Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Dec 2022 13:02 IST

1. రేపు విచారణకు హాజరుకాలేను: సీబీఐకి ఎమ్మెల్సీ కవిత లేఖ

దిల్లీ మద్యం కేసులో దర్యాప్తునకు సంబంధించి మంగళవారం విచారణకు హాజరు కాలేనని సీబీఐ(CBI)కి తెరాస(TRS) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla kavitha) తెలిపారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు ఆమె లేఖ రాశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల కారణంగా హాజరుకాలేనని లేఖలో కవిత పేర్కొన్నారు. ఈనెల 11, 12, 14, 15 తేదీలలో అందుబాటులో ఉంటానని తెలిపారు. మద్యం కేసులో కేంద్రహోంశాఖ ఇచ్చిన ఫిర్యాదు, ఎఫ్‌ఐఆర్‌ ప్రతులు ఇవ్వాలని ఇటీవల సీబీఐని కవిత కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఆ క్యాచ్‌లు ఎందుకు వదిలేశారో అర్థం కాలేదు: దినేశ్‌ కార్తిక్‌

బంగ్లాదేశ్‌తో తొలి వన్డే(IND Vs BAN)లో టీమ్‌ఇండియా ఓటమిపై సీనియర్‌ వికెట్‌ కీపర్‌ దినేశ్‌ కార్తిక్‌(dinesh karthik) అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఇంత దారుణమైన ఫీల్డింగ్‌ను తాను ఊహించలేదని అన్నాడు. కేఎల్ రాహుల్‌(kl Rahul) విషయం అటుంచితే.. వాషింగ్టన్‌ సుందర్‌ కనీసం క్యాచ్‌ పట్టేందుకు ప్రయత్నించకపోవడం తనను విస్మయానికి గురిచేసిందన్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. థియేటర్‌లో ఏకంగా 17 సినిమాలు.. మరి ఓటీటీలో ఎన్నో తెలుసా?

ఈ వారం ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 15కు పైగా చిత్రాలు  థియేటర్లలో విడుదలవుతున్నాయి. డిసెంబర్‌ 9: పంచతంత్రం, గుర్తుందా శీతాకాలం, ముఖచిత్రం, ప్రేమదేశం, చెప్పాలని ఉంది, లెహరాయి, నమస్తే సేట్‌జీ, రాజయోగం, డేంజరెస్‌, విజయానంద్‌, AP04 రామాపురం, ఐ లవ్‌ యు ఇడియట్‌, మనం అందరం ఒక్కటే, సివిల్‌ ఇంజినీర్‌, ఆక్రోశం, ఏయ్‌ బుజ్జి నీకు నేనే. ఓటీటీ: డిసెంబర్‌ 10- బ్లాక్‌ ఆడమ్‌(అమెజాన్‌ ప్రైమ్‌). డిసెంబర్‌ 9- మాచర్ల నియోజకవర్గం(జీ5), లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌(సోనీలివ్‌),ఊర్వశివో రాక్షసివో(ఆహా). పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. సెనెగల్‌ పార్లమెంటులో ఎంపీల ఘర్షణ..!

సెనెగల్‌ పార్లమెంట్‌లో ఎంపీలు ఘర్షణకు దిగారు. ఒకరిపై ఒకరు కుర్చీలు విసురుకున్నారు. ఈ ఘటన శుక్రవారం చోటు చేసుకొంది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. సెనెగల్‌ ప్రతిపక్ష పార్టీ నాయకుడు మస్సాట్‌ సంబ్‌ తోటి పార్లమెంట్‌ సభ్యురాలు యామి నదియా గింబేను తొలుత చెంపదెబ్బ కొట్టారు. దీంతో పార్లమెంట్‌లో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. గింబే అక్కడే ఉన్న ఒక కుర్చీ తీసుకొని సంబ్‌ వైపు విసిరారు. దీంతో అక్కడే ఉన్న చట్టసభ సభ్యులు వారిని విడదీసేందుకు తీవ్ర యత్నాలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అప్పుడు వాళ్లు నన్ను భయపెట్టారు.. : నాని

‘హిట్‌-2’తో (HIT2) నిర్మాతగా మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు నేచురల్‌ స్టార్‌ నాని (Nani). క్రైమ్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలై అంతటా మంచి టాక్‌ అందుకుంది. తాజాగా ఈ సినిమా విజయోత్సవ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థ మొదలు పెట్టిన సమయంలో తనని ఎంతోమంది భయపెట్టారని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Gujarat Election Updates: ఓటేసిన ప్రముఖులు.. పోలింగ్‌ శాతం ఇలా..

గుజరాత్‌ (Gujarat) అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) తుది విడత పోలింగ్‌ సోమవారం ప్రశాంతంగా కొనసాగుతోంది. మొత్తం 14 రాష్ట్రాల పరిధిలోని 93 నియోజకవర్గాలకు నేడు ఓటింగ్‌ జరుగుతోంది. ఉదయం 11 గంటల వరకు 19.17శాతం పోలింగ్‌ (Gujarat Polling) నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రజలు ఉదయం నుంచే పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.  తొలి గంటల్లో పలువురు ప్రముఖులు ఓటేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇరుదేశాల ఆటగాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలి: పాక్‌ పేసర్‌

వచ్చే ఏడాది ఆసియా కప్‌ (Asia cup 2023) నేపథ్యంలో పాకిస్థాన్‌లో టీమ్‌ఇండియా(Team India) పర్యటనపై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. తాజాగా పాక్‌ మాజీ పేసర్‌ మహమ్మద్‌ ఇర్ఫాన్‌ ఈ అంశంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరుదేశాల ఆటగాళ్లు రాజకీయాలకు దూరంగా ఉండాలంటూ సూచించాడు. ఇలాంటి పర్యటనలు(IND Vs PAK) రెండు దేశాల మధ్య ప్రజల సంబంధాలను బలపరుస్తాయన్నాడు. ఇక ఈ విషయంపై వస్తున్న వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఘనంగా హన్సిక - సోహైల్‌ వివాహం.. ఒక్కటైన ప్రేమజంట

నటి హన్సిక (Hansika) వివాహం ఘనంగా జరిగింది. తన ప్రియుడు, వ్యాపార భాగస్వామి సోహైల్‌తో ఆమె ఏడడుగులు వేశారు. జైపుర్‌లోని రాజకోట వేదికగా ఆదివారం రాత్రి సింధి సంప్రదాయంలో వీరి వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, సన్నిహితులు ఈ వేడుకలో పాల్గొని నూతన జంటకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పోలింగ్‌లో రిగ్గింగ్‌.. కలెక్టర్‌ ఫోన్‌ తీయట్లేదు: డింపుల్‌ యాదవ్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh) లోని మెయిన్‌పురి (Mainpuri) లోక్‌సభ స్థానానికి జరుగుతున్న ఉపఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అభ్యర్థి డింపుల్‌ యాదవ్‌ (Dimple Yadav) ఆరోపించారు. దీనిపై ఫిర్యాదులు చేసేందుకు ప్రయత్నిస్తున్నా.. అధికారులు పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. ‘‘ఎన్నికల్లో రిగ్గింగ్‌ గురించి ఫిర్యాదులు చేసేందుకు ఎస్పీ కార్యకర్తలు ప్రయత్నిస్తుంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఎగబాకిన చమురు ధరలు..!

రష్యా(Russia)  విక్రయించే చమురు(oil prices) పై జీ-7 దేశాలు విధించిన ఆంక్షలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో చమురు ధరల్లో 1 శాతం మేరకు పెరుగుదల కనిపించింది. ఆసియా ట్రేడింగ్‌లో నేడు బ్రెంట్‌ క్రూడ్‌ పీపా ధర 86 డాలర్లకు పైగానే ట్రేడవుతోంది. ఒక దశలో ఇది 2.4శాతం వరకు కూడా పెరిగి.. ఆ తర్వాత తగ్గింది. ఇక వెస్ట్‌ టెక్సాస్‌ ఇంటర్మీడియట్‌ చమురు ఫ్యూచర్‌ 1.1శాతం ధర పెరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని