Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Sep 2022 14:07 IST

1. ఇందిరాదేవి కన్నుమూత.. వెక్కివెక్కి ఏడ్చిన సితార..

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌ బాబు తల్లి ఇందిరాదేవి (Indira Devi)(70) మరణంతో ఘట్టమనేని కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. కుటుంబసభ్యులు, సన్నిహితులు, ప్రముఖుల సందర్శనార్థం ఆమె పార్థివదేహాన్ని పద్మాలయ స్టూడియోలో ఉంచారు. ఆమెకు తుది నివాళి అర్పించేందుకు సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పీఎఫ్‌ఐ ‘మిషన్‌ 2047’.. సభ్యుల ఇళ్లల్లో బాంబు తయారీ పత్రాలు

ఉగ్ర సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలపై ఇస్లామిక్‌ అతివాద సంస్థ పాపులర్‌ ఫ్రంట్ ఆఫ్‌ ఇండియా (పీఎఫ్‌ఐ)ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పీఎఫ్‌ఐ సభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై ఇటీవల ఎన్ఐఏ దేశవ్యాప్త దాడుల అనంతరం కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. కాగా.. ఈ సోదాల్లో దర్యాప్తు సంస్థలు అత్యంత కీలకమైన ‘నేరపూరిత పత్రాలను’ స్వాధీనం చేసుకున్నాయి. పీఎఫ్‌ఐ ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడుతోందన్న ఆరోపణలకు ఆధారంగా పేర్కొంటున్న ఆ పత్రాల వివరాలను దర్యాప్తు ఏజెన్సీలు తాజాగా బయటపెట్టాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అమరావతి పరిరక్షణే ధ్యేయంగా.. 17వ రోజుకు రైతుల మహాపాదయాత్ర

అమరావతి పరిరక్షణ కోసం రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర 17వ రోజుకు చేరుకుంది. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఇది కొనసాగుతోంది. పెదపాడు మండలం కొత్తూరు నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. అమరావతి రథం వద్ద జేఏసీ నాయకులు పూజలు చేసిన అనంతరం యాత్రను ప్రారంభించారు. పలువురు తెదేపా, జనసేన నేతలు, వివిధ సంఘాల ప్రతినిధులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాజకుటుంబీకులకు సుధామూర్తి పాదాభివందనం.. నెట్టింట చర్చ

ఇన్ఫోసిస్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌, రచయిత్రి సుధామూర్తి ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్‌మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. ఆ ఫొటోలో ఆమె రాజకుటుంబీకులకు పాదాభివందనం చేయడమే అందుకు కారణం. దీనిపై నెట్టింట భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి అది 2019 నాటి ఫొటో. మైసూరు రాజ్య చివరి మహారాజు జయచామరాజ వడియార్‌ శత జయంతి ఉత్సవాలకు సుధామూర్తి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తిరుమలలో వైభవంగా చిన్నశేష వాహన సేవ

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఉదయం చిన్న శేష వాహన సేవను వైభవంగా నిర్వహించారు. తిరుమాడ వీధుల్లో నిర్వహించిన ఈ సేవలో శ్రీమలయప్పస్వామి చిన్నశేషవాహనం పైనుంచి భక్తులకు అభయ ప్రదానం చేశారు. ఈ వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాత్రి 7 గంటల తర్వాత హంస వాహన సేవ నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఐటీ నోటీసులు అందాయా? ముందు లోపమేంటో గుర్తించండి!

ఆదాయ పన్ను విభాగం నుంచి నోటీసు అనగానే చాలా మంది హడలెత్తిపోతుంటారు. కానీ, అన్ని సందర్భాల్లో భయపడాల్సిన అవసరం లేదు. ఐటీ నోటీసు అంటే మీ ఐటీ పత్రాల్లో సమస్య ఉందని తెలియజేస్తూ పంపే రాతపూర్వక సమాచారం మాత్రమే. దీనికి ఒక్కోసారి మీరు తిరిగి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి అవసరం ఉండదు. కేవలం సమస్య ఉందని తెలియజేసి మరోసారి అలాంటి తప్పు జరగకుండా చూసుకోవాలని హెచ్చరిస్తుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్‌ ఎంపికకు కారణాలు ఇవేనా...!

‘బాహుబలి, బహుబలి-2’ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరో ప్రభాస్‌. ఈ పాన్‌ ఇండియా స్టార్‌కి భారత్‌లోనే కాకుండా విదేశాల్లోనూ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. ప్రస్తుతం అతడు హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో తెరెకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఈ సినిమాలో అతడు రాముడిగా కనిపించనున్నారు.  అతడికున్న కొన్ని ప్రత్యేకమైన లక్షణాల వల్లే తనని ఈ పాత్రకు దర్శకుడు ఎంపిక చేశారంటున్నారు ఫ్యాన్స్. అవేంటో మీరు చూసేయండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రవీంద్ర జడేజాను మనం మిస్‌ అవుతాం.. కానీ..

ఆస్ట్రేలియాపై సిరీస్‌ విజయంతో లభించిన జోరును రోహిత్‌ సేన తదుపరి మ్యాచ్‌ల్లోనూ కొనసాగించాలని చూస్తోంది. ఆసీస్‌పై తొలి మ్యాచ్‌లో పరాజయం పాలైనప్పటికీ.. తర్వాతి రెండు మ్యాచ్‌లో పుంజుకున్న తీరు అద్భుతం. ఈ సిరీస్‌ విజయంలో స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ కీలక భూమికను పోషించిన విషయం తెలిసిందే. రవీంద్ర జడేజా స్థానంలో జట్టులోకి వచ్చిన అతడు‌.. ఈ సిరీస్‌లో ఎక్కువ వికెట్లు తీసుకోవడమే కాకుండా.. పొదుపుగా బౌలింగ్‌ చేసి ఆకట్టుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నిన్న సిసోదియా సన్నిహితుడు.. నేడు మద్యం వ్యాపారి..!

దిల్లీ మద్యం కుంభకోణం(Delhi Liquor scam) కేసులో పలు అరెస్టులు కొనసాగుతున్నాయి. మనీలాండరింగ్ అభియోగాల కింద బుధవారం ఉదయం ఈడీ(ED) మద్యం వ్యాపారి సమీర్‌ మహేంద్రును అరెస్టు చేసింది. ఈ కేసులో రాత్రి మొత్తం ప్రశ్నించిన అనంతరం అతడిని కస్టడీలోకి తీసుకుంది. ప్రస్తుతం సమీర్‌.. ఇండోస్పిరిట్స్ సంస్థకు ఎండీగా వ్యవహరిస్తున్నారు. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోదియా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్ x దక్షిణాఫ్రికా.. ఎవరిది ఆధిపత్యం?

టీ20 ప్రపంచకప్‌ ముంగిట ఈ ఫార్మాట్లో ఛాంపియన్‌ అయిన ఆస్ట్రేలియా మీద సిరీస్‌ గెలిచింది టీమ్‌ఇండియా. ఇప్పుడు సఫారీలతో పొట్టి సిరీస్‌ ఆడేందుకు సిద్ధమైంది. బుధవారం నుంచి భారత్‌-సౌతాఫ్రికా మధ్య మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ప్రారంభంకానుంది. తిరువనంతపురంలో తొలి టీ20 జరగనుంది. టీమ్‌ఇండియా, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటివరకు 20 టీ20లు జరిగాయి. 11 మ్యాచ్‌ల్లో భారత్‌ విజయం సాధించగా.. దక్షిణాఫ్రికా ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఒక దాంట్లో ఫలితం తేలలేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts