Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Jan 2023 13:12 IST

1. మరిన్ని పరీక్షల తర్వాత తారకరత్న ఆరోగ్యంపై స్పష్టత

నటుడు తారకరత్నకు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని.. మరిన్ని పరీక్షలు చేసిన తర్వాత స్పష్టత వస్తుందని వైద్యులు తెలిపారు. ఎంఆర్‌ఐ, సిటీ స్కాన్‌ చేసిన అనంతరం తారకరత్న ఆరోగ్యంపై పూర్తిస్థాయిలో వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై సోమవారం మధ్యాహ్నం తర్వాత ఆస్పత్రి వైద్యులు హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేయనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గవర్నర్‌ విధుల్లో న్యాయ సమీక్ష చేయొచ్చా?: హైకోర్టు వ్యాఖ్య

ఈ ఏడాది బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంపై తెలంగాణ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. బడ్జెట్‌ణు ప్రవేశపెట్టేందుకు అనుమతిచ్చేలా గవర్నర్‌ను ఆదేశించాలని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై మధ్యాహ్నం ఒంటిగంటకు విచారణ జరిపేందుకు సీజే ధర్మాసనం అంగీకరించింది. ఈ సందర్భంగా హైకోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఇది ‘స్కై’ భిన్నమైన వెర్షన్‌ : తన ఇన్నింగ్స్‌పై సూర్య స్పందన ఇది..

బంతి కనిపిస్తే చాలు బౌండరీ ఆవలకు తరలించడమే పనిగా పెట్టుకుంటాడు టీమ్‌ఇండియా మిస్టర్‌ 360 సూర్యకుమార్‌ యాదవ్ (Suryakumar Yadav)‌. అలాంటి విధ్వంసకర వీరుడు కూడా నిన్న న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టీ20 (IND Vs NZ)లో తన స్వభావానికి విరుద్ధంగా ఆడాడు. పరిస్థితులకు అనుగుణంగా ఎంతో బాధ్యతాయుతంగా ఇన్నింగ్స్‌ నిర్మించాడు. తన దూకుడును పక్కనబెట్టి.. 31 బంతుల్లో 26 పరుగులు చేశాడంటే  పిచ్‌ ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరు.. ‘అదానీ’ స్పందనపై హిండెన్‌బర్గ్‌

అదానీ గ్రూప్‌ (Adani Group) తన షేర్లలో అవకతవకలకు పాల్పడుతోందని అమెరికాకు చెందిన పెట్టుబడుల పరిశోధక సంస్థ హిండెన్‌బర్గ్‌ (Hindenburg) రీసెర్చ్‌ ఇచ్చిన నివేదిక భారతీయ స్టాక్‌ మార్కెట్లను కుదిపేస్తోంది. కాగా.. ఈ ఆరోపణలను అదానీ గ్రూప్‌ తీవ్రంగా ఖండించింది. భారత్‌ సాధిస్తున్న వృద్ధిపై అక్కసుతోనే ఇలా అసత్య ప్రచారం చేస్తున్నారని అమెరికా సంస్థపై దుయ్యబట్టింది. అయితే, అదానీ స్పందనను హిండెన్‌బర్గ్‌ తోసిపుచ్చింది. జాతీయవాదం పేరుతో మోసాన్ని దాచిపెట్టలేరంటూ తీవ్ర వ్యాఖ్యలతో బదులిచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఐడీ విచారణకు హాజరైన తెదేపా నేత చింతకాయల విజయ్‌

ఏపీ సీఐడీ విచారణకు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి కుమారుడు, తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్‌ హాజరయ్యారు. గతంలో భారతి పే పేరిట సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన ఓ వీడియోకు సంబంధించిన కేసులో విజయ్‌కు సీఐడీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇటీవల నర్సీపట్నంలో నివాసానికి వెళ్లి ఆయన తల్లి పద్మావతికి నోటీసులు అందించారు. ఐపీసీ 419, 469, 153(ఎ), 505(2), 120(బి), రెడ్‌ విత్‌ 34 సెక్షన్లతోపాటు ఐటీ చట్టంలో 66(సి) సెక్షన్లతో మంగళగిరిలోని.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌పై వాటర్‌ బాటిళ్లతో దాడి..

హిందీతోపాటు దక్షిణాది చిత్రాల్లోనూ హిట్‌ సాంగ్స్‌ ఆలపించిన ప్రముఖ సింగర్‌ కైలాశ్‌ ఖేర్‌(Kailash Kher)కు చేదు అనుభవం ఎదురైంది. ‘హంపీ ఉత్సవ్‌’(Hampi Ustav)లో పాల్గొన్న ఆయనపై దాడి జరిగింది. కన్నడ భాషలో పాటలు పాడాలని డిమాండ్‌ చేస్తూ ఇద్దరు యువకులు వాటర్‌ బాటిల్స్‌ విసిరారు. ఈ ఘటనతో అక్కడ ఉన్న వారందరూ షాక్‌ అయ్యారు. కర్ణాటక ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఏడాదిలాగానే ఈ సంవత్సరం కూడా ‘హంపీ ఉత్సవాలు’ వేడుకగా జరిగాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. బోరిస్‌.. క్షిపణి వేసేందుకు ఒక్క నిమిషం చాలు..! పుతిన్‌ హెచ్చరిక

బ్రిటన్‌ మాజీ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌(Boris Johnson) రష్యా అధ్యక్షుడు పుతిన్‌(Putin) గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకొని క్షిపణి ప్రయోగం చేస్తానని బెదిరించినట్లు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభించడానికి ముందు తనకు ఫోన్‌లో ఈ హెచ్చరిక చేసినట్లు చెప్పారు. జాన్సన్‌ను ఉటంకిస్తూ.. ‘పుతిన్‌ వర్సెస్‌ ది వెస్ట్‌’(Putin v the West) పేరిట మూడు భాగాలుగా తీసిన బీబీసీ డాక్యుమెంటరీ ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హైటెక్‌ వ్యవసాయం దిశగా బడ్జెట్‌లో అడుగులు..!

భారత్‌లో ఉపాధి కల్పించే రంగాల్లో వ్యవసాయానిది అగ్రస్థానం. దేశంలో 42 శాతం మంది దీనిపైనే ఆధారపడి జీవిస్తున్నారు. రైతు ఆదాయాన్ని రెట్టింపు చేస్తానన్న మోదీ సర్కారు హామీ కరోనా, ఆర్థిక సంక్షోభాల కారణంగా పూర్తి కాలేదు. అసలే ఆర్థిక మాంద్యం భయాలతో ఉద్యోగాల కోతలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ  సమయంలో దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చూసుకోవడం కేంద్రానికి సవాలుగా మారనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని భయపెట్టలేరు: అయ్యన్నపాత్రుడు

సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా పోస్టులు పెట్టారని ఆరోపిస్తూ తన కుమారుడు విజయ్‌పై సీఐడీ కేసు నమోదు చేసినట్టు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తెలిపారు. నేడు గుంటూరులోని సీఐడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని చింతకాయల విజయ్‌కు నోటీసులు వచ్చినట్టు చెప్పారు. హైకోర్టు ఆదేశాలతో న్యాయవాది సమక్షంలో ఈరోజు సీఐడి అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వ్యభిచార గృహాలపై పోలీసుల దాడి.. బాధితుల్లో 15 మంది మైనర్‌ బాలికలు?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోని పలు పోలీసుస్టేషన్ల పరిధిలో కొనసాగుతున్న వ్యభిచార గృహాలపై సోమవారం పోలీసులు మూకుమ్మడి దాడులు నిర్వహించారు. మైనర్‌ బాలికలే లక్ష్యంగా వ్యభిచార కూపంలోకి లాగుతున్న నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచార గృహాల్లో 15 మంది మైనర్‌ బాలికలు ఉన్నట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని