Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 May 2023 13:10 IST

1. పాక్‌కు మరో అవమానం.. ఆ దేశ విమానం మలేసియాలో సీజ్‌..!

తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాల్లో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌(Pakistan)కు మరో అవమానకర పరిస్థతి ఎదురైంది. ఆ దేశ విమానయాన సంస్థ పాకిస్థాన్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌(పీఐఏ)కు చెందిన బోయింగ్‌ 777 విమానాన్ని మలేసియా అధికారులు మంగళవారం సీజ్‌ చేశారు. ఈ విమానాన్ని లీజుపై మలేసియా నుంచి పీఐఏ తీసుకొంది. కానీ, లీజు బకాయి 4 మిలియన్‌ డాలర్లకు చేరడంతో మంగళవారం ఈ విమానాన్ని కోర్టు ఆదేశాల మేరకు కౌలాలంపూర్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో సీజ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఇకపై OTTలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు.. కేంద్రం కీలక నిర్ణయం

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినం (World No-tobacco Day) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు (anti tobacco warnings) తప్పనిసరి చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం ఓ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే.. సదరు పబ్లిషర్‌పై తీవ్ర చర్యలు తీసుకుంటామని కేంద్రం హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. వారి జాబితాలో చేరాలంటే.. అతడు మరో ఏడాది ఇలానే ఆడాలి: కపిల్ దేవ్

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ 2023 (IPL 2023) సీజన్ టైటిల్‌ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్‌ (CSK) నిలిచింది. ఫైనల్‌లో గుజరాత్ టైటాన్స్‌ చివరి బంతి వరకు పోరాడినా ఓటమి తప్పలేదు. అయితే, ఈ సీజన్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేసిన యువ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్ ఆరెంజ్‌ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. ఆరెంజ్‌ క్యాప్‌ను దక్కించుకున్న పిన్న వయస్కుడిగా రికార్డూ సృష్టించాడు. ఈ సీజన్‌లో గిల్ 890 పరుగులు సాధించాడు. ఇందులో మూడు శతకాలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘ఉప్ప‌ల్ భ‌గాయ‌త్’లో ప్లాట్లకు మరోసారి ఈ-వేలం

ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లేఅవుట్‌లో మ‌రోసారి ప్లాట్లు అమ్మ‌కానికి నోటిఫికేష‌న్ జారీ అయింది. 63 ప్లాట్లు విక్ర‌యించ‌నున్న‌ట్లు హెచ్ఎండీఏ(HMDA) నోటిఫికేష‌న్ జారీ చేసింది. 464 నుంచి 11,374 చ‌ద‌ర‌పు గ‌జాల విస్తీర్ణంలో ప్లాట్ల‌ను విక్ర‌యించ‌నున్నారు. ఉప్ప‌ల్ భ‌గాయ‌త్ లేఅవుట్‌లో(Uppal Bhagayat plots) ప్లాట్ల‌కు జూన్ 30న ఈ-వేలం నిర్వ‌హించ‌నున్నారు. క‌నీస ధ‌ర చ‌ద‌ర‌పు గ‌జానికి రూ. 35 వేలుగా నిర్ణ‌యించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిల్‌.. మంజూరు చేసిన హైకోర్టు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. సీబీఐ విచారణ నేపథ్యంలో తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ అవినాష్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఈనెల 27న హైకోర్టు వాదనలు ముగించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. 45 రోజుల్లో WFIకి ఎన్నికలు నిర్వహించకపోతే..: అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ హెచ్చరిక

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌సింగ్‌ (Brij Bhushan Sharan Singh)పై చర్యలు తీసుకోవాలని రెజ్లర్లు చేస్తోన్న ఆందోళనపై అంతర్జాతీయ రెజ్లింగ్ బాడీ(United World Wrestling (UWW))స్పందించింది. కొత్త పార్లమెంట్ ప్రారంభోత్సవం వేళ.. అటుగా మార్చ్‌ చేపట్టిన రెజ్లర్లను నిర్బంధించడాన్ని ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. అలాగే రెజ్లింగ్ సమాఖ్యకు 45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని, లేకపోతే సస్పెన్షన్‌ను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. (Wrestlers Protest) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ITR: ఉద్యోగం మారారా? ఐటీఆర్‌ దాఖలులో ఇవి మర్చిపోవద్దు!

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు (Income Tax Returns- ITR) సమయం దగ్గరపడుతోంది. వచ్చే కొన్ని రోజుల పాటు ఉద్యోగులంతా దీనిపైనే దృష్టి పెడతారు. యాజమాన్యాలు జారీ చేసే ఫారం 16 కోసం వేచి చూస్తుంటారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు ఫారం 16ను ఉద్యోగులకు అందజేశాయి. ఈ ఫారంలో వేతన ఆదాయం, పన్ను కోతలు, మినహాయింపుల వంటి వివరాలు ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఐటీఆర్‌ (ITR) దాఖలు చేయడానికి ఈ ఫారం చాలా ముఖ్యం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీజీ దేవుడికే పాఠాలు చెప్పగలరు.. అమెరికాలో రాహుల్‌ వ్యంగ్యాస్త్రాలు

అమెరికా (USA) పర్యటనలో ఉన్న కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi).. భాజపా (BJP) ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ సర్కారు భారత ప్రజలను భయపెడుతోందని, దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని దుయ్యబట్టారు. ఇక, ప్రధాని మోదీ (PM modi).. దేవుడికే పాఠాలు చెప్పే ఘనుడంటూ వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కిమ్‌కు ఎదురుదెబ్బ.. విఫలమైన నిఘా ఉపగ్రహ ప్రయోగం..!

ఉత్తర కొరియా (North Korea) తొలిసారి చేపట్టిన నిఘా ఉపగ్రహ ప్రయోగం తీవ్ర భయాందోళనలకు కారణమైంది. ఈ ప్రయోగం విఫలం కావడంతో ఆ రాకెట్‌, ఉపగ్రహ శకలాలు ఎక్కడొచ్చి మీద పడతాయోనని దక్షిణ కొరియా (South Korea) వణికిపోయింది. ఉత్తరకొరియా అధికారిక న్యూస్‌ఏజెన్సీ ఈ ప్రయోగం విఫలమైన విషయాన్ని నేడు వెల్లడించింది. ఉపగ్రహాన్ని తీసుకెళుతున్న రాకెట్‌ తొలి, రెండో దశల సమయంలో థ్రస్ట్‌ను కోల్పోయినట్లు పేర్కొంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. రెజ్లర్ల ఆందోళనపై మీడియా ప్రశ్న.. కేంద్రమంత్రి పరుగులు

లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ (Brij Bhushan Sharan Singh)కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేపట్టిన ఆందోళన (Wrestlers Protest) రోజురోజుకీ ఉద్ధృతంగా మారుతోంది. ఈ క్రమంలోనే రెజ్లర్ల నిరసన గురించి కేంద్రమంత్రి మీనాక్షి లేఖి (Meenakashi Lekhi)ని మీడియా ప్రశ్నించగా.. సమాధానం చెప్పకుండా ఆమె పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవడంతో కాంగ్రెస్‌ విమర్శలు గుప్పించింది. అసలేం జరిగిందంటే.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని