Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 Sep 2022 13:02 IST

1. పోటీ చేయట్లేదు.. ఖర్గేకే నా మద్దతు: దిగ్విజయ్‌ సింగ్‌

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక వ్యవహారం పూటకో మలుపు తిరుగుతోంది. అధ్యక్ష పదవి కోసం చివరి నిమిషంలో సీనియర్‌ నేత మల్లికార్జున ఖర్గే బరిలోకి వచ్చారు. దీంతో ఆయనకు మద్దతుగా ఎంపీ దిగ్విజయ్‌ సింగ్‌ పోటీ నుంచి వైదొలిగారు. ఈ విషయాన్ని డిగ్గీరాజా స్వయంగా వెల్లడించారు. అధ్యక్ష పదవికి ఖర్గే పోటీ చేయనున్నారనే వార్తలు వెలువడగానే.. శుక్రవారం ఉదయం దిగ్విజయ్‌ ఆయన నివాసానికి వెళ్లారు. ఖర్గేతో కొంతసేపు భేటీ అయిన తర్వాత మరో సీనియర్‌ నేత కేసీ వేణుగోపాల్‌తో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ..ఇందుకే ఆఫీస్‌కు రమ్మనేది!

ప్రముఖ వ్యాపారవేత్త హర్ష గోయెంకా నెట్టింట్లో తరచూ ఆసక్తికర విషయాలు పంచుకుంటుంటారు. తాజాగా ఆయన ఇంటి నుంచి కంటే ఆఫీస్‌ నుంచి పనిచేయడం వల్ల కలిగే ప్రయోజనాలు వెల్లడించారు. పై ఛార్ట్ రూపంలో ఆయన ఇచ్చిన వివరణ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. కరోనాకు ముందు వర్క్‌ ఫ్రమ్‌ హోం అనే పదం పెద్దగా వినిపించేది కాదు. కానీ మహమ్మారి కాలంలో ఇది అత్యంత వాడుకలోకి వచ్చింది. పలు రంగాలకు చెందిన ఉద్యోగులు  ఇంటి నుంచే కార్యకలాపాలు చక్కబెట్టాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. రెపోరేటు మరో అరశాతం పెంపు

పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను మరోసారి పెంచింది. రెపో రేటును మరో 0.50 శాతం పెంచి, 5.90 శాతానికి చేర్చింది. ఈ మేరకు ఈనెల 28-29ల్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నరు శక్తికాంత దాస్‌ శుక్రవారం వెల్లడించారు. మేలో 0.40 శాతం; జూన్‌, ఆగస్టులో 0.50 శాతం చొప్పున, తాజాగా మరో 0.50 శాతం పెంచడంతో 4 నెలల వ్యవధిలోనే రెపోరేటు (బ్యాంకులకు ఇచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీ) 1.90 శాతం పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీనివాసుడు కల్పవృక్ష వాహనంపై దర్శనమిచ్చారు. తిరుమాడ వీధుల్లో ఛర్నాకోల్‌ చేతబట్టి రాజమన్నార్‌ రూపధారిగా దేవదేవుడు భక్తులకు అభయ ప్రదానం చేశారు. శ్రీవారి వాహన సేవను తిలకించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. రాత్రికి సర్వభూపాల వాహన సేవ నిర్వహించనున్నారు. మరోవైపు తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని దర్శించుకునేందుకు 8 గంటల సమయం పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. తాప్సీ అలా చెబితే నేను బాధపడతా: కరణ్‌ జోహార్‌

సెలబ్రిటీ చాట్‌ షో ‘కాఫీ విత్‌ కరణ్‌’ సీజన్‌ - 7 ముగిసింది. 12 వారాలపాటు ప్రేక్షకుల్ని అలరించిన ఈ షోలో ఆలియా భట్‌ - రణ్‌వీర్‌ సింగ్‌, జాన్వికపూర్‌ - సారా అలీఖాన్‌, అక్షయ్‌కుమార్‌ - సమంత, విజయ్‌ దేవరకొండ - అనన్యా పాండే, అమిర్‌ఖాన్‌ - కరీనాకపూర్‌, విక్కీకౌశల్‌ - సిద్ధార్థ్‌ మల్హోత్ర.. ఇలా పలు జంటలు పాల్గొని సందడి చేశాయి. తాజాగా ప్రసారమైన 13వ ఎపిసోడ్‌లో ఈ షోకు జ్యురీ సభ్యులుగా వ్యవహరిస్తోన్న సోషల్‌మీడియా సెలబ్రిటీలు పాల్గొని.. కరణ్‌ను పలు ఆసక్తికర ప్రశ్నలు అడిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లో.. మోదీ రయ్ రయ్‌

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన సొంతరాష్ట్రం గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్‌ - ముంబయి మధ్య సెమీ హైస్పీడ్ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును ప్రధాని ప్రారంభించారు. అనంతరం రైలులో కొంతదూరం ప్రయాణించారు. ఈ ఉదయం 10.30 గంటల ప్రాంతంలో గాంధీనగర్‌ క్యాపిటల్‌ రైల్వే స్టేషన్‌లో ఈ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఆ తర్వాత రైలెక్కి అందులోని వసతులను పరిశీలించారు. అలాగే అహ్మదాబాద్‌లోని కాల్పుర్‌ రైల్వే స్టేషన్‌ వరకు ప్రయాణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఉత్సాహంగా రాజధాని రైతుల మహాపాదయాత్ర

అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని ప్రాంత రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర ఏలూరు జిల్లాలో ఉత్సాహంగా సాగుతోంది. 19వ రోజుకు చేరుకున్న పాదయాత్ర.. దెందులూరు నియోజకవర్గం పెరుగ్గూడెం నుంచి ప్రారంభమై ద్వారకా తిరుమల మండలం నక్క పంగిడిగూడెం వద్ద గోపాలపురం నియోజవర్గంలో ప్రవేశించింది. సూర్యచంద్ర రావుపేట, గొల్లగూడెం, తిమ్మాపురం మీదుగా సాయంత్రానికి ద్వారకా తిరుమల వరకు కొనసాగుతుంది. తిమ్మాపురంలో మధ్యాహ్నం 2 గంటలకు రైతులు భోజన విరామం తీసుకుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు.. లలితా త్రిపుర సుందరీదేవిగా కనక దుర్గమ్మ

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఐదోరోజు లలితా త్రిపుర సుందరీదేవి అలంకారంలో కనకదుర్గమ్మ దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించుకునేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివచ్చారు. దీంతో ఆలయం వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. IND Vs SA : బుమ్రా స్థానంలో మహమ్మద్‌ సిరాజ్‌

వెన్ను గాయం కారణంగా టీమ్‌ఇండియా పేస్‌ గన్‌ బుమ్రా.. దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌తో పాటు టీ20 ప్రపంచకప్‌ టోర్నీకీ దూరమైన విషయం తెలిసిందే. దీంతో అతడి స్థానంలో హైదరాబాద్‌ పేసర్‌ మహమ్మద్‌ సిరాజ్‌ను సెలక్షన్‌ కమిటీ ఎంపిక చేసింది. సఫారీలతో టీ20 సిరీస్‌ తదుపరి మ్యాచ్‌లకు అతడిని ఎంపిక చేసినట్లు ప్రకటించింది. మరోవైపు బుమ్రా గాయంపై కూడా బీసీసీఐ స్పష్టత ఇచ్చింది. ‘బుమ్రా వెన్ను గాయానికి గురయ్యాడు. అతడు బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నాడు’ అని అధికారికంగా ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పీఎస్‌-1: తారల పారితోషికమెంతో తెలుసా?

మణిరత్నం దర్శకత్వంలో పాన్‌ఇండియా స్థాయిలో తెరకెక్కిన చిత్రం ‘పొన్నియిన్‌ సెల్వన్‌-1’. కాగా.. ఇందులో ప్రధాన పాత్రలు పోషించిన నటీనటుల పారితోషికం భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం ఎవరు ఎంత పారితోషికం తీసుకున్నారంటే... విక్రమ్‌ - రూ.12 కోట్లు, ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ - రూ.10 కోట్లు, జయం రవి - రూ. 8 కోట్లు, కార్తి - రూ. 5 కోట్లు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని