Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 18 Aug 2022 17:07 IST

1. భాజపా రాష్ట్ర నాయకత్వంపై విజయశాంతి అసంతృప్తి

భాజపా రాష్ట్ర నాయకత్వంపై మాజీ ఎంపీ, ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి అసంతృప్తి వ్యక్తం చేశారు. సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో పాల్గొన్న అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.  రాష్ట్ర నాయకత్వం తనను నిశ్శబ్దంలో ఉంచిందని ఆరోపించారు. తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదో పార్టీ నేతలనే అడగాలని మీడియా ప్రతినిధులకు ఆమె సూచించారు.

2. సోనియా అపాయింట్‌మెంట్‌ కోరిన కోమటిరెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి

తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై అసంతృప్తిగా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి ఆ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ అపాయింట్‌మెంట్‌ కోరారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై సోనియాకు వివరించాలనుకుంటున్నానని.. అందుకే అపాయింట్‌మెంట్‌ కోరినట్లు కోమటిరెడ్డి తెలిపారు. పార్టీలో తనకు జరుగుతున్న అవమానంపై ఆమెను కలవాలని నిర్ణయించినట్లు చెప్పారు. 


Video: జెండావందనంలో డ్యాన్స్‌ చేసిన పోలీసులపై వేటు


3. ప్రైవేటు ఫొరెన్సిక్‌ ల్యాబ్‌ ఎలా ప్రామాణికం?: ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌

హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌.. ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడుతున్నట్లు వైరల్‌ అయిన వీడియో ఇటీవల ఏపీలో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ప్రతిపక్ష తెదేపా సహా ఇతర పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. వైరల్‌ అయిన ఆ వీడియోను అమెరికాలోని ఓ ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని.. అది నకిలీది కాదని తెదేపా నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఐడీ చీఫ్‌ సునీల్‌కుమార్‌ మీడియాతో మాట్లాడారు.

4. జనగామ జిల్లాకు సర్దార్‌ సర్వాయి పాపన్న పేరు పెట్టాలి: కె.లక్ష్మణ్‌

జనగామ జిల్లాకు సర్వాయి పాపన్న పేరు పెట్టాలని.. ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేయాలని భాజపా నేత, రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్‌ డిమాండ్‌ చేశారు. సర్దార్‌ సర్వాయి పాపన్న జయంతిని పురస్కరించుకుని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ జాతి గర్వపడే విధంగా బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిన ఆశాజ్యోతి సర్వాయి పాపన్న అని అన్నారు. నిజాం ఆగడాలపై వీరోచితంగా పోరాటం చేశారని గుర్తుచేశారు.

5. నేతాజీ మరణం.. 77 ఏళ్లుగా మిస్టరీగానే..!

జపాన్‌లోని రెంకోజి ఆలయం (Renkoji Temple)లో ఉన్న సుభాష్‌ చంద్రబోస్‌ (Netaji Subhas Chandra Bose) చితాభస్మానికి డీఎన్‌ఏ పరీక్ష (DNA Test) నిర్వహించేందుకు భారత్‌తోపాటు జపాన్‌ ప్రభుత్వాన్ని త్వరలోనే ఆశ్రయిస్తానని నేతాజీ కుమార్తె అనితా బోస్‌ (Anita Bose) పేర్కొన్నారు. 77ఏళ్లుగా బోస్‌ జీవితంపై నెలకొన్న ఈ మిస్టరీని (Mystery) తేల్చడంతోపాటు అస్థికలను భారత్‌కు తెప్పించడమే ఆయనకు నిజమైన నివాళి అని ఉద్ఘాటించారు.


రివ్యూ: తిరు


6. స్విచ్‌ నుంచి తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్‌.. సింగిల్‌ ఛార్జ్‌తో 250KM

స్విచ్‌ మొబిలిటీ (Switch Mobility) దేశీయంగా తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును ఆవిష్కరించింది. హిందుజా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీ అశోక్‌ లే ల్యాండ్‌ ఎలక్ట్రిక్‌ విభాగానికి చెందిన ఈ కంపెనీ.. EiV 22 పేరిట దీన్ని ముంబయిలో గురువారం లాంచ్‌ చేసింది.  వీటిని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ఆవిష్కరించారు. నగర రవాణాకు అనువుగా ఈ బస్సును తీర్చిదిద్దినట్లు కంపెనీ పేర్కొంది.

7. రహస్యంగా ‘ఆపరేషన్‌ క్రిమియా’

‘క్రిమియా రష్యన్లకు పవిత్ర స్థలం’.. ఈ మాట పుతిన్‌ నోటి నుంచి తరచూ వినిపిస్తుంటుంది. ఇటీవల క్రిమియాలోని రష్యా సైనిక స్థావరంపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి ఎనిమిది పేలుళ్లు జరిపారు. ఈ సమయంలో క్రెమ్లిన్‌ సీనియర్‌ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈ దాడుల వెనుక కీవ్‌ హస్తం ఉన్నట్లు తేలితే వెంటనే అది ‘జడ్జిమెంట్‌ డే’ను ఎదుర్కొంటుందని హెచ్చరించారు. అయినా క్రిమియాలో జరుగుతున్న  పేలుళ్లు మాత్రం ఆగడంలేదు. మంగళవారం కూడా రష్యా మందుగుండు డిపోలో భారీ పేలుళ్లు జరిగాయి.

8. 10 మంది పిల్లల్ని కంటే నజరానా.. రష్యా మహిళలకు పుతిన్‌ ఆఫర్‌

గత కొంతకాలంగా రష్యాలో జనాభా తగ్గుతోంది. దీంతో ఆందోళన చెందిన అధ్యక్షుడు పుతిన్‌ దేశంలో జనాభాను పెంచుకోవడం కోసం సోవియట్‌ కాలంలో అమల్లో ఉన్న ఓ పురస్కారాన్ని మళ్లీ పునరుద్ధరించారు. కుటుంబాలను విస్తరించే దిశగా ప్రజలను ప్రోత్సహించేందుకు గానూ.. 10, అంతకంటే ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళలకు నజరానా ప్రకటించారు. ఈ మేరకు ‘మదర్‌ హీరోయిన్‌’ అవార్డును గత సోమవారం ప్రకటించినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ కథనం వెల్లడించింది.


video:రామోజీ ఫిల్మ్‌సిటీ, ఐఆర్‌సీటీసీ మధ్య పర్యాటక ఒప్పందం


9. విరాట్‌ కోహ్లీ @ 14 ఇయర్స్‌.. అందరూ ఉన్నా ఒంటరిగా ఫీలయ్యా!

భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టి నేటితో సరిగ్గా 14 ఏళ్లు అవుతోంది. 2008 ఆగస్టు 18న దంబుల్లాలో శ్రీలంకతో జరిగిన వన్డేతో కెరీర్‌ని ఆరంభించాడు. అనంతరం టీమ్ఇండియాలో కీలక ఆటగాడి మారి తన పదునైన ఆటతీరుతో ఎన్నో రికార్డులను నమోదు చేశాడు. ధోనీ నుంచి కెప్టెన్సీ పగ్గాలు అందుకుని జట్టుని విజయపథంలో నడిపించాడు. 14 ఏళ్ల కెరీర్‌ పూర్తయిన సందర్భంగా విరాట్ కోహ్లీ ఎమోషనల్ అయ్యాడు.

10. రోజూ ఏదో ఒక కుట్ర: తెదేపాపై కొడాలి నాని ఫైర్‌

మహిళల్ని అడ్డం పెట్టుకొని తెదేపా నేతలు అధికారంలోకి రావాలని చూస్తున్నారని వైకాపా నేత, మాజీ మంత్రి కొడాలి నాని విమర్శించారు. ప్రభుత్వంపై రోజూ ఏదో ఒక కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియోపై అమెరికాలోని ఓ ప్రైవేటు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ ఎలా ప్రామాణికం అవుతుంది.. ఆ నివేదికను తాము గుర్తించబోమంటూ సీఐడీ చీఫ్‌ సునీల్ కుమార్‌ చేసిన ప్రకటన తర్వాత నాని మీడియాతో మాట్లాడారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని