Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Nov 2022 13:03 IST

1. క్షణికావేశంలోనే శ్రద్ధాను చంపేశా.. కోర్టులో అంగీకరించిన అఫ్తాబ్‌

సంచలనం సృష్టించిన కాల్‌ సెంటర్‌ ఉద్యోగి శ్రద్ధా వాకర్‌ హత్య కేసులో నిందితుడు అఫ్తాబ్‌ అమీన్‌ పూనావాలాను దిల్లీ పోలీసులు నేడు కోర్టు ఎదుట హాజరుపర్చారు. క్షణికావేశంలోనే తాను శ్రద్ధాను హత్య చేసినట్లు నిందితుడు న్యాయస్థానం ముందు అంగీకరించాడు. అయితే ఈ ఘటన జరిగి చాలా రోజులు అయినందున తనకు ఘటనకు సంబంధించి చాలా విషయాలు గుర్తుకు రావడం లేదని అఫ్తాబ్‌ చెప్పడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. బ్రెజిల్‌ టీమ్‌ స్పిరిట్‌తో మెరిసిన గోల్‌..!

ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ గెలవాలంటే ప్రతి ఆటగాడు అద్భుతంగా ఆడితీరాల్సిందే. ఇలా బ్రెజిల్‌ జట్టు సమష్టి పోరాటంతో ఇటలీని ఓడించి 1970లో ప్రపంచకప్‌ను ముద్దాడింది‌. ఈ మ్యాచ్‌లో ఓ గోల్‌ ఫిఫా చరిత్రలోనే గ్రేటెస్ట్‌గా నిలిచిపోతుంది. దిగ్గజ ఆటగాడు పీలే అందించిన పాస్‌తో ఈ గోల్‌ను బ్రెజిల్‌ కెప్టెన్‌ కార్లోస్‌ అల్బెర్టో కొట్టాడు. అతడికి బంతిని అందించడానికి దాదాపు ఏడుగురు బ్రెజిల్‌ ఔట్‌ఫీల్డ్‌ ఆటగాళ్లు 10సార్లు పాస్‌ చేయాల్సి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. మీకో దండం.. విమర్శకులకు ‘నమస్తే’ చెప్పిన మస్క్‌!

కొత్త యజమాని ఎలాన్‌ మస్క్‌ ట్విటర్‌లో చేస్తున్న మార్పులు, తీసుకుంటున్న నిర్ణయాలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. వీటిలో కొన్నింటికి ఆయన ఓపికగా సమాధానం చెప్పారు. మరికొన్నింటిని తిప్పికొట్టారు. అయినా, విమర్శలు ఆగకపోవడంతో ఆయన విసుగెత్తిపోయారు. ‘మీరు ట్విటర్‌ నుంచి వైదొలిగినా సరే.. మీకో దండం’ అంటూ విమర్శకులకు ఓ ‘నమస్తే’ చెప్పి ముగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘జడేజా మా వాడు.. బాగా చూసుకోండి’: ధోనీకి మోదీ చెప్పిన వేళ..

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా క్రికెటర్‌ రవీంద్ర జడేజా సతీమణి రీవాబా జడేజా పోటీ చేస్తున్నారు. భార్యకు మద్దతుగా జడ్డూ గత కొద్ది రోజులుగా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని తొలిసారి కలిసిన క్షణాలను గుర్తుచేసుకున్న జడేజా.. అప్పటి ఆసక్తికర సంభాషణను పంచుకున్నాడు. అప్పుడు గుజరాత్‌ సీఎంగా ఉన్న మోదీ.. తన గురించి ధోనీకి ప్రత్యేకంగా చెప్పారని జడేజా తెలిపాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఆర్టెమిస్‌ తొలి చిత్రం: జాబిల్లి చాటున నీలిపుడమి..!

నాసా ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఆర్టెమిస్‌-1 యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఓరియన్‌ క్యాప్సుల్‌ చంద్రుడి ఉపరితలంపై 81 మైళ్ల ఎత్తులో దూసుకెళ్లి.. పెద్దకక్ష్యలోకి ప్రవేశిస్తోంది. ఇది గంటకు 5,102 మైళ్ల వేగంతో  ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో 34 నిమిషాలపాటు భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఎందుకంటే చంద్రుడికి అవతలవైపు ఈ ప్రక్రియ జరగడంతో ఇలా జరిగినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ ఆర్టెమిస్‌-1 అనుకున్నదాని కంటే ఎక్కువ విజయం సాధించిందని నాసా వర్గాలు తెలిపాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. తొలి అడుగు తడబడింది.. బాలీవుడ్‌లో ‘లెక్క’ తప్పింది!

‘ఇంట గెలిచి రచ్చ గెలవడం’ అన్న చందంగా దక్షిణాదిన మంచి గుర్తింపు పొందిన చాలామంది నటులు బాలీవుడ్‌లో సత్తా చాటేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అక్కడి ప్రేక్షకులను మెప్పించేందుకు ఎంతో శ్రమిస్తారు. కొందరు తొలి ప్రయత్నంలోనే హిట్‌ అందుకుంటే.. మరికొందరికి పరాజయం ఎదురవుతుంది. తాము ఊహించిన బాక్సాఫీసు లెక్క తప్పుతుంది. ఏ హీరోకి ఏ సినిమాతో ఇలాంటి పరిస్థితి ఎదురైందంటే..?  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7.  ‘స్నేహానికి మించింది ఏదీ లేదు’ : భారత్‌తో మైత్రిపై రష్యా రాయబారి వ్యాఖ్య

భారత్‌, రష్యా మధ్య స్నేహం దశాబ్దాలుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ బంధానికి 75 ఏళ్లు. ఇందులో భాగంగా దిల్లీలో రెండు దేశాల సంప్రదాయాలను ప్రతిబింబించేలా సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మనదేశంలోని రష్యా రాయబారి డెనిస్‌ అలిపోవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందీలో ప్రాచుర్యంలో ఉన్న ఒక సామెతను ప్రస్తావిస్తూ.. రెండు దేశాల మధ్య స్నేహబంధం ఏ స్థాయిలో ఉందో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. గేర్లతో విద్యుత్‌ బైక్‌.. ఆవిష్కరించిన మ్యాటర్‌

విద్యుత్‌ వాహన, ఎనర్జీ స్టోరేజ్‌ టెక్నాలజీ అంకురం మ్యాటర్‌ సోమవారం గేర్‌లతో నడిచే విద్యుత్‌ బైక్‌ను ఆవిష్కరించింది. వచ్చే ఏడాది నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొంది. అహ్మదాబాద్‌కు చెందిన ఈ సంస్థ గేర్‌ విద్యుత్‌ మోడల్‌ బైక్‌లకు త్వరలోనే బుకింగ్‌లు ప్రారంభించి, వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి డెలివరీలు ప్రారంభిస్తామని వెల్లడించింది. వచ్చే 12 నెలల్లో దేశంలోని ప్రధాన నగరాల్లో 200 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. సత్యేందర్ జైన్ మసాజ్‌ వీడియోలో ట్విస్ట్‌.. అతడు థెరపిస్టు కాదు రేపిస్టు..!

ఆప్‌ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ సీసీటీవీ దృశ్యాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దీనిలో ఒక ట్విస్ట్‌ బయటకు వచ్చింది. తిహాడ్‌ జైలు వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ వీడియోలో జైన్‌కు మసాజ్‌ చేస్తోన్న వ్యక్తి పేరు రింకూ. అతడొక ఖైదీ. అత్యాచార కేసులో జైల్లో ఉన్నాడని ఆ వర్గాలు తెలిపాయి. తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ అతడి కన్న కూతురే ఆరోపణలు చేసింది. దానికింద గత ఏడాది అతడు అరెస్టయ్యాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. యనమలకుదురులో ‘ఇదేం ఖర్మ రాష్ట్రానికి’ నిరసన.. ఉద్రిక్తత

కృష్ణా జిల్లా పెనమలూరులో మాజీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ తలపెట్టిన 'ఇదేం ఖర్మ రాష్ట్రానికి' కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రారంభోత్సవం కాని యనమలకుదురు బ్రిడ్జిపై తెలుగుదేశం చేపట్టిన నిరసన కార్యక్రమాన్ని వైకాపా నేతలు అడ్డుకునే యత్నం చేశారు. మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణను వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు. వైకాపా కార్యకర్తలకు పోలీసులు సర్దిచెప్పేందుకు యత్నిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని