Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 29 Mar 2023 13:08 IST

1. మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు.. 

దక్షిణాది రాష్ట్రం కర్ణాటక (Karnataka) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly Election) షెడ్యూల్‌ ఖరారైంది. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఈ రాష్ట్రానికి శాసనసభ ఎన్నికల తేదీలను ప్రకటించింది. మొత్తం 224 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 10వ తేదీన పోలింగ్‌ జరగనుంది. మే 13వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు. నేటి నుంచే ఎన్నికల కోడ్‌ అమల్లోకి రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. లక్షద్వీప్‌ ఎంపీ ఫైజల్‌పై అనర్హత ఎత్తివేత

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీపై అనర్హత వ్యవహారం చర్చనీయాంశంగా మారిన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్‌సీపీ నేత మహమ్మద్‌ ఫైజల్‌ (Mohammad Faizal)పై గతంలో వేసిన అనర్హత వేటును లోక్‌సభ సచివాలయం ఎత్తివేసింది. ఆయనపై అనర్హతను ఉపసంహరించుకుంటున్నట్లు, ఆయన సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తున్నట్లు లోక్‌సభ సెకట్రేరియట్ బుధవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తన అనర్హత వ్యవహారంపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. ఈ నోటిఫికేషన్‌ రావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. లక్ష్మీదేవి నెక్లెస్‌ వివాదం.. తాప్సీపై కేసు నమోదు

బాలీవుడ్‌ నటి తాప్సీ పన్ను (Taapsee Pannu) పై కేసు నమోదైంది. బీజేపీ ఎమ్మెల్యే మాలిని కుమారుడు ఏకలవ్య గౌర్‌ తాప్సీపై ఛత్రపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల జరిగిన ఓ ఫ్యాషన్‌ షోలో ఆమె లక్ష్మీదేవి నెక్లెస్‌ను ధరించడాన్ని తప్పుబట్టిన ఆయన.. ఈ మేరకు పోలీసులకు కంప్లెయింట్‌ చేశారు. ఓ మతాన్ని కించపరిచేలా తాప్సీ వ్యవహరించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. అతడే అత్యుత్తమ ఫినిషర్‌.. 

ఐపీఎల్‌ (IPL 2023) సందడి మరో రెండు రోజుల్లో ప్రారంభం కానుంది. జట్లన్నీ ప్రాక్టీస్‌ షురూ చేశాయి. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఆటగాళ్లంతా నెట్స్‌లో శ్రమిస్తున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఫినిషర్ పాత్ర  చాలా కీలకం. ప్రతి జట్టులోనూ లోయర్‌ ఆర్డర్‌లో ఇలాంటి ప్లేయర్‌ ఉంటాడు. ఈ కోవకు చెందిన ఆటగాడే రియాన్ పరాగ్‌ (Riyan Parag). గత సీజన్లలో క్లిష్టసమయాల్లో రాజస్థాన్‌ రాయల్స్‌ను గట్టెక్కించిన సందర్భాలూ ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏప్రిల్‌ 1 నుంచి మారేవి ఇవే..!

కొత్త ఆర్థిక సంవత్సరం (2023-24) వచ్చేస్తోంది. ఏప్రిల్‌ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కాబోతోంది. బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎన్నో నిర్ణయాలు అదే రోజు నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా ఆదాయపు పన్ను పరిమితి పెంపు, సీనియర్‌ సిటిజన్లకు డిపాజిట్లపై పరిమితి పెంపు వంటి ఊరటనిచ్చే నిర్ణయాలు 1 నుంచే అమలు కానున్నాయి. మ్యూచువల్‌ ఫండ్స్‌పై ఎల్‌టీసీజీ ప్రయోజనాలు తొలగింపు, అధిక ప్రీమియం కలిగిన జీవిత బీమా పాలసీపై పన్ను వాత వంటివీ ఆ రోజు నుంచే ప్రారంభం కానున్నాయి. ఇవే కాకుండా ఏప్రిల్‌ 1 నుంచి ఇంకా ఏయే మార్పులు రానున్నాయో చూద్దాం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. షారుఖ్‌తో ప్రియాంక క్లోజ్‌గా ఉండటం కరణ్ తట్టుకోలేకపోయాడు: కంగన సంచలన ఆరోపణలు

బాలీవుడ్‌ ప్రముఖ దర్శక నిర్మాత కరణ్‌జోహార్‌ (Karan Johar)పై నటి కంగనా రనౌత్‌ (Kangana Ranaut) సంచలన ఆరోపణలు చేసింది. తన స్నేహితురాలు, నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra)ను కరణ్‌ జోహార్ బ్యాన్‌ చేశాడని ఆమె ఆరోపించింది. నటుడు షారుఖ్‌తో ప్రియాంక క్లోజ్‌గా ఉండటం ఆయన తట్టుకోలేకపోయాడని.. అందుకే ఆమెను మానసికంగా వేధించాడని వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు ఆమె వరుస ట్వీట్లలో రాసుకొచ్చింది. బాలీవుడ్‌ పరిశ్రమపై ప్రియాంక తాజాగా చేసిన సంచలన కామెంట్స్‌పై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 5 నెలల తర్వాత.. 2 వేలు దాటిన కరోనా కేసులు

దేశంలో కరోనా వైరస్(Corona Virus) మరోసారి గుబులు పుట్టిస్తోంది. గత కొద్ది నెలలుగా కట్టడిలో ఉన్న కొత్త కేసులు ఇటీవల పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 2,151 మందికి కరోనా సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్యశాఖ(Union Health Ministry) వెల్లడించింది. గత ఐదు నెలలకాలంలో రోజువారీ కేసులు ఈ స్థాయిలో నమోదుకావడం ఇదే మొదటిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు.. మీలోనూ ఉన్నాయా?

దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం ‘శ్రీరామాయణం’. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది. మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు ‘పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి’ అని నిర్ధారించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గాజువాక దంపతుల సెల్ఫీ వీడియో.. కథ విషాదాంతం

తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిన దంపతుల కథ విషాదాంతమైంది. విశాఖ జిల్లా గాజువాక పరిధిలోని తిరుమనగర్‌కు చెందిన వరప్రసాద్‌ (47), మీరా (41) మృతదేహాలు అనకాపల్లి జిల్లా రాజుపాలెం సమీపంలోని కొప్పాక ఏలేరు కాల్వలో లభ్యమయ్యాయి. ‘మేమిద్దరమూ వెళ్లిపోతున్నాం. మా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి. వాళ్లను ఎవరూ ఏమీ అనొద్దు. ఒకవేళ ఎవరైనా ఏమన్నా అన్నా... పిల్లలూ పట్టించుకోకండి’ అంటూ సెల్ఫీ వీడియో తీసుకున్న దంపతులు దాన్ని బంధువులకు పంపి, వారు కనిపించకుండా పోయారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. UPIతో మర్చంట్‌ లావాదేవీలపై ఛార్జీలు.. సామాన్యుడిపై భారం ఉంటుందా?

ఆన్‌లైన్‌ వాలెట్లు, ప్రీ-లోడెడ్‌ గిఫ్ట్‌ కార్డుల వంటి ‘ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ (PPI)’ ద్వారా చేసే యూపీఐ మర్చంట్‌ లావాదేవీలపై అదనపు ఛార్జీలను విధించాలని ఎన్‌పీసీఐ సిఫారసు చేసింది. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని అమల్లోకి తీసుకురావాలని ‘నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI)’ ప్రతిపాదించింది. అయితే, ఈ ఏడాది సెప్టెంబరు 30న లేదా అంతకంటే ముందే వీటిపై సమీక్ష నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని