Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 12 Aug 2022 17:02 IST

1. అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్‌.. పీడీఎఫ్‌ రూపంలో పాఠ్యాంశాలు: సీఎం జగన్‌

పాఠశాలల్లో ఎక్కడా పుస్తకాల కొరత రానీయొద్దని సీఎం జగన్‌ అధికారులకు స్పష్టం చేశారు. వచ్చే ఏప్రిల్‌లో అందించే జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీకి ఇప్పటి నుంచే అన్ని రకాలుగా సిద్ధం కావాలని ఆదేశించారు. పిల్లలకు అందిస్తున్న యూనిఫాం నాణ్యతను పరిశీలించారు. పాఠ్యపుస్తకాల కంటెంట్‌ను పీడీఎఫ్‌ ఫైల్స్‌ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని.. అప్పుడే అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు అందించాలని సూచించారు.

2. పిలవని పేరంటానికి వెళ్లను.. పీసీసీ తీరుపై ఎంపీ కోమటిరెడ్డి ఫైర్‌

మునుగోడు ఉప ఎన్నిక వేళ పీసీసీ తీరుపై ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉప ఎన్నిక కార్యక్రమాలపై పీసీసీ నుంచి తనకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. పిలవని పేరంటానికి తాను వెళ్లనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మునుగోడు ఉప ఎన్నిక గురించి నాతో ఎవరూ మాట్లాడట్లేదు. దాని గురించి నాకేం తెలియదు. చండూరు సభలో ఓ పిల్లాడితో నన్ను తిట్టించారు. మమ్మల్ని అవమానించిన వారు క్షమాపణ చెప్పాలి’’ అని అన్నారు.


Video: ఎలాన్‌ మస్క్‌ సొంత సోషల్‌ మీడియా ప్రారంభించనున్నారా?


3. డ్వాక్రా గ్రూపులను తెరాస నిర్వీర్యం చేసింది: బండి సంజయ్‌

గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ప్‌), పట్టణపేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా), మహిళా స్వయం సహాయక సంఘాలకు(ఎస్‌హెచ్‌జీ) ప్రభుత్వం చెల్లించాల్సిన వడ్డీ బకాయిలు రూ.4 వేల కోట్ల వరకు పేరుకుపోయాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా డ్వాక్రా గ్రూపుల్లోని మహిళలకు రూ.4 వేల కోట్ల వడ్డీ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

4. కృష్ణా నదికి పోటెత్తిన వరద.. ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తివేత

ఎగువ నుంచి కృష్ణా నదిలోకి వరదనీరు వస్తుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. దీంతో బ్యారేజీ వద్ద అధికారులు పూర్తిస్థాయి అప్రమత్తత ప్రకటించారు. స్నానఘట్టాల వద్దకు సందర్శకులను అనుమతించడం లేదు. నదికి ఇరువైపులా పోలీసు పికెటింగ్‌ ఏర్పాట్లు చేశారు. బ్యారేజీలోని మొత్తం 70 గేట్లను ఎత్తి 4.44లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  మరోవైపు విజయవాడ నగరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు.

5. ‘నాకు ఆ ఆలోచన లేదు’: చేతులు జోడించి మరీ స్పష్టం చేసిన నీతీశ్‌

భాజపాతో బంధాన్ని తెంచుకొని ఆర్జేడీతో దోస్తీ కట్టిన బిహార్ ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దేశ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యారు. ఈ సమయంలో ఆయన ప్రధాని పదవికి పోటీపడతారా..? అనే వార్తలు వినిపిస్తున్నాయి. దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ వాటిపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతానికి తన మనసులో ప్రధానమంత్రి పదవి గురించి ఎలాంటి ఆలోచన లేదన్నారు. ‘అది నా మనసులో లేదు. నాకు సన్నిహితంగా మెలిగేవారితో సహా ఎవరు ఏం చెప్పినా నాకు సంబంధం లేదు’ అని చేతులు జోడించి మరీ స్పష్టం చేశారు.


Video: పోరాటయోధుల త్యాగఫలమే.. స్వాతంత్య్ర సిద్ధి!


6. ఆ సినిమా చేసి నేనూ అరవింద్‌ రూ. 12 కోట్లు నష్టపోయాం: అశ్వనీదత్‌

ఓటీటీ కంటే యూట్యూట్‌ ప్రమాదకరమని అన్నారు ప్రముఖ నిర్మాత అశ్వనీదత్‌. వైజయంతి మూవీస్‌ నెట్‌వర్క్‌పై నిర్మితమైన ‘సీతారామం’ చిత్రం ఇటీవల విడుదలై విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. ఈ సందర్భంగా ఆయన ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga) కార్యక్రమానికి విచ్చేసి పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. తానెప్పటికీ సీనియర్‌ ఎన్టీఆర్‌ని దైవంగానే భావిస్తానన్నారు. తన తనయలు నిర్మించిన ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా సంగతులు వివరిస్తూ నవ్వులు కురిపించారు.

7. ఫ్రీ విమాన టికెట్‌ అంట.. క్లిక్‌ చేశారో బుక్‌ అయ్యారే!

సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాలు అనుసరిస్తున్నారు. ఫ్రీ రీఛార్జి పేరుతోనో, కంపెనీ వార్షికోత్సవం పేరుతోనో ఫేక్‌ లింక్‌లు సృష్టించి మోసాలకు పాల్పడేవారు.. తాజాగా గివ్‌ అవే పేరుతో మరో కొత్త మోసానికి తెరతీశారు. ఫ్రీ విమాన టికెట్లంటూ ఎర వేస్తున్నారు. ఒకవేళ మీకూ అలాంటి లింక్‌ వచ్చిందా?.. అలాంటి లింకుల పట్ల అప్రమత్తంగా ఉండండి. పొరపాటున క్లిక్‌ చేశారో ఇక అంతే సంగతులు. ఇటీవల ఎమిరేట్స్‌ ఎయిర్‌లైన్స్‌ పేరిట ఓ లింక్‌ వాట్సాప్‌లో సర్క్యులేట్‌ అవుతోంది. ఆ లింక్‌ ఓపెన్‌ చేస్తే చిన్న క్విజ్‌ నిర్వహిస్తారు.

8. రిషభ్‌ పంత్‌కు కౌంటర్‌ ఇచ్చిన బాలీవుడ్‌ నటి..

టీమ్‌ఇండియా వికెట్‌ కీపర్‌, బ్యాట్స్‌మన్‌ రిషభ్ పంత్‌ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టి డిలీట్‌ చేయడం ఆసక్తిగా మారింది. ఒక బాలీవుడ్‌ నటిని ఉద్దేశించే ఆ స్టోరీ పెట్టి తొలగించాడని నెటిజన్లు అంటున్నారు. పది నిమిషాల్లోనే పంత్‌ ఆ స్టోరీని తొలగించినా.. అప్పటికే అది వైరల్‌గా మారింది. దీనిపై సదరు నటి కూడా ఘాటుగానే స్పందించింది. ఇంతకీ ఏం జరిగిందంటే.. బాలీవుడ్‌ నటి ఊర్వశీ రౌతెలా కొద్దిరోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘మిస్టర్‌ ఆర్పీ’ అనే వ్యక్తి గతంలో తనని కలవడానికి చాలా కాలం ఎదురు చూశాడని చెప్పింది.


Video: చైనాపై ప్రకృతి ప్రతాపం..వరదలతో కొట్టుకుపోతున్న కార్లు!


9. స్వాతంత్ర్య దినోత్సవం నాడు గుమిగూడొద్దు.. కేంద్రం సూచన

దేశంలో కరోనా వైరస్‌ కేసులు మళ్లీ పెరుగుతోన్న నేపథ్యంలో రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం అప్రమత్తం చేసింది. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలకు సూచించింది. మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించాలని ప్రజలను కోరింది. వ్యాధి సంక్రమణకు గురికాకుండా అవసరమైన అన్ని కొవిడ్‌ నియమాలను పాటించాలని పేర్కొంది.

10. 120 కార్లు..250 మంది సిబ్బంది..సినిమాను తలపించేలా నోట్ల గుట్టలు స్వాధీనం

మహారాష్ట్రలోని పలు సంస్థల నుంచి ఆదాయ పన్నుశాఖ అధికారులు నిన్న రూ.390 కోట్ల విలువైన ఆస్తుల్ని జప్తు చేశారు. ఈ భారీ మొత్తంలో నగదు, ఆభరణాల స్వాధీనానికి అధికారులు ముందస్తుగా పగడ్బందీగా ప్రణాళిక రచించారు. ఈ తనిఖీ ప్రక్రియంతా ఒక సినిమా సన్నివేశాన్ని తలపించేలా, ఎవరికి అనుమానం రాకుండా అధికారులు తీర్చిదిద్దారు. ఆ రాష్ట్రానికి చెందిన రెండు సంస్థల్లో జరిపిన సోదాల్లో ఐటీ అధికారులు రూ.56 కోట్ల విలువైన నగదు, రూ.32 కేజీల బంగారం, రూ.14 కోట్ల విలువైన వజ్రాలు, ఇతర ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని