Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 27 Sep 2022 13:11 IST

1. మన్కడింగ్‌ ఎఫెక్ట్‌.. ఇక నుంచి క్రీజులోనే ఉంటా: చార్లీ డీన్‌

ఇంగ్లాండ్‌తో మూడో వన్డేలో ఆ జట్టు బ్యాటర్‌ చార్లీ డీన్‌ను భారత ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మన్కడింగ్‌ చేయడం ప్రపంచ క్రికెట్‌లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ రనౌట్‌పై డీన్‌ ఎట్టకేలకు స్పందించింది. ఆ ఘటనను ఉద్దేశిస్తూ ఇక నుంచి క్రీజులోనే ఉంటానంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో రాసుకొచ్చింది. లార్డ్స్‌ మైదానంలో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసిన చార్లీ డీన్‌.. ‘‘వేసవికి ఆసక్తికర ముగింపు. ఇంగ్లాండ్‌ జెర్సీలో లార్డ్స్‌లో ఆడటం ఎనలేని గౌరవంగా భావిస్తున్నా. ఇక నుంచి నేను నా క్రీజులోనే ఉంటానని అనుకుంటున్నా’’ అని పోస్ట్‌ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పుతిన్‌ అణు బెదిరింపుల మర్మం ఏమిటీ..!

ఐరోపా ఖండంపై అణుముప్పు ముసిరింది. అమెరికా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వాస్తవానికి ఉక్రెయిన్‌తో యుద్ధానికి ముందు నుంచే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ అణ్వాయుధాల జపం చేస్తున్నారు. ఒక దశలో ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మానియేల్‌ మేక్రాన్‌ ముఖం మీదే వీటి ప్రస్తావన తీసుకొచ్చారు. కానీ, అప్పట్లో రష్యా విజయం నల్లేరుపై నడక వంటిదే అనుకొని అణ్వాయుధ ప్రయోగాన్ని అందరూ తేలిగ్గా తీసుకొన్నారు. కానీ, ఆరు నెలలు పూర్తైనా రష్యాకు విజయం దక్కలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తానా బోర్డు సభ్యుడి భార్య, ఇద్దరు కుమార్తెలు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టెక్సాస్‌లోని వాలర్‌ కౌంటీ వద్ద జరిగిన ఈ ఘటనలో తానా బోర్డు సభ్యుడు డాక్టర్‌ కొడాలి నాగేంద్ర శ్రీనివాస్‌ భార్య వాణిశ్రీ, ఇద్దరు కుమార్తెలు మృతి చెందారు. శ్రీనివాస్‌ భార్య తమ కుమార్తెలను కళాశాల నుంచి తీసుకొస్తుండగా వారు ప్రయాణిస్తున్న కారును ఓ వ్యాను బలంగా ఢీకొట్టింది. దీంతో ఘటనాస్థలంలోనే ఇద్దరు చనిపోగా.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సిప్‌ చేస్తున్నారా.. ఈ 5 తప్పులు చేయొద్దు!

దీర్ఘకాలంలో సంపదను సృష్టించడానికి క్రమానుగత పెట్టుబడి విధానం (SIP) అత్యంత సులభమైన మార్గం. క్రమశిక్షణతో క్రమం తప్పకుండా మదుపు చేస్తూ ఉంటే పెద్ద మొత్తంలో డబ్బును కూడబెట్టుకోవచ్చు. అయినప్పటికీ, కొంతమంది కొన్ని చిన్న చిన్న పొరపాట్లు చేయడం వల్ల వారి SIP రాబడిని పెంచుకోవడంలో విఫలమవుతుంటారు! మరి ఆ తప్పులేంటి? వాటిని ఎలా నివారించొచ్చో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సుప్రీంకోర్టులో మొదలైన ప్రత్యక్ష ప్రసారాలు.. కేసుల విచారణ చూడండి..!

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) చర్రితలో కొత్త ఒరవడి మొదలైంది. మంగళవారం(సెప్టెంబరు 27) నుంచి రాజ్యాంగ ధర్మాసనం కేసుల విచారణ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైంది. ప్రస్తుతానికి యూట్యూబ్‌ వేదికగా వీటిని ప్రసారం చేస్తున్నారు. త్వరలోనే సొంత మాధ్యమం ఏర్పాటు చేసుకోనున్నట్లు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యు.యు. లలిత్‌ నిన్న తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించే ప్రయోగం విజయవంతం..

గ్రహశకలాల నుంచి మానవాళిని రక్షించేందుకు కీలక ముందడుగు పడింది. భూ గ్రహం వైపు ప్రమాదకరంగా దూసుకొచ్చే గ్రహ శకలాల కక్ష్యను మార్చే లక్ష్యంతో అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ‘డార్ట్‌ (డబుల్‌ ఆస్ట్రాయిడ్‌ రీడైరెక్ట్‌ టెస్ట్‌)’ మిషన్‌ విజయవంతమైంది. ఇందుకోసం డిడిమోస్‌, డైమార్ఫస్‌ అనే జంట గ్రహశకలాలను నాసా ఎంచుకుంది. ఈ ప్రయోగంలో భాగంగా నాసా స్పేస్‌క్రాఫ్ట్‌ భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున డైమార్ఫస్‌ను ఢీకొట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పీఎఫ్‌ఐపై మరోసారి ఎన్‌ఐఏ దాడులు

ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ) నేతలకు చెందిన ప్రదేశాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) ఇతర దర్యాప్తు సంస్థలతో కలిసి మరోసారి దాడులు నిర్వహిస్తోంది. పీఎఫ్‌ఐ సంస్థతో సంబంధం ఉన్న సభ్యుల కార్యాలయాలపై మంగళవారం సోదాలు చేపట్టింది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, అస్సాం, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ, తెలంగాణ, కేరళ వంటి పలు రాష్ట్రాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. విదేశాల నుంచి నిధులు అందుకొని, దేశంలో మత విద్వేషాలు రెచ్చగొడుతోందన్న.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ‘పొన్నియిన్‌ సెల్వన్‌’.. ముఖ్యమైన ఈ పది పాత్రలు గురించి మీకు తెలుసా?

పొన్నియిన్‌ సెల్వన్‌.. ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లోనే కాదు, సినీ అభిమానుల్లో ట్రెండ్‌ ఇదే. మణిరత్నం కలల ప్రాజెక్టు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబరు 30న తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. దక్షిణాపథాన్ని పరిపాలించిన చోళుల ఇతివృత్తంగా కల్కి కృష్ణమూర్తి రాసిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా మణిరత్నం దీనిని తెరకెక్కించారు. మరి వీరిలో ముఖ్య పాత్రలు ఎవరు? సినిమాలో వారి నేపథ్యం ఏంటి? చూసేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. మాకు భారత్‌, పాక్‌ రెండూ ముఖ్యమైన దేశాలే..!

పాకిస్థాన్‌ ఎఫ్‌-16 యుద్ధవిమానాలకు అవసరమైన కీలక పరికరాలను అమెరికా సరఫరా చేయడంపై ఇటీవల భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ చేసిన వ్యాఖ్యలపై బైడెన్‌ కార్యవర్గం స్పందించింది. అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి నెడ్‌ ప్రైస్‌ మాట్లాడుతూ ‘‘మేము భారత్‌, పాకిస్థాన్‌ సంబంధాల్లో.. ఒకదానిని దృష్టిలో పెట్టుకొని మరొకదానిని చూడం. వేర్వేరు అంశాల ఆధారంగా మాకు రెండూ వేటికవే ముఖ్యమైన భాగస్వాములు. మేము వారితో పరస్పర అంశాల్లో కలిసి పనిచేశాం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జగన్‌ను మించిన నియంతలా పెద్దారెడ్డి: అచ్చెన్నాయుడు

తాడిపత్రిలో తమ పార్టీ కౌన్సిలర్ విజయ్ కుమార్‌పై వైకాపా గూండాల దాడి హేయమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. విజయ్‌కుమార్‌పై వైకాపాకు చెందిన నలుగురు వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారని.. రెండు రోజుల క్రితం మరో కౌన్సిలర్‌ మల్లికార్జున పైనా దాడి చేశారని ఆరోపంచారు. దళితులపై సీఎం జగన్‌ కక్ష కట్టారని అచ్చెన్న మండిపడ్డారు. రాష్ట్రంలో ‘వైఎస్సార్‌ దళితులపై దాడులు కానుక’ పథకం అమలవుతోందని ఆయన ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని