Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 19 Sep 2023 13:15 IST

1. ఏపీ వ్యాప్తంగా తెదేపా నేతల నిరసనలు.. ఎక్కడికక్కడ పోలీసుల అడ్డగింత

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కుతున్న వారిపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా ప్రత్యేక పూజలు, పాదయాత్రలు, ర్యాలీలు నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. మంగళవారం ఆయా నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలను గృహనిర్బంధం చేశారు. పోలీసుల వైఖరిపై తెదేపా నేతలు మండిపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గ్రూప్‌ ఫొటో దిగి.. పార్లమెంట్‌ పాత భవనానికి వీడ్కోలు పలికిన ఎంపీలు

స్వతంత్ర భారత్‌లో చోటుచేసుకున్న ఎన్నో కీలక ఘట్టాలకు పాత పార్లమెంట్‌ సాక్షిగా మిగలనుంది. మరికొన్ని గంటల్లో చట్టసభల కార్యకలాపాలు కొత్త భవనం(parliament new building)లోకి మారనున్నాయి. ఈ సమయంలో పాత భవనం జ్ఞాపకాలను పదిలపరుచుకునే ఉద్దేశంతో ఉభయ సభల సభ్యులంతా కలిసి గ్రూప్‌ ఫొటో దిగారు. వారంతా దీనికోసం మంగళవారం ఉదయం పాత పార్లమెంట్‌ ప్రాంగణానికి వచ్చారు. (Parliament Special Session) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. క్వాష్‌ పిటిషన్‌పై విచారణ ప్రారంభం.. వాదనలు వినిపిస్తున్న హరీశ్‌సాల్వే

 స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో తెదేపా అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ప్రారంభమైంది. జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఉత్తర్వులను కొట్టివేయాలని పిటిషన్‌లో చంద్రబాబు కోరిన విషయం తెలిసిందే. ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌సాల్వే వర్చువల్‌గా వాదనలు వినిపిస్తున్నారు. పీసీ యాక్ట్‌ 17ఏపై తన వాదనలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికల నేపథ్యంలో దురుద్దేశంతోనే చంద్రబాబుపై కేసు నమోదు చేశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే.. మోదీ కీలక వ్యాఖ్యలు..!

చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లు (Women's Reservation Bill)కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. సోమవారం జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో ఈ బిల్లుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. ‘ఈ బిల్లు ఎంపీలకు అగ్నిపరీక్షే’ అని మోదీ అభివర్ణించినట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ పలు జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కెనడాకు గట్టి బదులు.. ఆ దేశ రాయబారిపై భారత్‌ వేటు

భారత్‌, కెనడా (India-Canada) మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ హస్తం ఉందని ఆరోపించిన కెనడా.. ఆ దేశంలోని మన రాయబారిపై బహిష్కరణ వేటు వేసిన విషయం తెలిసిందే. ఈ చర్యను తీవ్రంగా ఖండించిన భారత్‌.. కెనడాకు గట్టిగా బదులిచ్చింది. భారత్‌లోని కెనడా దౌత్యవేత్తను బహిష్కరించింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జైల్లో చంద్రబాబు భద్రతకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిది: బొత్స

తెదేపా అధినేత చంద్రబాబుకు జైల్లో కల్పించే భద్రతపై పూర్తి బాధ్యత ప్రభుత్వానిదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏదైనా లోపం జరిగితే దానికి తాము పూర్తి బాధ్యత వహిస్తామని చెప్పారు. విజయనగరంలో బొత్స మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం కాదని.. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో ప్రమేయం లేదని చంద్రబాబు నిరూపించుకోవాలన్నారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈ సెంట్రల్‌ హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్షి: మోదీ

కొత్త పార్లమెంట్‌కు తరలివెళ్లే ముందు ఉభయ సభల సభ్యులు పాత భవనంలోని సెంట్రల్‌ హాల్‌లో సమావేశమయ్యారు. పార్లమెంటరీ వారసత్వంపై అందులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోదీ(Modi) మాట్లాడారు. ఈ సెంట్రల్‌ హాల్‌ ఎన్నో చారిత్రక ఘట్టాలకు సాక్ష్యంగా నిలిచిందని పేర్కొన్నారు. పాత పార్లమెంట్ భవనం ఇకపై సంవిధాన్‌ సదన్‌(Constitution House)గా ఉండనుందని తెలిపారు. (Parliament Special Session) పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌పై కెనడా వ్యాఖ్యలు.. అమెరికా స్పందనిదే

ఖలిస్థాన్‌ టైగర్‌ ఫోర్స్‌ నేత హర్‌దీప్‌ సింగ్ నిజ్జర్‌ (Hardeep Singh Nijjar) హత్య వెనుక భారత్‌ ఏజెంట్ల పాత్ర ఉండొచ్చనడానికి విశ్వసనీయమైన సమాచారం ఉందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో (Justin Trudeau) చేసిన ఆరోపణలపై అమెరికా స్పందించింది. ఆయన ప్రస్తావించిన అంశాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు శ్వేతసౌధ కౌన్సిల్‌ ప్రతినిధి అడ్రియెన్నె వాట్సన్‌ స్పందించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. చంద్రబాబుకు మద్దతుగా చెన్నైలో తెలుగు ప్రజల ఆందోళన

చంద్రబాబుకు (Chandrababu) మద్దతుగా చెన్నైలో తెలుగు ప్రజలు, ఐటీ ఉద్యోగులు నిరసన చేపట్టారు. ఏపీలో ఇప్పటికీ రాజధాని లేదని, మూడు రాజధానుల పేరుతో ఏపీని నాశనం చేశారని వారు ధ్వజమెత్తారు. ఏపీలో అవకాశాలు లేకే పక్క రాష్ట్రాలకు వచ్చి ఉద్యోగం చేస్తున్నామన్నారు. చంద్రబాబు విడుదల అయ్యేవరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. భారత్‌తో కెనడా విభేదాల వెనుక ఎవరు..?

జీ20 సదస్సు వేదికగా రాజుకొన్న భారత్‌-కెనడా విభేదాలు నేడు మరింత భగ్గుమన్నాయి. గత నెల ఖలిస్థానీ మద్దతుదారులు బ్రిటిష్‌ కొలంబియాలోని సర్రేలో లక్ష్మీనారాయణ మందిర్‌ను ధ్వంసం చేసి.. ‘‘జూన్‌ 18 హత్యపై కెనడా దర్యాప్తు చేస్తుంది’’ అని పోస్టర్లు అంటించారు. ఇప్పుడు కెనడా ప్రధాని అదే వాదన తెరపైకి తీసుకొచ్చారు. దీని వెనుక భారత్‌ హస్తం ఉందని ట్రూడో తాజాగా అనుమానాలు వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని