Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 Nov 2022 13:07 IST

1. భారత్‌లో ఆర్థికమాంద్యానికి అవకాశం లేదు.. నీతిఆయోగ్‌ మాజీ వైస్‌ ఛైర్మన్‌

భారత్‌లో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశం లేదని నీతి ఆయోగ్‌ మాజీ వైస్‌-ఛైర్మన్‌ రాజీవ్‌ కుమార్‌ తెలిపారు. 2023-24లో దేశం 6-7 శాతం ఆర్థిక వృద్ధిని నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచం మొత్తం మాంద్యంలోకి జారుకున్నా భారత్‌లో మాత్రం అలాంటి పరిస్థితులు ఉండవని తెలిపారు. అమెరికా, ఐరోపా, జపాన్‌, చైనా ఆర్థిక వ్యవస్థలు ఒకదానికొకటి అనుసంధానమై ఉన్నాయని రాజీవ్‌ కుమార్‌ తెలిపారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అన్నవరం దేవస్థానంలో పోటెత్తిన భక్తులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణం

కాకినాడ జిల్లా అన్నవరం దేవస్థానంలో భక్తులు పోటెత్తారు. భారీగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణాలు కిక్కిరిసిపోయాయి. క్యూ లైన్లు, వ్రత మండపాల్లో బారులు తీరిన పరిస్థితి నెలకొంది. దీంతో వ్రత, ప్రత్యేక దర్శన టికెట్లు, దర్శనాలను అధికారులు నిలుపుదల చేశారు. భక్తులను నిలువరించలేక పశ్చిమ రాజగోపురం ద్వారాలు మూసివేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ‘వారిసు’ రిలీజ్‌.. నిర్మాతల మండలి నిర్ణయంపై లింగుస్వామి ఆగ్రహం

సంక్రాంతి పండుగకు కేవలం తెలుగు చిత్రాలను మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయాలంటూ తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి చేసిన ప్రకటనపై తమిళనాడు వ్యాప్తంగా విమర్శలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పటికే పలువురు కోలీవుడ్‌ దర్శకనిర్మాతలు పెదవి విరిచారు. తాజాగా దర్శకుడు లింగుస్వామి సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ద్రవిడ్‌కు విరామం ఎందుకు అవసరమో నేను చెప్తాను: అశ్విన్‌

ఆటగాళ్లకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాల్సిన జట్టు ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ పదే పదే విరామం తీసుకోవాల్సిన అవసరం ఏంటని మాజీ కోచ్‌ రవిశాస్త్రి ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. భారత టీ20 లీగ్‌ సమయంలోనే వారికి చాలినంత విరామం లభిస్తుందంటూ తెలిపాడు. తాజాగా ఈ వ్యాఖ్యలపై టీమ్‌ఇండియా ఆఫ్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ స్పందించాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ప్రముఖ దర్శకుడు మదన్‌ కన్నుమూత

తెలుగు చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, సినీ దర్శకుడు మదన్‌ (Madan) కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురైన ఆయన హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత తుదిశ్వాస విడిచారు. మదన్‌ మరణ వార్తతో ఆయన కుటుంబంలో విషాదం నెలకొంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ పలువురు సినీతారలు సోషల్‌మీడియాలో పోస్టులు పెడుతున్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆటకు వర్షం అంతరాయం.. భారత్‌ స్కోరు 50/1

భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌కూ వరుణుడు అడ్డంకిగా మారాడు. భారత ఇన్నింగ్స్‌లో ఏడో ఓవర్‌ (6.4వ ఓవర్‌)ను నీషమ్ వేస్తుండగా వర్షం రావడంతో ఆటను అంపైర్లు నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ స్కోరు 50/1. క్రీజ్‌లో ఇషాన్‌ కిషన్ (28*), సూర్యకుమార్ (6*) ఉన్నారు. అంతకుముందు రిషభ్‌ పంత్ (6) విఫలమయ్యాడు. నీషమ్‌ వేసిన ఈ ఓవర్‌లోని నాలుగు బంతుల్లో ఇషాన్‌ రెండు బౌండరీలు కొట్టాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  మస్క్‌ కీలక నిర్ణయం.. ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ట్విటర్‌ ఖాతా మళ్లీ మనుగడలోకి వచ్చింది. ట్విటర్‌లో పోల్‌ నిర్వహించిన తర్వాత ఆయన ఖాతాను పునరుద్ధరిస్తున్నట్లు ట్విటర్‌ అధిపతి ఎలాన్‌ మస్క్‌ ఆదివారం ప్రకటించారు. ట్రంప్‌ మాత్రం ఇప్పటి వరకు దీనిపై స్పందించలేదు. పాత సందేశాలతో కూడిన ఆయన ట్విటర్‌ ఖాతా ప్రస్తుతం సామాజిక మాధ్యమ వేదికపై కనిపిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మంగళూరులో ఆటోరిక్షా పేలుడు ఉగ్రవాద చర్యే

కర్ణాటక తీర ప్రాంత నగరం మంగళూరులో శనివారం సాయంత్రం ఆటోరిక్షాలో జరిగిన చిన్నపాటి పేలుడు ఉగ్రవాద చర్యేనని ఆ రాష్ట్ర డీజీపీ ప్రవీణ్‌ సూద్‌ ఆదివారం ధ్రువీకరించారు. పెద్ద ఎత్తున నష్టం కలగజేయాలన్న దురుద్దేశంతోనే దుండగులు ఈ చర్యకు ఒడిగట్టారని వెల్లడించారు. దీనిపై లోతైన విచారణ జరపుతున్నామని తెలిపారు. కేంద్ర దర్యాప్తు సంస్థల సాయం కూడా తీసుకుంటున్నామన్నారు. ఈ విషయాన్ని కర్ణాటక హోంమంత్రి అరాగా జ్ఞానేంద్ర సైతం ధ్రువీకరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. డ్రైవర్‌కు మూర్ఛ.. ఇంట్లోకి దూసుకెళ్లిన బస్సు..

విజయనగరం జిల్లాలో ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు నడుపుతున్న సమయంలో డ్రైవర్‌కు మూర్ఛ  వచ్చింది. దీంతో బస్సు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. బస్సు ఢీకొని ఏడో తరగతి విద్యార్థి సిరికి అభిషేక్‌ మృతి చెందాడు. అనంతరం రోడ్డు పక్కనున్న ఇంట్లోకి బస్సు దూసుకెళ్లింది. ఇంటి గోడ కూలి మహిళకు తీవ్రగాయాలయ్యాయి. ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 43 మంది ప్రయాణికులు ఉన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Naga Shaurya: ఒక్కటైన నాగశౌర్య-అనూష.. వీడియో వైరల్

నటుడు నాగశౌర్య వివాహం వేడుకగా జరిగింది. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్‌ డిజైనర్‌ అనూష శెట్టి  మెడలో అతడు మూడు ముళ్లు వేశాడు. బెంగళూరులోని ఓ ఫైవ్‌ స్టార్‌ హోటల్‌లో జరిగిన వీరి వివాహానికి ఇరు కుటుంబ పెద్దలు, సన్నిహితులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై స్పందించిన నెటిజన్లు నూతన జంటకు అభినందనలు చెబుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని