Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 02 Apr 2023 13:16 IST

1. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపండి: కేంద్రానికి కేటీఆర్‌ బహిరంగ లేఖ

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ఆపాలని భారాస వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ఉక్కు పరిశ్రమలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. కార్పొరేట్లకు రూ.12.5లక్షల కోట్ల రుణాలు మాఫీ చేసిన కేంద్ర ప్రభుత్వం.. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై ఎందుకు ఔదార్యం చూపడం లేదని ఈ సందర్భంగా కేటీఆర్‌ ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేను అందంగా లేనని ట్రోల్స్‌ చేశారు : ఉపాసన

పెళ్లైన కొత్తలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నట్లు నటుడు రామ్‌చరణ్‌ (Ramcharan) సతీమణి ఉపాసన (Upasana) చెప్పారు. శరీరాకృతిపరంగా తనపై పలువురు నెగెటివ్‌ కామెంట్స్‌ చేశారని అన్నారు. ట్రోల్స్‌ ఎదురైనప్పటికీ తాను ఏమాత్రం కుంగుబాటుకు గురికాలేదని.. ప్రస్తుతం తానొక ఛాంపియన్‌గా ఫీలవుతున్నానని తెలిపారు. తాజాగా ముంబయిలో ఓ మీడియాతో మాట్లాడిన ఉప్సీ.. చరణ్‌తో తన రిలేషన్‌ గురించి ఆసక్తికర విషయాలు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఎస్‌ఆర్‌హెచ్ X ఆర్‌ఆర్‌.. గత చరిత్రను మరిచేలా గెలవాలి..!

ఐపీఎల్‌ (IPL 2023) ప్రస్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ (SRH)  చరిత్ర అద్భుతంగానే ఉన్నట్లు కనిపిస్తుంది. ఛాంపియన్‌గా నిలవడంతోపాటు వరుసగా నాలుగేళ్లపాటు ప్లేఆఫ్స్‌కు చేరింది. అయితే, గత రెండు సీజన్లలో ఘోర వైఫల్యంతో విమర్శపాలైంది. పది జట్లు తలపడిన గత సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ పాయింట్ల పట్టికలో 8వ స్థానంతో సరిపెట్టుకుంది. అంతకుముందు ఏడాది మరీ ఘోరం. చివరి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో జట్టులో సమూల మార్పులు చేసి బరిలోకి దిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఆరు నెలల తర్వాత.. అత్యధిక కేసులు..

భారత్‌లో కరోనా కేసులు ఆదివారం గణనీయంగా పెరిగాయి. ఉదయం 8 గంటలతో ముగిసిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,824 కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజు వ్యవధిలో ఈ స్థాయిలో కేసులు పెరగడం గత ఆరు నెలల్లో ఇదే తొలిసారి. తాజా కేసులతో దేశవ్యాప్తంగా క్రియాశీల కొవిడ్‌ కేసుల సంఖ్య 18,389కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. లాక్‌ చాట్‌.. వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్‌!

యూజర్ల ప్రైవసీని మరింత పెంచేలా ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌పై వర్క్‌ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే దీన్ని ప్రయోగాత్మకంగా పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. వాబీటా వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం.. లాక్‌ చాట్‌ (Lock Chat) అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ (WhatsApp) అభివృద్ధి చేస్తోంది. దీనితో యూజర్లు తమ ప్రైవేట్‌ చాట్లకు లాక్‌ విధించుకునే ఆప్షన్‌ ఉంటుంది. అంటే తమ వ్యక్తిగత చాట్లపై యూజర్లకు పూర్తి నియంత్రణ ఉండనుంది. తద్వారా గోప్యతతో పాటు, భద్రత మరింత పెరగనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. క్రికెట్ దిగ్గజం సలీమ్‌ దురానీ కన్నుమూత

టీమ్‌ఇండియా క్రికెట్ దిగ్గజం సలీమ్‌ దురానీ కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో తుది శ్వాస విడిచినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో తన సోదరుడు జహంగీర్ దురానీతో సలీమ్‌ ఉంటున్నారు.  తొడ ఎముక విరగడంతో  ఈ ఏడాది జనవరిలో శస్త్రచికిత్స జరిగింది. అయితే ఇటీవల క్యాన్సర్‌ బారిన పడటంతో పరిస్థితి విషమంగా మారింది. ఇవాళ కన్నుమూశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. శ్రీదేవి కోసం అప్పటికప్పుడు డ్రెస్‌ డిజైన్‌ చేసిన కాస్ట్యూమ్స్‌ కృష్ణ

ప్రముఖ కాస్ట్యూమ్‌ డిజైనర్‌ కాస్ట్యూమ్స్‌ కృష్ణ (Costume Krishna) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన.. చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  ఆయన మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలకు పనిచేసిన కాస్ట్యూమ్స్‌ కృష్ణ తన అనుభవాలను గతంలో జరిగిన కొన్ని ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. చంద్రగిరిలో దారుణం.. కారులో వెళ్తుండగా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ సజీవ దహనం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో దారుణం చోటుచేసుకుంది. నాయుడుపేట-పూతలపట్టు రోడ్డులో గంగుడుపల్లె వద్ద ఓ వ్యక్తిని దుండగులు సజీవ దహనం చేశారు. కారులో ఉండగానే పెట్రోలు పోసి తగులబెట్టారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు.  మృతదేహం గుర్తుపట్టలేని స్థితిలో ఉండటంతో కారు నంబర్‌ ఆధారంగా వివరాలు సేకరించారు. కారులో మృతిచెందిన వ్యక్తిని వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ నాగరాజుగా గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్‌ఎంఏసీసీ స్టేజ్‌పై ‘నాటు నాటు’.. డ్యాన్స్‌తో అదరగొట్టిన షారుఖ్‌, అలియా, రష్మిక

రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఛైర్‌పర్సన్‌ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్‌ ‘ఎన్‌ఎంఏసీసీ’ (నీతా ముకేశ్‌ అంబానీ కల్చరల్‌ సెంటర్‌)లో సినీ తారలు సందడి చేశారు. ఎన్‌ఎంఏసీసీ ప్రారంభోత్సవంలో భాగంగా శనివారం రాత్రి జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సినీ తారలు పెద్ద ఎత్తున పాల్గొని డ్యాన్సులతో అలరించారు. షారుఖ్‌ ఖాన్‌, వరుణ్‌ ధావన్‌, రణ్‌వీర్‌ సింగ్‌, ప్రియాంకచోప్రా, అలియాభట్‌, రష్మిక తదితరులు పలు బాలీవుడ్‌ సూపర్‌హిట్‌ పాటలకు డ్యాన్సులు చేసి ఉర్రూతలూగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Viral Video: వెనుకా ముందు యువతులు.. బైక్‌పై ఆకతాయి చేష్టలు

నగరాల్లో నిత్యం ఎక్కడో ఓచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా ఆకతాయి యువత వికృత చేష్టలు మానుకోవట్లేదు. తాజాగా ముంబయిలో ఓ యువకుడు రాత్రి వేళ ఇద్దరు యువతులను బైక్‌పై ముందూ వెనుక కూర్చోబెట్టుకొని ప్రమాదకర విన్యాసాలు ప్రదర్శించాడు. ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొట్టడంతో విషయం వెలుగుచూసింది. ముగ్గురిలో ఎవరికీ హెల్మెట్‌ లేదు..  వెనుక చక్రం ఆధారంగా వాహనాన్ని గాల్లోకి లేపి నడపటం చూపరులకు గగుర్పాటు కలిగించేలా ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండిTags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని