Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Nov 2022 13:20 IST

1. మస్క్‌కు 8 డాలర్లు లభిస్తే.. ఎలీ లిల్లీకి 15 బిలియన్లు ఆవిరి..!

ట్విటర్‌ బ్లూటిక్‌ కోసం ఆత్రంగా 8 డాలర్లు వసూలు చేయడం.. ఓ కంపెనీ సంపద 15 బిలియన్‌ డాలర్లు(రూ.1.20లక్షల కోట్లు) ఆవిరి కావడానికి కారణమైంది. టెక్‌ దిగ్గజంగా పేరు తెచ్చుకున్న మస్క్‌ నిర్ణయాలు ప్రపంచంలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఆయన ట్విటర్‌ను కొనుగోలు చేస్తానని ప్రకటించిన నాటి నుంచి ఇది కొనసాగుతోంది. ఫార్మా రంగానికి చెందిన ఓ దిగ్గజ సంస్థకు ట్విటర్‌ నిర్ణయం చేదు అనుభవాన్ని మిగిల్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అలా కోరుకున్న జట్టే కప్‌ గెలుస్తుంది.. అదే ఈ ఆటలో మ్యాజిక్: ఏబీడీ

భారత్‌ను ఓడించి ఫైనల్‌కు చేరిన ఇంగ్లాండ్‌ జట్టు పాకిస్థాన్‌తో తలపడనున్న విషయం తెలిసిందే. అయితే టీ20 ప్రపంచకప్‌ తుది పోరులో గెలిచే జట్టుపై దక్షిణాఫ్రికా దిగ్గజం ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌ జట్టు కచ్చితంగా కప్‌ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. కానీ ఆట తీరుతెన్నులు తెలిసిన వాడిగా అదంత తేలిక కాదన్నాడు. ఈ మ్యాచ్‌లో మరింత జాగ్రత్తగా ఉండాలంటూ జోస్‌ బట్లర్‌ నేతృత్వంలోని జట్టును పరోక్షంగా హెచ్చరించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. త్వరలోనే గ్రూప్‌-4 నోటిఫికేషన్‌: తెలంగాణ మంత్రి హరీశ్‌రావు

కేంద్రం అగ్నిపథ్‌ పేరుతో నిరుద్యోగులను నిండా ముంచిందని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. యువత జీవితాల్ని నాశనం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయన్నారు. సిద్దిపేటలో కానిస్టేబుల్‌, ఎస్సై ఉద్యోగాలకు శిక్షణ పొందుతున్నవారికి పాలు, పండ్లను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలోనే రాష్ట్రంలో గ్రూప్‌ - 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గుంకలాంకు పవన్‌.. భారీ గజమాలతో ఘనస్వాగతం

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కాసేపట్లో విజయనగరం జిల్లా గుంకలాం చేరుకోనున్నారు. ‘జగనన్న ఇళ్లు.. పేదలందరికీ కన్నీళ్లు’ పేరుతో జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. దీనిలో భాగంగా గుంకలాంలో జగనన్న కాలనీని పవన్‌ పరిశీలించనున్నారు. విశాఖ నుంచి విజయనగరం వెళ్లే మార్గంలో పవన్‌కు జనసేన కార్యకర్తలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ఆనందపురం కూడలి వద్ద భారీ గజమాలతో ఆయన్ను సత్కరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఒక్క ఓటమి ఆధారంగా జట్టును జడ్జ్‌ చేయకండి.. : సచిన్‌

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో రోహిత్‌ సేన దారుణ ప్రదర్శనపై విమర్శలు కొనసాగుతూనే ఉన్నాయి. టీమ్‌ఇండియా అత్యంత అవమానకర రీతిలో ఓడిపోవడంపై క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఒక్క ఓటమి ఆధారంగా జట్టును జడ్జ్‌ చేయవద్దని విమర్శకులను కోరాడు. ‘సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై టీమ్‌ఇండియా ప్రదర్శనతో నేను కూడా నిరాశకు గురయ్యాను. అయితే, మనం భారత క్రికెట్‌ శ్రేయోభిలాషులం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. నానికి తెలియకుండా వీడియో షేర్‌ చేసిన శేష్‌.. ట్విటర్‌ వేదికగా నేచురల్‌ స్టార్‌ ప్రశ్న

నేచురల్‌ స్టార్‌ నానికి (Nani) తెలియకుండా ఆయన కార్యాలయంలో షూట్‌ చేసిన ఓ వీడియోను అడివి శేష్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. దీనిని చూసిన నాని.. ‘ఇలా కూడా చేస్తారా?’ అంటూ ట్విటర్‌ వేదికగా శేష్‌ని ప్రశ్నించాడు. ఇంతకీ ఆ వీడియో ఏమిటి? నాని ప్రారంభించిన ‘వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌’ బ్యానర్‌పై తెరకెక్కిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘హిట్‌ -2’. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వాల్‌ పోస్టర్‌ సినిమాస్‌ కార్యాలయానికి చేరుకున్న శేష్‌-మీనాక్షి ‘ఉరికే’ పాటకు డ్యాన్స్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 18వేల మందితో విశాఖ సాగర తీరంలో ‘నేవీ మారథాన్’

విశాఖ సాగరతీరంలో నిర్వహించిన నేవీ మారథాన్‌ ఉత్సాహంగా సాగింది. శారీరక, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ఫుల్‌ మారథాన్‌ (42కె), ఆఫ్‌ మారథాన్‌ (21కె), 10కె, 5కె విభాగాల్లో దాదాపు 18 వేల మంది యువతీ యువకులు పాల్గొని పరుగులు తీశారు. తొలుత ఆర్కేబీచ్‌ సమీపంలోని కాళీమాత ఆలయ ఆవరణలో నేవీ అధికారులు, సినీనటులు మిలింద్‌ సోమన్‌, అడివి శేష్‌ జెండా ఊపి ఈ మారథాన్‌లను ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. వచ్చేవారాంతంలోగా మళ్లీ ‘బ్లూటిక్‌’ సబ్‌స్క్రిప్షన్‌

నకిలీ ఖాతాలు పెరిగిపోవడంతో నిలిపివేసిన ‘బ్లూటిక్‌’ సబ్‌స్క్రిప్షన్‌ సదుపాయాన్ని ఎప్పుడు పునరుద్ధరిస్తారనే ప్రశ్నకు మస్క్‌ బదులిచ్చారు. వచ్చేవారాంతంలోగా తిరిగి ట్విటర్‌ బ్లూ సేవల్ని అందుబాటులోకి తీసుకొస్తామని ఓ యూజర్‌ అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ తెలిపారు. మరోవైపు పేరడీ ఖాతాలు కలిగి ఉన్నవారు బయోలో కాకుండా పేరులోనే పేరడీ అనే పదాన్ని జత చేయాలని మస్క్‌ తెలిపారు. అలా ఉన్న ఖాతాలను పరోక్షంగా నకిలీవని అర్థం చేసుకోవచ్చని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్నికల్లో పోటీ చేసే ఆశ లేదు: ప్రశాంత్‌ కిశోర్‌

తనకు ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆకాంక్ష లేదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ అన్నారు. అయితే, తన సొంత రాష్ట్రం బిహార్‌ కోసం మాత్రం మెరుగైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించడానికి కట్టుబడి ఉన్నానని తెలిపారు. ప్రస్తుతం ‘జన సురాజ్‌’ పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న ఆయన శనివారం చంపారణ్‌ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎయిర్‌ షోలో విమానాలు ఢీకొని..

అమెరికాలోని డల్లాస్‌లో నిర్వహించిన ఎయిర్‌షోలో విషాదకర ఘటన చోటు చేసుకొంది.  రెండో ప్రపంచ యుద్ధ కాలం నాటి రెండు విమానాలు ఢీకొని పలువురు మృతి చెందారు. ఈ విమానాలు భూమికి తక్కువ ఎత్తులో ఎగురుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఎయిర్‌షోలో బోయింగ్‌  బీ-17 బాంబర్‌ విమానం, బెల్‌ పీ-63 కింగ్‌ కోబ్రా విమానం అత్యంత సమీపంలోకి రావడంతో ఈ ప్రమాదం జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని