Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in eenadu.net: ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 27 Mar 2023 17:13 IST

1. తెలంగాణపై కేంద్రం పగబట్టినట్లు ప్రవర్తిస్తోంది: మంత్రి కేటీఆర్‌

దేశంలోనే తెలంగాణ గ్రామాలు అభివృద్ధికి చిరునామాగా మారాయని ఐటీ, పురపాలక శాక మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరిసిల్ల జిల్లా వరుసగా మూడు సార్లు  స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ఉత్తమ జిల్లా పరిషత్‌గా నిలవడం గొప్ప విషయమని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ గ్రామ పంచాయతీలు సాధించిన ప్రగతి.. ముస్సోరి ఐఏఎస్‌ అకాడమీలో పాఠ్యాంశాలుగా బోధిస్తుడడం రాష్ట్రానికే గర్వకారణమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. పోలవరం ఎత్తుపై కేంద్రం భిన్న ప్రకటనలు!

పోలవరం ప్రాజెక్టు(Polavaram project) ఎత్తు అంశంపై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌ వేదికగా వేర్వేరు ప్రకటనలు చేసింది. 1980 గోదావరి ట్రైబ్యునల్‌ అవార్డు ప్రకారం.. పోలవరం పూర్తి నీటినిల్వ సామర్థ్యం ఎత్తు 45.72 మీటర్లుగా పేర్కొంది. నీటినిల్వ సామర్థ్యం 41.15 మీటర్లకి తగ్గించాలంటూ ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించినట్లు తమ వద్ద సమాచారం లేదని తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర జలశక్తి సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. నడిచి వచ్చే భక్తులకు దివ్యదర్శన టోకెన్లు.. తితిదే ఛైర్మన్‌

ఏప్రిల్‌ 1 నుంచి నడిచి వచ్చే భక్తులకు దివ్య దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్టు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. అలిపిరి నడక దారిలో రోజుకు 10వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. సోమవారం తిరుమలలో వేసవి ఏర్పాట్లపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి మెట్టు నడకదారిలో రోజుకు 5వేల టోకెన్లు జారీ చేయనున్నట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై సుప్రీంలో విచారణ.. 3 వారాలకు వాయిదా

మద్యం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) తనకు సమన్లు జారీ చేయడాన్ని సవాల్‌ చేస్తూ భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. గతంలో దాఖలు చేసిన నళినీ చిదంబరం పిటిషన్‌కు ఈ కేసును ట్యాగ్‌ చేసిన సర్వోన్నత న్యాయస్థానం.. కేసు విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.  మహిళలను ఈడీ ఆఫీస్‌కు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ పిటిషన్‌ దాఖలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. వివేకా హత్య కేసు ఇంకా ఎంత కాలం విచారిస్తారు?: సీబీఐని ప్రశ్నించిన సుప్రీం

వివేకా హత్యకేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కేసును ఇంకా ఎంత కాలం విచారిస్తారని సీబీఐపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. హత్యకు గల ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ధర్మాసనం పేర్కొంది. ‘విచారణాధికారిని మార్చండి లేదా ఇంకో అధికారిని నియమించండ’ని ఘాటు వ్యాఖ్యలు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. గ్యాంగ్‌స్టర్‌ తరలింపులో ఉత్కంఠ.. ఆవును ఢీకొన్న కాన్వాయ్‌..! 

వందకుపైగా క్రిమినల్‌ కేసుల్లో నిందితుడిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ మాజీ ఎంపీ అతీక్‌ అహ్మద్‌ను (Atiq Ahmed) గుజరాత్‌లోని సబర్మతి కేంద్ర కారాగారం నుంచి ఉత్తర్‌ప్రదేశ్‌లోని (UP) ప్రయాగ్‌రాజ్‌కు యూపీ పోలీసులు తరలిస్తున్నారు. ఇదే సమయంలో తనకు ప్రాణహాని ఉందని.. పోలీసులు ఫేక్‌ ఎన్‌కౌంటర్‌లో చంపేస్తారని భయపడుతూ జైలు నుంచి బయటకు వచ్చేందుకు నిందితుడు అతీక్‌ (Atiq Ahmed) నిరాకరించిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. అప్పుడు భయంతో హెచ్‌ఐవీ టెస్టు చేయించుకున్నా: ధావన్‌

టీమ్ఇండియా క్రికెటర్‌ శిఖర్‌ ధావన్‌ (Shikhar Dhawan) మైదానంలోనే కాకుండా సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటాడు. అలాగే ఫ్యాషన్‌కు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తాడు. శరీరంపై రకరకాల టాటూలు (tattoos) వేయించుకుంటాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అతడు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాలను పంచుకున్నాడు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. ఆయన్ను అవమానిస్తే ఊరుకోం.. రాహుల్‌కు ఉద్ధవ్‌ ఠాక్రే వార్నింగ్..!

‘నా పేరు సావర్కర్ కాదు.. నేను క్షమాపణ చెప్పను’ అంటూ  కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర( Maharashtra) మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ఠాక్రే(Uddhav Thackeray) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా అనర్హత వేటు పడిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం.. రంగంలోకి ‘అణు’ తూటాలు..!

రష్యా (Russia) - ఉక్రెయిన్‌ ( Ukraine) యుద్ధం ప్రపంచానికి ముచ్చెమటలు పోయిస్తోంది. రేడియో ధార్మిక ఆయుధాల వినియోగానికి ఇరుపక్షాలు సిద్ధమైపోయాయి. ఓ పక్క రష్యా ఇసికందర్‌ అణు క్షిపణులను బెలారస్‌ తరలించగా.. మరోవైపు బ్రిటన్‌ డిప్లిటెడ్‌ యూరేనియంతో చేసిన తూటాలను ఉక్రెయిన్‌కు సరఫరా చేసేందుకు సిద్ధమైపోయింది. దీనిపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ నిప్పులు చెరిగారు. ఉక్రెయిన్‌కు అణు పరికరాలను అందిస్తున్నారని ఆరోపించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. ఇమ్రాన్‌ను సాగనంపాలి.. లేకపోతే మేం పోవాలి: పాక్‌ మంత్రి సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌(Pakistan)మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌(Imran Khan)ను ఉద్దేశించి ఆ దేశ మంత్రి రాణా సనావుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇమ్రాన్‌ అధికార పార్టీకి శత్రువుగా మారారన్నారు. ఆయనైనా లేక తామైనా రాజకీయ రంగానికి దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ‘ఇమ్రాన్‌ ఖాన్‌ను అయినా రాజకీయాలకు దూరం చేయాలి. లేదా మేమైనా దూరం కావాలి’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు