Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 21 Jan 2023 17:02 IST

1. సికింద్రాబాద్ అగ్ని ప్రమాద ఘటన.. వ్యక్తి అస్థిపంజరం గుర్తింపు

సికింద్రాబాద్‌లోని నల్లగుట్టలో జరిగిన అగ్నిప్రమాద ఘటనకు సంబంధించి ఒక మృతదేహాన్ని అధికారులు గుర్తించారు. ప్రమాదం జరిగిన రోజు ముగ్గురు సిబ్బంది కనిపించకుండా పోయారు. దుకాణంలో ఉన్న తమ వస్తువులు తెచ్చుకునేందుకు ముగ్గురు వెళ్లారని సహచరులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తాజాగా భవనం మొదటి అంతస్తు వెనుకభాగంలో శిథిలాలు తొలగిస్తున్న క్రమంలో ఒక వ్యక్తి అస్థిపంజరాన్ని గుర్తించినట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నేను ఎవరికీ అనుకూలం కాదు.. ఆ ఆలోచన పక్కన పెట్టండి: ఠాక్రే

‘‘నేను ఎవరికీ అనుకూలం కాదు.. వ్యతిరేకం కాదు. అలాంటి ఆలోచన ఉంటే పక్కనపెట్టండి. అధిష్ఠానం చెప్పింది చేయడమే నా విధి’’ అని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్‌రావు ఠాక్రే పార్టీ నేతలకు స్పష్టం చేశారు. శనివారం గాంధీభవన్‌లో నిర్వహించిన పీసీసీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భారత్‌ జోడో యాత్ర మాదిరిగానే ఈనెల 26 నుంచి రెండు నెలల పాటు చేపట్టనున్న హాథ్‌సే హాథ్‌ జోడో కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకువెళ్లాలని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులొచ్చేశాయ్‌.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి..

దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్‌ (JEE Main 2023)కు సంబంధించి అడ్మిట్‌ కార్డులను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) శనివారం విడుదల చేసింది. తొలుత ఈ నెల 24వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను jeemain.nta.nic.in వెబ్‌సైటులో ఉంచింది. 25వ తేదీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్‌ కార్డులను ఆదివారం విడుదల చేయనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎయిరిండియా స్పెషల్‌ ఆఫర్‌.. దేశీయ విమాన టికెట్లపై డిస్కౌంట్‌

ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా (Air India) విమాన టికెట్ల ధరలపై రాయితీని ప్రకటించింది. రిపబ్లిక్‌ డే సందర్భంగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది. దేశీయ ప్రయాణాలకు లిమిటెడ్‌ సీట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎయిరిండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది. ఎంపిక చేసిన 49 రూట్లలో ముందుగా టికెట్‌ బుక్‌ చేసుకున్న వారికి ప్రాధాన్యం ఉంటుందని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. విప్రోలో ఫ్రెషర్లపై వేటు.. 450 మంది ఇంటికి

ప్రముఖ ఐటీ కంపెనీ విప్రో ఫ్రెషర్లపై వేటు వేసింది. పనితీరు సరిగా కనబరచని 452 మందిని తొలగించింది. శిక్షణ తర్వాత కూడా పనితీరు మెరుగుపరుచుకోవడంలో విఫలమైనందుకు వారిని ఇంటికి పంపించింది. ఫ్రెషర్ల తొలగింపును విప్రో సైతం అధికారికంగా ధ్రువీకరించింది. పనితీరు విషయంలో విప్రో ఉన్నత ప్రమాణాలను పాటిస్తుందని, పని ప్రదేశంలో ఎంట్రీ లెవల్‌ ఉద్యోగులకూ ఈ నియమం వర్తిస్తుందంటూ తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జమ్ములో జంట పేలుళ్లు.. .జోడో యాత్ర నేపథ్యంలో హై అలర్ట్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర జమ్ము కశ్మీర్‌లో కొనసాగుతున్న తరుణంలో.. జమ్ములో జంట పేలుళ్లు చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. నర్వాల్‌ పారిశ్రామిక ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ బాంబు పేలుళ్లలో ఆరుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు. అప్రమత్తమైన బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. ముఖ్యంగా రాహుల్‌గాంధీ జోడో యాత్ర కొనసాగే మార్గాల్లో వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి

వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బిహార్‌లోని కతిహార్‌ జిల్లాలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో రైలు అద్దం పగిలింది. ప్రయాణికులు ఎవరికీ గాయాలు కాలేదు. న్యూ జల్పాయ్‌గురి నుంచి శుక్రవారం సాయంత్రం 3 గంటలకు వందే భారత్‌ రైలు ప్రారంభమైంది. సాయంత్రం 4.25 గంటల సమయంలో బిహార్‌లోని డకోలా- టెల్టా స్టేషన్ల మధ్య గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. భారత్‌ ‘ఎక్స్‌ప్రెస్‌’ స్టేషన్‌ దాటేసింది.. తొందరపడండి: రిషి సునాక్‌కు నేతల సూచన

భారత్‌, బ్రిటన్‌ మధ్య ద్వైపాక్షిక రక్షణ సహకార బంధాన్ని మరింతగా బలోపేతం చేసుకునే దిశగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎప్‌టీఏ)పై చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. ఇవి సరైన దిశలోనే ముందుకెళ్తున్నాయని యూకే సర్కారు చెబుతున్నప్పటికీ.. దీనిపై మరింత వేగంగా చర్యలు తీసుకోవాలని స్థానిక రాజకీయ నేతలు అభిప్రాయపడుతున్నారు. భారత్‌ అత్యంత వేగంగా దూసుకెళ్తోన్న ఆర్థిక వ్యవస్థ అని.. బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ వీలైనంత త్వరగా ఆ దేశానికి వెళ్లాలని సూచిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. నాలుగు ఓవర్లు ఆడినందుకే మీకు ఎక్కువ డబ్బులా..? : వసీం అక్రమ్‌

పాకిస్థాన్‌ క్రికెట్‌పై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ ఓడిపోవడం.. అంతకుముందు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవమానకరరీతిలో వైట్‌వాష్‌ కావడంతో బాబర్‌ అజామ్‌ నేతృత్వంలోని జట్టు ఆటతీరుపై పలువురు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్‌ వసీం అక్రమ్‌ యువ పేసర్ల ఆటతీరును తప్పుబట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. చంద్రుడిపై నడిచిన ఆల్డ్రిన్‌.. 93వ పుట్టినరోజున మళ్లీ వివాహం

చంద్రుడిపై కాలుమోపిన ముగ్గురు అమెరికా వ్యోమగాముల్లో ఒకరైన బజ్‌ ఆల్డ్రిన్.. 93 ఏళ్ల వయసులో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన చిరకాల ప్రేయసి డా. ఆంకా ఫార్‌ను పుట్టినరోజు నాడే వివాహం చేసుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడిస్తూ.. ఫొటోలు షేర్‌ చేశారు. జనవరి 20న లాస్‌ ఏంజిల్స్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిరాడంబరంగా తమ వివాహం జరిగిందని ఆల్డ్రిన్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని