Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 12 Nov 2022 13:06 IST

1. బహుముఖ రవాణా వ్యవస్థ దిశగా విశాఖ: ప్రధాని మోదీ

ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రా ప్రజలు తమ ప్రతిభను చాటుతున్నారని.. వైద్యం, వ్యాపారం, సాంకేతిక రంగాల్లో ఏపీ ప్రజలు రాణిస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. విశాఖ పర్యటనలో భాగంగా ఏయూ ప్రాంగణలోని ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా దాదాపు రూ.15వేల కోట్లకుపైగా విలువైన ప్రాజెక్టులను వర్చువల్‌ విధానంలో మోదీ ప్రారంభించారు. అనంతరం ప్రధాని మోదీ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కేంద్రంతో మా బంధం.. రాజకీయాలకు అతీతం: సీఎం జగన్‌

విభజన గాయాల నుంచి ఆంధ్రప్రదేశ్‌ ఇంకా పూర్తిగా కోలుకోలేదని సీఎం జగన్‌ అన్నారు.  కేంద్రం సహృదయంతో చేసే ప్రతి సాయం రాష్ట్ర పునర్‌నిర్మాణానికి ఉపయోగపడుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ అన్నారు. విశాఖలోని ఏయూ ఇంజినీరింగ్‌ కళాశాల మైదానంలో నిర్వహించి బహిరంగ సభలో జగన్‌ మాట్లాడారు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌, గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ట్విటర్‌ యూటర్న్‌.. బ్లూటిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ నిలిపివేత!

 ట్విటర్‌లో అధికారిక ఖాతాలకు ఇచ్చే ‘బ్లూ టిక్‌’ను ప్రీమియం సర్వీసుగా మార్చి తీసుకొచ్చారు కొత్త యజమాని ఎలాన్‌ మస్క్. ఈ బ్లూ టిక్‌కు నెలవారీ ఛార్జీలు ప్రకటించారు. అయితే దీనివల్ల నకిలీ ఖాతాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోవడంతో ఈ సర్వీసును నిలిపివేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ట్విటర్ బ్లూటిక్ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ కన్పించట్లేదని కొన్ని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హిమాచల్‌లో కొనసాగుతున్న పోలింగ్.. ఓటర్లు భారీగా తరలిరావాలన్న మోదీ..!

హిమాచల్ ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఈ ఓటింగ్‌.. సాయంత్రం 5 గంటల వరకు సాగుతుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. మొత్తం 68 నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 412 మంది బరిలో ఉన్నారు. ఈ సందర్భంగా హిమాచల్ వాసులంతా ఓటింగ్‌లో ఉత్సాహంగా పాల్గొనాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సిడ్నీ తీరంలో కలకలం.. క్రూజ్‌ నౌకలో 800 కొవిడ్ కేసులు..!

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అదుపులోకి వచ్చినట్లే కనిపిస్తోంది. అంతలోనే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని హెచ్చరించే ఘటనలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా దాదాపు 800 మంది కరోనా బాధితులతో ఉన్న ఒక క్రూజ్ నౌక ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేయాల్సి వచ్చింది. అందులో 4,600 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి బయలుదేరిన ఈ నౌక పేరు మేజెస్టిక్‌ ప్రిన్సెస్‌ క్రూజ్‌ షిప్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. NDTV ఓపెన్‌ ఆఫర్‌కు కొత్త తేదీ.. స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపిన అదానీ

ఎన్డీటీవీలో 26 శాతం వాటాల కొనుగోలుకు సంబంధించిన ఓపెన్‌ ఆఫర్‌ కొత్త తేదీలను అదానీ గ్రూప్‌ ప్రకటించింది. ఈ మేరకు ఆ గ్రూప్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీకి సమాచారమిచ్చింది. నవంబర్‌ 22న ఈ ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభమై.. డిసెంబర్‌ 5న ముగియనుంది. వాస్తవంగా అక్టోబర్‌ 17న ప్రారంభమై నవంబర్‌ 1 వరకు ఓపెన్‌ ఆఫర్‌ ముగియాల్సి ఉంది. ఎన్డీటీవీలో వాటాలు సొంతం చేసుకుంటున్నట్లు అదానీ గ్రూప్‌ ఆగస్టులో ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ICC: ఐసీసీ ఛైర్మన్‌గా మళ్లీ ఆయనే..!

అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ ICC) ఛైర్మన్‌గా గ్రెగ్‌ బార్‌క్లే మరోసారి నియమితులయ్యారు. శనివారం జరిగిన ఐసీసీ సమావేశంలో గ్రెగ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. న్యూజిలాండ్‌కు చెందిన గ్రెగ్‌ 2020 నవంబరులో తొలిసారిగా ఐసీసీ ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఈ ఏడాది నవంబరుతో ఆయన పదవీకాలం ముగియనుండగా.. ఛైర్మన్‌ పదవికి ఎన్నికలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ కారణంతో ఎన్నో అవకాశాలు చేజారాయి: రాధికా ఆప్టే

ప్రస్తుతం ఉన్న రోజుల్లో ప్రతి ఒక్కరూ యువ నటీమణులనే తమ సినిమాల్లో భాగం చేసుకోవాలని చూస్తున్నారని నటి రాధికా ఆప్టే అన్నారు. దానివల్ల తాను కొన్నిసార్లు ఆఫర్స్‌ చేజార్చుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ‘‘నటీమణులకు ఆఫర్స్‌ రావడంలో వయసు కూడా ఒక ప్రభావాన్ని చూపిస్తోంది. అందుకే బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ చిత్రాల్లో యువ నటీమణులకే ఎక్కువగా అవకాశాలు వస్తుంటాయి. తమ స్క్రిప్ట్‌కు తగిన విధంగా ఉండే యువ తారలను ఎంచుకోవడానికి ఫిల్మ్‌ మేకర్స్‌ ఎక్కువ ఆసక్తి కనబరుస్తారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డెబిట్‌ కార్డు లేకపోయినా UPI.. ఫోన్‌పేలో కొత్త సదుపాయం

దేశంలో జరిగే డిజిటల్‌ చెల్లింపుల్లో యూపీఐ (UPI)దే అగ్రస్థానం. ఇప్పటికే చాలా మంది థర్డ్‌ పార్టీ యాప్స్‌ ద్వారా ఈ సేవలను పొందుతున్నారు. అయితే, UPI సేవలను పొందాలంటే డెబిట్‌ కార్డు తప్పనిసరి. ఆ వివరాలు ఉంటేనే యూపీఐని యాక్టివేట్‌ చేసుకుని బ్యాంక్‌ లావాదేవీలు జరిపే వీలుంది. మరి కేవలం బ్యాంకు ఖాతా మాత్రమే కలిగి ఉండి డెబిట్‌ కార్డు లేకపోతే? ఇలాంటి వారి కోసమే ఫోన్‌పే (phonepe) కొత్త సదుపాయం తీసుకొచ్చింది. ఆధార్‌ కార్డు వివరాల ద్వారా యూపీఐకు రిజిస్టర్‌ అయ్యే సదుపాయం తీసుకొచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. సామ్‌ను మెచ్చుకున్న గుణశేఖర్‌.. నటి రిప్లయ్‌పై ఫ్యాన్స్‌ రెస్పాన్స్‌ ఇదే

అగ్రకథానాయిక సమంతపై ప్రశంసల వర్షం కురిపించారు దర్శకుడు గుణశేఖర్‌. ‘యశోద’లో సామ్ నటన చాలా బాగుందంటూ మెచ్చుకున్నారు. ‘‘సామ్‌ నటనలోని తీవ్రత, యాక్షన్‌ సీక్వెన్స్‌లతో ‘యశోద’ ఆసక్తికరంగా ఉంది. సినిమా ఆరంభంలో సామ్‌ను అమాయకపు అమ్మాయిగా చూపించి.. రానున్న మలుపులకు ఆవిధంగా దశను నిర్దేశించారు. సామ్‌.. ఈ సినిమాతో మరో విజయం నీ కిరీటంలో చేరింది’’ అని గుణ శేఖర్‌ పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు