Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Nov 2022 13:10 IST

1. వారి పేర్లను చైనా వాడేసింది..!

అంతర్జాతీయ సంబంధాల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించేది అధికారంలో ఉన్న నేతలు, రాయబారులు, దౌత్యవేత్తలు, ప్రభుత్వ అధికారులు. అంతేగానీ ప్రైవేటు వ్యక్తులు కాదు. ఈ విషయం చైనాకు స్పష్టంగా తెలుసు. కానీ, పదవి పోయి ఖాళీగా ఉన్న నేతలు వ్యక్తిగత హోదాలో చైనా కార్యక్రమాల్లో పాల్గొన్నా.. వారిని ఆయా దేశ ప్రతినిధులుగా ప్రచారం చేసుకుంటోంది. తాజాగా క్వాడ్‌కు పోటీగా డ్రాగన్‌ నిర్వహించిన  ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ ఇనీషియేటివ్‌ కార్యక్రమం విషయం ఇలానే చేసినట్లు వెలుగులోకి వచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2.  సందేహాలకు ఫుల్‌స్టాప్‌.. RC 16 అనౌన్స్‌మెంట్‌ వచ్చేసింది

శంకర్‌ సినిమా తర్వాత మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ తేజ్‌ (Ram Charan) ఎవరితో సినిమా చేయనున్నారనే విషయంపై ఎంతో కాలం నుంచి సందిగ్ధత నెలకొన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది దర్శకుల పేర్లూ వినిపించాయి. ఈ సందేహాలకు తెరదించుతూ తాజాగా ‘ఆర్‌సీ 16’పై అధికారిక ప్రకటన వెలువడింది. చరణ్‌ తదుపరి చిత్రాన్ని ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో చేయనున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌ సమర్పణలో ఇది తెరకెక్కనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. భారత్‌లో మరో వ్యాపారాన్ని మూసివేయనున్న అమెజాన్‌..!

వ్యయ నియంత్రణపై దృష్టిపెట్టిన ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే భారీ ఎత్తున ఉద్యోగాల కోతలతో పాటు భారత్‌లో ఎడ్యుటెక్‌ సేవలందించే అమెజాన్‌ అకాడమీని మూసివేయనున్నట్లు ప్రకటించింది. తాజాగా మరో వ్యాపారాన్ని కూడా మూసివేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి భారత్‌లో ‘అమెజాన్‌ ఫుడ్‌’ డెలివరీ సర్వీసును నిలిపివేయనున్నామని సంస్థ వెల్లడించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఫిఫా ప్రపంచకప్‌లో బెల్జియం ఓటమి.. స్వదేశంలో అల్లర్లు..!

ఫుట్‌బాల్‌లో ప్రపంచ నంబర్‌ 2 జట్టు అయిన బెల్జియం జట్టుకు ఫిఫా ప్రపంచకప్‌లో గట్టి షాక్‌ తగిలింది. మొరాకో చేతిలో 0-2తో ఘోర పరాభవాన్ని చవిచూసింది. అయితే ఈ ఓటమి బెల్జియంలో అల్లర్లకు దారితీసింది. జట్టుపై ఆగ్రహానికి గురైన అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి.ఆదివారం మ్యాచ్‌ పూర్తవ్వగానే బెల్జియం రాజధాని బ్రస్సెల్స్‌లో వందలాది మంది సాకర్‌ అభిమానులు రోడ్లపైకి చేరి ఆందోళనలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఈ వారం థియేటర్‌/ఓటీటీలో అలరించే చిత్రాలు!

2022 ముగింపు వచ్చేసింది. మరి చివరి నెల మొదటి వారంలో థియేటర్‌/ ఓటీటీలో అలరించే చిత్రాలు.. వెబ్‌సిరిస్‌లు ఏమున్నాయో చూసేయండి. థియేటర్లు: డిసెంబర్‌ 2 - హిట్‌2, మట్టికుస్తీ, జల్లికట్టు బసవ, నేనెవరు. ఓటీటీ: నవంబరు 30 - విల్లో(డిస్నీ+హాట్‌స్టార్‌), మై నేమ్‌ ఈజ్‌ వెండెట్టా(నెట్‌ఫ్లిక్స్‌). డిసెంబరు 1 - రిపీట్‌(డిస్నీ+హాట్‌స్టార్‌), జంగిల్‌లాండ్‌(నెట్‌ఫ్లిక్స్‌). డిసెంబరు 2- గుడ్‌బై(నెట్‌ఫ్లిక్స్‌), ఫ్రెడ్డీ(డిస్నీ+హాట్‌స్టార్‌), ఇండియన్‌ లాక్‌డౌన్‌(జీ5), వదంతి (ప్రైమ్‌ వీడియో). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు.. రాందేవ్‌ బాబా క్షమాపణలు

మహిళల వస్త్రధారణపై ప్రముఖ యోగా గురువు రాందేవ్‌ బాబా (Ramdev Baba) చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్లు వస్తోన్న నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై రాందేవ్‌ క్షమాపణలు తెలిపారు. మహిళలను కించపర్చాలన్న ఉద్దేశం తనకు లేదని, తన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడినట్లయితే అందుకు తనను క్షమించాలని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కృతిసనన్‌ రిలేషన్‌షిప్‌పై వరుణ్‌ధావన్‌ వైరల్‌ కామెంట్స్‌

బాలీవుడ్‌ ముద్దుగుమ్మ కృతిసనన్‌ (Kriti Sanon) రిలేషన్‌షిప్‌పై నటుడు వరుణ్‌ధావన్‌ (Varun Dhawan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ స్టార్‌ హీరో ఆమెను ప్రేమిస్తున్నారని ఆయన చెప్పారు. ‘భేదియా’ ప్రమోషన్స్‌లో భాగంగా బీటౌన్‌ రియాల్టీ షోలో పాల్గొన్న ఆయన.. ‘‘కృతిసనన్‌ పేరు నా జాబితాలో లేదు. ఎందుకంటే ఆమె పేరు మరొకరి హృదయంలో ఉంది. ఆ వ్యక్తి ప్రస్తుతం ముంబయిలో లేడు. వేరే ప్రాంతంలో దీపికా పదుకొణెతో కలిసి షూట్‌లో ఉన్నాడు’’ అని చెప్పాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆ అంశంలో బీసీసీఐ, పీసీబీ కలిసి నిర్ణయం తీసుకోవాలి: గంభీర్‌

పాక్‌లో భారత్‌ ఆడకపోతే.. తాము కూడా ఆ దేశంలో ఆడేది లేదని పీసీబీ చీఫ్‌ రమీజ్‌ రజా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల క్రికెట్‌ బోర్డుల మధ్య మాటల యుద్ధానికి దారితీశాయి. రజా హెచ్చరికలపై నిన్న కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కౌంటర్‌ ఇవ్వగా.. తాజాగా మాజీ ఓపెనర్‌, భాజపా ఎంపీ గౌతమ్‌ గంభీర్‌ స్పందించారు. ‘ఇది బీసీసీఐ, పీసీబీ తీసుకోవాల్సిన నిర్ణయం. వారు ఏ నిర్ణయం తీసుకున్నా సమష్టిగా తీసుకోవాలి’ అని గంభీర్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఆలీ కుమార్తె వివాహంలో సెలబ్రిటీల సందడి

ప్రముఖ హాస్య నటుడు ఆలీ (Ali) పెద్ద కుమార్తె ఫాతిమా (Fathima) వివాహం ఘనంగా జరిగింది. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ఫంక్షన్‌ హాలులో నిర్వహించిన ఈ వేడుకలో టాలీవుడ్‌ సెలబ్రిటీలు సందడి చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి - సురేఖ, నాగార్జున - అమల దంపతులు, ఏపీ మంత్రి రోజాతోపాటు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరై.. నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన కొన్ని ఫొటోలను రోజా ట్విటర్‌ వేదికగా షేర్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. మెస్సీ ప్రపంచకప్‌ కలను భగ్నం చేసిన సబ్‌స్టిట్యూట్‌..!

ఫుట్‌బాల్‌ గాడ్‌గా పేరున్న మెస్సీ ప్రపంచకప్‌ కలను ఓ సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు చేసిన గోల్‌ భగ్నం చేసింది. విజయానికి ఒక్క అడుగు దూరంలో అర్జెంటీనా జట్టు ఉసూరుమంటూ రన్నరప్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. 2014 ప్రపంచకప్‌లో గ్రూప్‌, నాకౌట్‌ దశల్లో ఒక్క మ్యాచ్‌ కూడా ఓడిపోకుండా అర్జెంటీనా ఫైనల్స్‌ చేరింది. మరోవైపు జర్మనీ గ్రూప్‌ దశలో ఒక మ్యాచ్‌ డ్రా చేసుకొని.. మిగిలిన రెండింట్లో విజయం సాధించి నాకౌట్‌ దశకు చేరుకొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని