Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 09 Nov 2022 13:02 IST

1. ఇప్పుడిప్పుడే సంపాదిస్తున్నారా? ఈ 10 టిప్స్‌ మీ కోసమే!

అత్యాధునిక సాంకేతికత, మారుతున్న ప్రజల అవసరాలు, జీవన విధానాల్లో వస్తున్న మార్పుల కారణంగా నేటితరం యువత ఏదో ఒకరకమైన ఉపాధి పొందే వరకు విశ్రమించడం లేదు. పైగా ఖర్చులు పెరిగిపోతున్న నేపథ్యంలో తల్లిదండ్రులకు భారం కాకుండా వీలైనంత త్వరగా ఉద్యోగమో లేక వ్యాపారంలోనో స్థిరపడిపోవాలని చూస్తున్నారు. చిన్న వయసులోనే సంపాదించడం ప్రారంభిస్తే.. తొందరగా రిటైరై మలిదశ జీవితాన్ని ఆనందంగా గడపాలని కలలు కంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బైడెన్‌కు షాక్‌: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లదే హవా..!

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో అధికార డెమోక్రాట్లకు షాక్‌ తగిలే అవకాశం ఉంది. ప్రతినిధుల సభపై రిపబ్లికన్లకు నియంత్రణ లభించే అవకాశం ఉన్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఎన్నికలు జరిగిన చాలా చోట్ల రిపబ్లికన్ల జోరు కనిపిస్తోంది. డెమోక్రాట్ల ఆధీనంలో ఉన్న చాలా సీట్లు రిపబ్లికన్లకు దక్కే అవకాశం ఉంది. ఇదే జరిగితే ప్రతినిధుల సభ అధిపత్యం రిపబ్లికన్లకు దక్కి.. బైడెన్‌ కార్యవర్గ అజెండా అమల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మంత్రి గంగుల సహా గ్రానైట్‌ వ్యాపారుల ఇళ్లల్లో ఐటీ, ఈడీ సోదాలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదాయపన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో ఏకకాలంలో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. మంత్రి గంగుల కమలాకర్‌తో పాటు గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లోని పంజాగుట్టలోని పీఎస్‌ఆర్‌ గ్రానైట్స్‌, హైదర్‌గూడలోని జనప్రియ అపార్ట్‌మెంట్లలో తనిఖీలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4 . ‘కోహ్లీ.. రేపు సెలవు తీసుకోవచ్చు కదా’: ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ అభ్యర్థన

టీ20 ప్రపంచకప్‌లో కీలక సమరానికి టీమ్‌ఇండియా సన్నద్ధమవుతోంది. గురువారం జరిగే సెమీస్‌లో ఇంగ్లాండ్‌తో తలపడనుంది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు మాజీ సారథి, కింగ్ కోహ్లీ భీకర ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ మాజీ ఆటగాడు కెవిన్‌ పీటర్సన్‌.. కోహ్లీకి ఓ సరదా అభ్యర్థన చేశాడు. రేపటి మ్యాచ్‌కు ఆడకుండా విశ్రాంతి తీసుకోవాలని కోరాడు. ఇంగ్లాండ్‌తో సెమీఫైనల్ కోసం విరాట్ సిద్ధమవుతున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మన్మోహన్‌ సింగ్‌కు దేశం రుణపడి ఉంది: నితిన్‌ గడ్కరీ

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌ సింగ్‌కు దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. మన్మోహన్‌ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఉద్దేశిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పేద వర్గాలకు లబ్ధి చేకూర్చే ఉదారవాద ఆర్థిక విధానాల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గవర్నర్‌ను వెంటనే తొలగించండి.. రాష్ట్రపతికి డీఎంకే లేఖ

తమిళనాడు గవర్నర్‌, అధికార డీఎంకే మధ్య కొన్నాళ్లుగా ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోంది. వారి మధ్య ఘర్షణ వాతావారణం ముదిరి తాజాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ చెంతకు చేరింది. గవర్నర్  ఆర్‌ఎన్‌ రవి.. శాంతి భద్రతలకు ముప్పంటూ రాష్ట్రపతికి రాసిన లేఖలో డీఎంకే తీవ్ర వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు సేవ చేయనీకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అడ్డుకుంటున్నారని ఫిర్యాదు చేసింది. ఆయన ప్రకటనలు ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెంచే విధంగా ఉన్నాయని, కొన్ని ప్రసంగాలు విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని అందులో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. సీజేఐగా జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌.. ప్రమాణం చేయించిన రాష్ట్రపతి

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ చంద్రచూడ్‌ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. రెండేళ్లపాటు జస్టిస్ డీవై చంద్రచూడ్‌ రెండేళ్లపాటు (నవంబర్‌ 10, 2024) సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. 44 ఏళ్లక్రితం జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ తండ్రి జస్టిస్‌ యశ్వంత్‌ విష్ణు చంద్రచూడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం పనిచేస్తే, ఇప్పుడు తనయుడు అత్యున్నత పీఠాన్ని అధిరోహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నేను నటించిన ఆ సినిమా నచ్చిందని చెబితే.. షాక్‌ అవుతా..: అల్లు శిరీష్‌

ఈ హీరో ఇంటిపేరే ఓ బ్రాండ్‌. అలాంటి ఫ్యామిలీ నుంచి పరిశ్రమకు వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. కంటెంట్‌ ఉన్న కథలను ఎంచుకుంటూ ప్రతి చిత్రంతో ప్రేక్షకులకు దగ్గరవ్వడమే కాకుండా.. పాపులర్‌ ఈవెంట్స్‌కు హోస్ట్‌గా చేసి తన టాలెంట్‌తో ఆడియన్స్‌ను మరింత అలరిస్తున్నాడు. అతనే అల్లు శిరీష్‌. ఈ హీరో తాజాగా నటించిన చిత్రం ‘ఊర్వశివో.. రాక్షసివో’. ఈ సినిమా విశేషాలతోపాటు వ్యక్తిగత వివరాలెన్నో ఆలీతో పంచుకున్నాడు. ఆ కబుర్లు ఏంటో చూసేద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఉద్యమాలతో వచ్చిన స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తారా?: విశాఖలో కార్మికుల భారీ ర్యాలీ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కార్మికులు, నిర్వాసితులు విశాఖ నగరంలోని గాజువాకలో ఆందోళనకు దిగారు. త్వరలో ప్రధాని నరేంద్రమోదీ నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ‘ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో కార్మికులు, నిర్వాసితులు భారీ ర్యాలీ చేసేందుకు నిర్ణయించారు. దీనిలో భాగంగా విశాఖలోని డీఆర్‌ఎం కార్యాలయం నుంచి జీవీఎంసీ వరకూ ర్యాలీగా బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. జడేజా సతీమణికి భాజపా టికెట్‌..?

ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్‌లో కొద్దిరోజుల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాలను ఆకర్షిస్తున్నాయి. అధికార భాజపాను ఢీకొట్టేందుకు ఆప్‌ విస్తృత ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో బుధవారం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల పేర్లను కమలం పార్టీ ఖరారు చేయనుంది. ఆ నిమిత్తం పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కానుంది. కాగా, ఈ అభ్యర్థుల తుది జాబితాలో టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రీవాబా జడేజా పేరు వినిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని