స్టార్‌ అభిమానుల జాబితాలోని సెలబ్రిటీల సంఖ్య తక్కువేం కాదు. తాజాగా ఓ బాలీవుడ్ నటుడు తనకు అల్లుఅర్జున్‌ అంటే ఇష్టమంటూ ప్రకటించాడు.  అతడు ఏవరో కాదు.. బాలీవుడ్ యాక్షన్‌ హీరో ‘టైగర్‌ ష్రాఫ్‌’. వైవిధ్యభరితమైన యాక్షన్‌ కథలతో అభిమానులను అలరించే ఈ యువ హీరో ఇటీవల తన అభిమానులతో ఇన్‌స్టా వేదికగా ముచ్చటించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రచారానికి పోతే.. పరువు తుస్‌

 ప్రచారం కోసమో.. మరే ప్రయోజనం ఆశించారో తెలియదు కానీ, మధ్యప్రదేశ్‌లోని శహడోల్‌ జిల్లా జైసింగ్‌ నగర్‌ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి అత్యుత్సాహం ఇపుడు ఆయన మెడకు చుట్టుకుంటోంది. ఈ పాఠశాలలో అయిదో తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మాసిన యూనిఫాంతో రావడం ఆ టీచరు గమనించారు. విద్యార్థిని చేత దుస్తులు విప్పించి తానే శుభ్రంగా ఉతికారు. చాలాసేపు ఆ విద్యార్థిని అర్ధనగ్నంగా అలాగే నిలబడిపోయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. UNSCలో భారత్‌కు శాశ్వత హోదా.. మద్దతు పలికిన రష్యా

ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కల్పించడంపై రష్యా తన మద్దతును ప్రకటించింది. ఈ హోదా పొందడానికి భారత్‌తో పాటు బ్రెజిల్‌కు అన్ని అర్హతలు ఉన్నాయని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రెండు దేశాలు చాలా కీలకమైనవని ఆ దేశ విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్‌ పేర్కొన్నారు. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలి కూర్పులో మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని