Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 28 Sep 2023 13:19 IST

1. ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూత

భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో గురువారం (సెప్టెంబరు 28) ఉదయం 11 గంటల ప్రాంతంలో తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రికార్డు ధర పలికిన బాలాపూర్‌ లడ్డూ

దేశవ్యాప్తంగా పేరుగాంచిన బాలాపూర్‌ లడ్డూ అత్యధిక ధర పలికింది. ఈసారి లడ్డూను తుర్కయాంజల్‌కు చెందిన దాసరి దయానంద రెడ్డి రూ.27లక్షలకు దక్కించుకున్నారు. ఈ వేలం పాటలో 20 మంది స్థానికులు సహా మొత్తం 36 మంది పోటీపడ్డారు. బాలాపూర్ ఉత్సవ సమితి రూ.1,116తో వేలం పాట ప్రారంభించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. బండ్లగూడ జాగీర్‌ లడ్డూ @ రూ.1.26 కోట్లు

గణేశ్‌ ఉత్సవాల్లో చివరి రోజైన నిమజ్జనం రోజు లడ్డూ వేలం పాటలు పోటాపోటీగా సాగుతున్నాయి. హైదరాబాద్‌లోని బండ్లగూడ జాగీర్‌లో లంబోదరుడి చేతిలోని లడ్డూ రికార్డు ధర పలికింది. కీర్తి రిచ్మండ్‌ విల్లాస్‌లో జరిగిన వేలంలో వినాయకుడి లడ్డూ ఏకంగా రూ.1.26 కోట్లు పలికింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తిరుమల ఘాట్‌ రోడ్డులో కొండను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

తిరుమల రెండో ఘాట్‌ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి కొండను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు, తితిదే ఉద్యోగులకు గాయాలయ్యాయి. ప్రమాదం కారణంగా ఆ మార్గంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ బిలియన్‌ డేస్‌ వచ్చేశాయ్‌..

పండగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ ఏటా నిర్వహించే ‘బిగ్‌ బిలియన్‌ డేస్‌ (Flipkart Big Billion Days)’ ప్రత్యేక సేల్‌కు సిద్ధమైంది. ఇప్పటికే వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా ఓ మైక్రోసైట్‌ను క్రియేట్‌ చేసి వివిధ ఆఫర్లను ప్రకటించింది. తాజాగా ప్రత్యేక సేల్‌ (Flipkart Big Billion Days) తేదీలను ప్రకటించింది. అక్టోబర్‌ 08 నుంచి అక్టోబర్‌ 15 వరకు ఈ సేల్‌ జరగనుంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మణిపుర్‌లో మళ్లీ కల్లోలం.. పుల్వామా దర్యాప్తు ఐపీఎస్‌ అధికారికి పిలుపు

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో మరోసారి కల్లోల పరిస్థితులు (Manipur Violence) నెలకొన్నాయి. విద్యార్థుల హత్యతో ఆందోళనలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ ఎస్‌ఎస్పీ రాకేశ్‌ బల్వాల్‌ (Rakesh Balwal)ను తన సొంత కేడర్‌ అయిన మణిపుర్‌కు బదిలీ చేసింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ (Home Minitsry) గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘మేం చేసింది ఘోర తప్పిదం.. క్షమించండి’: కెనడా ప్రధాని ట్రూడో

ఓ వైపు ‘ఖలిస్థానీ’ అంశంలో భారత్‌తో వివాదం జరుగుతున్న వేళ కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో(Justin Trudeau)ను ‘నాజీ’ అంశం తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. అది ఇప్పటికే తన ప్రభుత్వంలో స్పీకర్‌ రాజీనామాకు దారితీసింది. ఈ పరిస్థితుల్లో తాజాగా ట్రూడో(Justin Trudeau).. బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అలాగే ఉక్రెయిన్‌ ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పేందుకు ఇప్పటికే దౌత్యమార్గాల్లో చర్చలు జరిపారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్‌ షేర్ల ట్రేడింగ్‌ నిలిపివేత

అప్పుల ఊబిలో కూరుకుపోయిన చైనా స్థిరాస్తి దిగ్గజం ఎవర్‌గ్రాండ్‌ (Evergrande) షేర్ల ట్రేడింగ్‌ను గురువారం హాంకాంగ్‌ మార్కెట్‌లో నిలిపివేశారు. మరో రెండు అనుబంధ సంస్థల షేర్ల ట్రేడింగ్‌ను సైతం సస్పెండ్‌ చేసినట్లు హంకాంగ్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ ప్రకటించింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఎక్స్‌ కీలక నిర్ణయం.. నకిలీ వార్తలపై ఫిర్యాదు ఫీచర్‌ తొలగింపు..!

సామాజిక మాధ్యమాల్లో నకిలీ ఎన్నికల వార్తల (Fake News) వ్యాప్తిని అడ్డుకునేందుకు ఎక్స్‌ (ట్విటర్‌)లో ప్రత్యేక ఫీచర్‌ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా సోషల్‌ మీడియాలో చేసే నకిలీ పోస్టులపై ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ఎక్స్‌కు ఫిర్యాదు చేయొచ్చు. తాజాగా కొన్ని దేశాల్లోని ఎక్స్‌లో ఈ ఫీచర్‌ను తొలగించినట్లు తెలుస్తోంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆంగ్లంలో డిజిటల్‌ సైన్‌బోర్డ్‌ ఏర్పాటుపై మండిపడ్డ నీతీశ్‌

అందరికీ అర్థం కావాల్సిన వాటిపై ఆంగ్ల భాషలో రాయడాన్ని బిహార్‌ (Bihar)ముఖ్యమంత్రి నీతీశ్‌ కుమార్‌ (Nitish Kumar) తప్పు పట్టారు. ఓ ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన ఆయన అక్కడున్న సైన్‌బోర్డ్‌పై ఆంగ్ల (English)పదాలను చూసి మండిపడ్డారు. రాజధాని పట్నాకు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న బంకా జిల్లాలో సీఎం పర్యటన  సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకొంది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని