Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 19 Aug 2022 17:05 IST

1. వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. రాగల రెండు రోజులు భారీ వర్షాలు!

తెలంగాణలో రాగల రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తీవ్ర అల్పపీడనం ఇవాళ ఉదయం వాయుగుండంగా బలపడిందని తెలిపింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదిలి ప్రస్తుతం ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతుందని పేర్కొంది. ఇది బాలాసోర్‌కి తూర్పు ఆగ్నేయ దిశగా 250 కి.మీ, సాగర్‌ దీవులకు ఆగ్నేయ దిశగా 150కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది.

2. తెరాసలో ఉంటే మంచోళ్లు.. భాజపాలో చేరితే కేసులా?: ఈటల రాజేందర్‌

భాజపాలో చేరేవారిని కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు అధికారులు ఏకపక్షంగా తెరాసకు సహకరించటం సరికాదన్నారు. 


Video: నిధులు ఇవ్వని సీఎం.. మునుగోడుకి ఎలా వస్తారు: రాజగోపాల్‌ రెడ్డి


3. విలీనంతో ఆశించిన ప్రయోజనాలేవీ?: ఆర్టీసీ సంఘాల ఆక్షేపణ

ఆర్టీసీ ఐకాసలోని 14 సంఘాల నేతలు వర్చువల్‌ సమావేశం నిర్వహించారు. ఎన్‌ఎంయూ, ఈయూ సహా వివిధ సంఘాల నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పీఆర్సీ అమలు సహా ఇబ్బందులు తీర్చాలని ఐక్యవేదిక ఈ సందర్భంగా డిమాండ్‌ చేసింది. ఈ మేరకు సీఎం జగన్‌కు వినతిపత్రాలు పంపాలని ఆర్టీసీ ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగుల సంతకాల సేకరణ అనంతరం... ఈ నెల 21 నుంచి 28 వరకు సీఎంకు వరుసగా వినతిపత్రాలు పంపనున్నారు. 26 జిల్లాల కలెక్టర్ల ద్వారా ఈ వినతిపత్రాలు పంపిస్తారు.

4. IRCTC ₹1000 కోట్ల ప్లాన్‌.. ప్రయాణికుల డేటా మాటేమిటి?

రైల్వే టికెటింగ్‌లో ఏకఛత్రాధిపత్యం కలిగి ఉన్న ఇండియన్‌ రైల్వే కేటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ (IRCTC) కొత్త ప్రణాళికతో ముందుకొచ్చింది. ప్రయాణికుల వివరాలతో కూడిన డిజిటల్‌ డేటాను మానిటైజ్‌ చేయాలని భావిస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటురంగ కంపెనీలతో ఈ మేరకు వ్యాపారం చేయాలని చూస్తోంది. దీని ద్వారా దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం రావచ్చని అంచనావేస్తోంది. ఇందుకోసం ఓ కన్సెల్టెంట్‌ను నియమించుకునేందుకు తాజాగా టెండర్‌ను ఆహ్వానించింది.

5. తండ్రి మరణంతో సైన్యంలో చేరలేకపోయా.. రాజ్‌నాథ్‌ సింగ్‌ భావోద్వేగం

సైన్యంలో చేరి దేశ సేవ చేయాలని తాను చిన్ననాటి నుంచి కలలు కన్నానని, అయితే కుటుంబ పరిస్థితుల కారణంగా చేరలేకపోయానని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అన్నారు. ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌లో పర్యటిస్తోన్న ఆయన.. అక్కడి ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ అస్సాం రైఫిల్స్‌(సౌత్‌) ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అస్సాం రైఫిల్స్‌, రెడ్‌ షీల్డ్‌ డివిజన్‌ బృందాలను ఉద్దేశిస్తూ ప్రసంగించిన ఆయన తన వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు.


Video: ఏప్రిల్‌-జులైలో ₹లక్ష కోట్లకు బంగారం దిగుమతులు


6. అన్ని కోట్ల ఓటీటీ ఆఫర్‌ రిజెక్ట్‌ చేసిన దమ్ము ఎవరిది?.. లైగర్‌ టీమ్‌తో ఛార్మి ఇంటర్వ్యూ

‘‘లైగర్‌’ (Liger)తో నేను ఇండియాను షేక్‌ చేస్తానని చెప్పా. కానీ, అదొక తప్పు స్టేట్‌మెంట్‌. మనందరం (ప్రేక్షకులు) ఇండియాను షేక్‌ చేయాలి. ఆగస్టు 25న సాలిడ్‌ సినిమాను దింపుతున్నాం’’ అన్నారు విజయ్‌ దేవరకొండ. ఆయన కథానాయకుడిగా పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్‌మార్షల్‌ ఆర్ట్స్‌ మూవీ ‘లైగర్‌’. అనన్య పాండే కథానాయిక. ఛార్మి నిర్మించారు. ఈ చిత్ర ప్రచారంలో భాగంగా హీరో విజయ్‌, దర్శకుడు పూరిని ఛార్మి ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేశారు.

7. అమెరికా వీసా కష్టాలు.. అపాయింట్‌మెంట్‌కు 510 రోజులు నిరీక్షించాల్సిందే!

అమెరికా వెళ్లాలనుకునే భారతీయులకు షాకింగ్‌ న్యూస్‌. ఎందుకంటే.. మీకు పర్యాటక వీసా (Visitor Visa) రావాలంటే దాదాపు ఏడాదిన్నరకు పైగా వేచి ఉండాల్సిందే. అవును.. అమెరికా పర్యాటక వీసా అపాయింట్‌మెంట్‌ (Visa Appointment) కోసం దాదాపు 500ల రోజులకు పైగా వెయిటింగ్‌ లిస్ట్‌ ఉంది. దీంతో నాన్‌-ఇమ్మిగ్రెంట్‌ విభాగంలో ఎవరైనా అమెరికా వెళ్లేందుకు ఇప్పుడు దరఖాస్తు చేసుకుంటే వారికి 2024 మార్చి లేదా ఏప్రిల్‌లో వీసా అపాయింట్‌మెంట్‌ లభిస్తుందన్నమాట.

8. అప్పుడు రాహుల్‌కు ఆగ్రహం వచ్చింది.. నాకు ఆశ్చర్యమేసింది: అక్తర్‌

ఎప్పుడైనా సరే భారత్, పాకిస్థాన్‌ మ్యాచ్‌లు రసవత్తరంగా ఉండేవి. అభిమానులు, ఆటగాళ్లు భావోద్వేగానికి గురయ్యేవారు. అయితే  ఎల్లవేళలా ప్రశాంతంగా ఉంటూ తన పనేదో చేసుకుపోయే రాహుల్‌ ద్రవిడ్‌ కూడా ఆగ్రహానికి గురైన సంఘటన 2004 ఛాంపియన్స్‌ ట్రోఫీలో చోటు చేసుకుంది. ఆ సంఘటనను పాకిస్థాన్‌ మాజీ పేసర్‌ షోయబ్‌ అక్తర్ గుర్తుకు తెచ్చుకున్నాడు. ఎందుకంటే ఆ మ్యాచ్‌ జరిగిందే దాయాది దేశాల మధ్య.. అదీనూ ద్రవిడ్ కోపానికి గురైన ఆటగాడు అక్తర్ కావడం విశేషం.


Video: టాలీవుడ్‌ గాడ్‌ఫాదర్.. ఈ వారం ‘వెండితెర వేల్పులు’లో


9. దక్షిణ కొరియాదో చెత్త ఆఫర్‌: కిమ్‌ సోదరి

అణ్వాయుధాలను వదులుకొంటే ఆర్థిక సాయం చేస్తామంటూ ఆఫర్‌ ప్రకటించిన దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అధినేత సోదరి కిమ్‌ యో జోంగ్‌ శుక్రవారం ఘాటుగా స్పందించారు. అసంబద్ధతకు నిలువెత్తు నిదర్శనం దక్షిణకొరియా ఆఫర్‌ అని అభివర్ణించారు. కేవలం తిండి కోసం ఎవరూ వారి లక్ష్యాలను వదలుకోరని పేర్కొన్నారు. దక్షిణకొరియా అధినేత యూన్‌ సుక్‌ యేల్‌ కొంచెం నోరుమూసుకోవాలని హెచ్చరించారు. ఆయనవి అమాయక చర్యలని.. వాటిని పిల్లచేష్టలతో పోల్చారు.

10. బాలి సదస్సుకు జిన్‌పింగ్‌, పుతిన్‌..!

ఇండోనేషియా రాజధాని బాలీలో నవంబర్‌లో జరగనున్న జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని ఇండోనేషియా అధ్యక్షుడు జొకో విడొడొ ప్రకటించారు. ఆయన ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ.. ‘జిన్‌ పింగ్‌ వస్తున్నారు. అధ్యక్షుడు పుతిన్‌ కూడా వస్తున్నారు’ అని చెప్పారు. ఈ ఇద్దరూ జీ-20కి హాజరు కానున్నట్లు చెప్పడానికి తొలి ధ్రువీకరణ ఇదే.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని