Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

టాప్ 10 న్యూస్‌: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 07 Oct 2022 17:11 IST

1. పేదలకు ఇళ్లు ఇవ్వరు.. మోదీ రూ.435 కోట్లతో ఇల్లు కట్టుకుంటున్నారు: మంత్రి కేటీఆర్‌

సాగు దండగ కాదు.. పండుగ అని నిరూపించిన వ్యక్తి కేసీఆర్‌ అని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. వ్యవసాయానికి 24 గంటలు ఉచితంగా విద్యుత్‌ ఇవ్వొచ్చని నిరూపించారని కొనియాడారు. ఫ్లోరైడ్‌ సమస్యను మిషన్‌ భగీరథతో పరిష్కరించామని తెలిపారు. మంత్రి కేటీఆర్‌ హైదరాబాద్‌లో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. రెయిన్‌ అలర్ట్‌.. తెలంగాణలో రాగల 3 రోజులు వర్షాలు

తెలంగాణలో రాగల 3 రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని పలుచోట్ల నేడు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర సంచాలకులు డాక్టర్‌ నాగరత్న ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  నిన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌ పరిసర ప్రాంతాలలో ఉన్న ఆవర్తనం ఈరోజు తెలంగాణ పరిసరాల్లోని విదర్భలో కొనసాగుతూ సగటు సముద్ర మట్టానికి 1.5 నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు మధ్య విస్తరించి ఉందని తెలిపారు.  పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. మహనీయులను అవమానించి జగన్‌ రాక్షసానందం: నారా లోకేశ్‌

సీఎం జగన్‌కు పేర్ల మార్పు పిచ్చి పరాకాష్ఠకు చేరిందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ధ్వజమెత్తారు. మహనీయులను అవమానించి రాక్షసానందం పొందుతున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్‌ హెల్త్‌ యూనివర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేశారని.. నేడు విజయనగరంలో ఉన్న మహారాజా జిల్లా ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారని దుయ్యబట్టారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

4. రెండురోజుల లాభాలకు బ్రేక్‌.. ఆద్యంతం 82 ఎగువనే రూపాయి!

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల్లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌ ఇంట్రాడేలో దాదాపు 370 పాయింట్ల వరకు కుంగింది. కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల మద్దతుతో భారీగా పుంజుకుంది. కానీ, పూర్తిస్థాయి లాభాల్లోకి మాత్రం రాలేకపోయింది. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. ‘పౌర హక్కుల పరిరక్షణ’కు.. నోబెల్‌ శాంతి పురస్కారం!

ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి(Nobel Peace Prize).. పౌర హక్కుల(Human Rights) కోసం కృషి చేస్తోన్న ఓ వ్యక్తితో పాటు రెండు సంస్థలకు వరించింది. బెలారస్‌(Belarus)కు చెందిన మానవ హక్కుల న్యాయవాది అలెస్‌ బియాలియాత్‌స్కీ(Ales Bialiatski)తో పాటు రష్యా, ఉక్రెయిన్‌లకు చెందిన మానవ హక్కుల సంస్థలు ‘మెమోరియల్‌’, ‘సెంటర్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌’కు సంయుక్తంగా ఈ పురస్కారం అందజేస్తున్నట్లు నోబెల్‌ కమిటీ ప్రకటించింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. పాకిస్థాన్‌కు షావోమీ కార్యకలాపాలు?.. కంపెనీ క్లారిటీ!

భారత ప్రభుత్వ ఏజెన్సీల నుంచి దర్యాప్తు ఎదుర్కొంటున్న నేపథ్యంలో షావోమీ ఇండియా (Xiaomi India) తమ కంపెనీ కార్యకలాపాలను పాక్‌కు తరలిస్తోందంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై ఆ కంపెనీ స్పందించింది. తమ సంస్థ కార్యకలాపాలను ఎక్కడికీ తరలించడం లేదని, ఆ వార్తలు అవాస్తవమని స్పష్టం చేసింది. ఇటీవల ఆ కంపెనీకి చెందిన రూ.5551.27 కోట్ల నగదును ఈడీ సీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. యూకే హోం మంత్రి వీసా వ్యాఖ్య.. భారత్‌ కౌంటర్‌..!

వీసా పరిమితి దాటిన తర్వాత కూడా బ్రిటన్‌లో ఉంటోన్న భారతీయులను ఉద్దేశించి యూకే హోం సెక్రటరీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనికి గట్టిగానే భారత్ కౌంటర్ ఇచ్చింది. గత ఏడాది రెండు దేశాల మధ్య జరిగిన మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్‌షిప్‌(ఎంఎంపీ) ఆశించిన రీతిలో పనిచేయడం లేదని యూకే మంత్రి సుయెల్లా బ్రేవర్మన్‌ అన్నారు. ఈ ఒప్పందం కింద లేవనెత్తిన అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించామని ఇండియన్‌ హై కమిషన్ బదులిచ్చింది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. మహిళల ఆసియా కప్‌.. హ్యాట్రిక్‌ విజయాలకు బ్రేక్‌.. పాక్‌ చేతిలో భారత్‌ ఓటమి

ఆసియా కప్‌లో వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచిన భారత మహిళల జట్టు తొలి ఓటమిని మూటగట్టుకొంది. పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా పరాభవం ఎదుర్కొంది. తొలుత టాస్‌ నెగ్గి బ్యాటింగ్‌ ఎంచుకొన్న పాక్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 137 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో టీమ్‌ఇండియా 19.4 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. అమెరికాలో ‘నాటు నాటు’ పాట గురించి ప్రస్తావించిన రాజమౌళి...

భారత చలనచిత్రానికి అంతర్జాతీయ గుర్తింపు పొందేలా చేసిన సినిమా ‘ఆర్‌ఆర్‌ఆర్’‌. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు అదిరిపోయే స్టెప్స్‌ వేయించారు కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌. ప్రపంచవ్యాప్తంగా సోషల్‌మీడియాను  ఈ పాట హోరెత్తించిన సంగతి తెలిసిందే. దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంతోమంది యువత కవర్‌ సాంగ్స్‌ చేసి ట్రెండ్‌ సృష్టించారు. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి  

10. విటమిన్‌ డి ఉంటే.. ఆనందం మీ సొంతం..! ఎలాగో తెలుసా..?

ఒక్కో విటమిన్‌కు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది.   వీటిల్లో కొన్ని శరీరంలోని ప్రత్యేక భాగాలకు ఉపకరిస్తే.. మరికొన్ని మానసిక ఉల్లాసానికి దోహద పడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ప్రధానమైనది ‘డి విటమిన్‌’. ఇది మనకు ఎముకల ఆరోగ్యం, రోగ నిరోధకతనే కాదు.. ఆనందం, ఉల్లాసం కూడా అందించనుందని పేర్కొంటున్నారు. విచారంగా ఉండటం, కోపం, చిరాకు పడటం వెనక కూడా ‘డి విటమిన్‌’ లోపమే కారణమని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts