Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్‌ 10 వార్తలు: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 01 Oct 2022 16:58 IST

1. తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణం కేంద్రం వెల్లడించింది. ఇవాళ రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ పక్రటనలో తెలిపారు. నిన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఆంధ్రప్రదేశ్‌ తీరం నుంచి ఉన్న తూర్పు-పశ్చిమ ద్రోణి ఇవాళ బలహీన పడినట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు.. దిల్లీలో అవార్డులిస్తున్నారు: సీఎం కేసీఆర్‌

తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని సీఎం కేసీఆర్‌ అన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్‌ వన్‌గా ఉందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వరంగల్‌లో ప్రతిమ క్యాన్సర్‌ ఆస్పత్రిని సీఎం కేసీఆర్‌ ఇవాళ ప్రారంభించారు. 350 పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. తెలుగుదేశం పార్టీ ట్విటర్‌ అకౌంట్‌ హ్యాక్‌

తెలుగుదేశం పార్టీకి చెందిన అధికారిక ట్విటర్‌ ఖాతా హ్యాక్‌కు గురైంది. తెదేపా ట్విటర్‌ హ్యాండిల్‌ స్థానంలో ‘టైలర్‌ హాబ్స్‌’ అనే పేరు ప్రత్యక్షం అవడంతో హ్యాక్‌కు గురైనట్లు గుర్తించామని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ట్విటర్‌ ఖాతాలో తెదేపా పోస్టులకు బదులుగా విజువల్‌ ఆర్ట్స్‌కు చెందిన పోస్టులు దర్శనమిస్తున్నాయి. ట్విటర్‌ హ్యాండిల్‌లో క్యూక్యూఎల్‌ (QQL) క్రియేటర్‌ అని రాసి ఉంది. అకౌంట్‌ హ్యాక్‌ అవ్వడం వెనుక వైకాపా మద్దతు దుష్టశక్తులు ఉన్నాయని పార్టీ శ్రేణులు ఆరోపించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. ఖర్గే - థరూర్‌ మధ్యే పోటీ.. మూడో నామినేషన్‌ తిరస్కరణ

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు పోటీ ఖరారైంది. ఈ పదవికి సీనియర్‌ నేత మల్లికార్జున్‌ ఖర్గే, ఎంపీ శశి థరూర్‌తో పాటు ఝార్ఖండ్‌ మాజీ మంత్రి కె.ఎన్‌.త్రిపాఠి నామపత్రాలు సమర్పించగా.. వీరిలో త్రిపాఠి  నామినేషన్‌ తిరస్కరణకు గురైంది. దీంతో ఖర్గే - థరూర్‌ మధ్యే పోటీ నెలకొంది. అధ్యక్ష పదవికి ముగ్గురు అభ్యర్థులు మొత్తం 20 నామినేషన్‌ సెట్లను సమర్పించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. పాక్‌ ప్రభుత్వ ట్విటర్ ఖాతా.. భారత్‌లో నిలిపివేత..!

పాక్‌ ప్రభుత్వ ట్విటర్‌ ఖాతా భారత్‌లో నిలిపివేతకు గురైంది. చట్టపరమైన డిమాండ్ కారణంగా ఈ చర్య చేపట్టినట్లు ఆ ఖాతాలో సందేశం కనిపించింది. శనివారం ఉదయం ఓ వార్తా ఏజెన్సీ  దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను షేర్ చేసింది. ‘భారత్‌లో పాకిస్థాన్‌ ప్రభుత్వ ట్విటర్ ఖాతాను నిలిపివేశారు’ అని పేర్కొంది.జులైలో కూడా ఈ ఖాతాను బ్లాక్‌ చేశారు. తర్వాత పునరుద్ధరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. ‘ఆచార్య’ ఫెయిల్యూర్‌.. దర్శకుడు చెప్పిందే మేము చేశాం: చిరంజీవి

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఆచార్య’ (Acharya) పరాజయంపై మెగాస్టార్‌ చిరంజీవి (Chairanjeevi) తొలిసారి పెదవి విప్పారు. ఆ సినిమా అపజయం తనను ఏమాత్రం బాధించలేదన్నారు. ‘గాడ్‌ఫాదర్‌’ ప్రమోషన్‌లో భాగంగా ఓ బాలీవుడ్‌ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన ‘ఆచార్య’ ఫ్లాప్‌పై స్పందించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. 1జీబీ డేటా ఒకప్పుడు ₹300.. ఇప్పుడు ₹10లకే: మోదీ

టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు 5జీ టెక్నాలజీ శ్రీకారం చుట్టబోతోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 21వ శతాబ్దంలో ఇది చరిత్రాత్మకమైన రోజుగా అభివర్ణించారు. ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు ప్రారంభం సందర్భంగా శనివారం దేశంలో 5జీ సేవలు ఆవిష్కరించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. 130 కోట్ల మంది భారతీయులకు టెలికాం పరిశ్రమ ఇస్తున్న బహుమానం ఇది అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. వరుసగా ఏడో నెల.. జీఎస్టీ వసూళ్లు ₹1.40 లక్షల కోట్లపైనే

దేశంలో వస్తు సేవల పన్ను వసూళ్లు (GST) మరోసారి రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. సెప్టెంబరు నెలకు గానూ రూ.1,47,686  కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ శనివారం వెల్లడించింది. గతేడాది సెప్టెంబరు నెలతో పోలిస్తే 26శాతం వృద్ధి నమోదైంది. కాగా.. జీఎస్టీ వసూళ్లు రూ.1.40 లక్షల కోట్లపైన నమోదవ్వడం వరుసగా ఇది ఏడోసారి కావడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. మహిళల ఆసియా కప్‌లో భారత్‌ బోణీ.. లంకపై ఘన విజయం

మహిళల ఆసియా కప్‌లో భారత్‌ బోణీ కొట్టింది. గ్రూప్‌ స్టేజ్‌లో శ్రీలంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 41 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 150 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లంక18.2 ఓవర్లలో కేవలం 109 పరుగులకే ఆలౌటైంది. హాసిని పెరెరా (30*) టాప్‌ స్కోరర్‌. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. రష్యా దుశ్చర్య.. ఉక్రెయిన్‌ అణువిద్యుత్ కేంద్రం హెడ్‌ ‘కిడ్నాప్‌’

ఐరోపాలోనే అతిపెద్ద అణు కర్మాగారమైన ఉక్రెయిన్‌ జపోరిజియా న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌ ప్రస్తుతం రష్యా సేనల ఆధీనంలో ఉంది. అయితే ఈ అణు విద్యుత్‌ కేంద్రం డైరెక్టర్‌ జనరల్‌ ఇహోర్‌ మురాషోవ్‌ను క్రెమ్లిన్‌ అపహరించినట్లు ఉక్రెయిన్‌ తాజాగా ఆరోపించింది. శుక్రవారం సాయంత్రం మురాషోవ్‌ కారును అడ్డగించిన రష్యా సేనలు.. ఆయన కళ్లకు గంతలు కట్టి రహస్య ప్రాంతానికి తీసుకెళ్లినట్లు కీవ్‌ ప్రభుత్వ న్యూక్లియర్‌ ఏజెన్సీ ‘ఎనర్జోఆటమ్‌’ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts