Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 19 Nov 2021 17:07 IST

1.తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు: వాతావరణ శాఖ

తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ రోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నిన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోని ఉత్తర తమిళనాడు తీరంలో ఉన్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదిలి పుదుచ్చేరి, చెన్నై మధ్యలో తీరాన్ని దాటింది.

2.క్షేత్రస్థాయిలో తేల్చుకున్నాకే మళ్లీ అసెంబ్లీకి వెళ్తా: చంద్రబాబు

 వైకాపా అరాచకపాలనపై తాను చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా సహకరించాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారు. క్షేత్రస్థాయిలో తేల్చుకున్న తర్వాతే అసెంబ్లీకి వెళ్తానని.. అంతవరకూ వెళ్లనన్నారు. మంగళగిరి తెదేపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

3.తిరుమల ఘాట్‌రోడ్లపై రాకపోకలకు అనుమతిచ్చిన తితిదే

గత రెండు రోజులుగా మూసివేసి ఉన్న తిరుమల ఘాట్‌ రోడ్లను తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పునరుద్ధరించింది. రెండు ఘాట్‌ రోడ్లలోనూ భక్తులను అనుమతించాలని నిర్ణయించింది. గత రెండు రోజులుగా తిరుమలతో కురిసిన భారీ వర్షాలకు ఘాట్‌రోడ్లపై చెట్లు కూలిపోయాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో వాటిని తొలగించేందుకు ఘాట్‌ రోడ్లను తితిదే మూసేసింది.

భారీ వర్షాలకు ధ్వంసమైన శ్రీవారి మెట్ల మార్గం

4.తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటాం: నక్కా ఆనందబాబు

రాష్ట్రంలో ప్రతిపక్షాలను తుడిచిపెట్టాలనే ఆలోచన తప్పు అని మాజీమంత్రి, తెదేపా సీనియర్‌ నేత నక్కా ఆనందబాబు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆనందబాబు మాట్లాడుతూ... వైకాపా నేతల తీరును తప్పుబట్టారు.

5.చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేదు: అంబటి

తెదేపా అధినేత చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి శాసనసభలో ఎవరూ మాట్లాడలేదని వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కుప్పంలో ఓడిపోవడం వల్లే చంద్రబాబు ఈ తరహా ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. శాసనసభ ఒక్క రోజే నిర్వహించాలని అనుకున్నా... ప్రతిపక్ష పార్టీ అభ్యర్థన మేరకు 26వరకు పొడిగించారని తెలిపారు.

6.ఎక్కడ తగ్గాలో తెలుసుకొన్న మోదీ..!
‘ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తుంది’ అని ప్రధాని మోదీ నేటి ఉదయం ప్రకటించడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. సాధారణంగా నరేంద్ర మోదీ పాలనలో ఏదైనా చట్టం వస్తే వెనక్కి తీసుకోవడం దాదాపు అసాధ్యం. మోదీ ఎనిమిదేళ్ల పాలనలో ‘ల్యాండ్‌ ఎక్విజిషన్‌ ఆర్డినెన్స్‌ 2015’ తర్వాత వెనక్కి తీసుకొన్న రెండో నిర్ణయం ఇదే.

7.ఓటమిని గ్రహించే సాగు చట్టాల రద్దు.. కేంద్రంపై ప్రియాంక విమర్శలు

నూతన సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నప్పటికీ.. ఎన్నికల వేళ ఈ సంచలన నిర్ణయం తీసుకోవడంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పలు రాష్ట్రాల్లో ఎన్నికల్లో ఓడిపోతారనే కేంద్రం సాగు చట్టాలపై వెనక్కి తగ్గిందని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా దుయ్యబట్టారు. సాగు చట్టాల రద్దుపై నేడు మీడియాతో మాట్లాడిన ఆమె.. ప్రధానిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

8.కరోనాపై కొత్త ఆయుధం సిద్ధం..!

కొవిడ్‌పై పోరుకు మరో కొత్త ఆయుధం అందుబాటులోకి రానుంది. ఇప్పటికే పలు టీకాలు, రీపర్పస్‌ ఔషధాలు వినియోగంలో ఉండగా.. రీజనరాన్‌ సంస్థ యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రభావవంతంగా ఉందని వైద్యులు అభిప్రాయపడ్డారు. తాజాగా మరో యాంటీబాడీ కాక్‌టెయిల్‌ కూడా అందుబాటులోకి రానుంది.

9.ఆర్సీబీకి బిగ్‌ షాక్‌.. క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలికిన డివిలియర్స్‌

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ దక్షిణాఫ్రికా జట్టుకు గతంలోనే రిటైర్మెంట్‌ ప్రకటించగా తాజాగా మొత్తం ఆటకే వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని అతడే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించాడు. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తనకు అవకాశం కల్పించిన అన్ని జట్లకూ కృతజ్ఞతలు తెలియజేశాడు. ఇన్నేళ్లు క్రికెటర్‌గా కొనసాగడం అద్భుతమైన ప్రయాణమని, కానీ.. ఇప్పుడు ఆటకు మొత్తానికే వీడ్కోలు పలకాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపాడు.

10.హెల్త్‌కేర్‌ రంగంలోకి ఫ్లిప్‌కార్ట్‌ సేవల విస్తరణ

వాల్‌మార్ట్‌ నేతృత్వంలోని ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఫ్లిప్‌కార్ట్‌ హెల్త్‌+ పేరిట హెల్త్‌కేర్‌ రంగంలోకి తమ సేవల్ని విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కోల్‌కతా కేంద్రంగా ఆన్‌లైన్‌ ఫార్మసీ, డిజిటల్‌ హెల్త్‌కేర్‌ ప్లాట్‌ఫాం www.sastasundar.comలో మెజారిటీ వాటాను కొనుగోలు చేస్తున్నట్లు తెలిపింది. ఒప్పంద విలువను మాత్రం వెల్లడించలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని