Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 28 Sep 2023 17:05 IST

1. TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై టీఎస్‌పీఎస్సీ వివరణ

జూన్‌ 11న జరిగిన గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. 258 పేపర్లు అదనంగా వచ్చాయన్న ఆరోపణలపై వివరణఇస్తూ గురువారం ప్రకటన జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. MS Swaminathan: దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది: కేసీఆర్‌

భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ (MS Swaminathan) మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు సంతాపం తెలిపారు. దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ వ్యవసాయ రంగంలో స్వామినాథన్‌ వినూత్న పద్ధతులు చేర్చారని కొనియాడారు. ఆయన కృషి వల్లే ఆహార ఉత్పత్తిలో భారత్‌ స్వయం సమృద్ధి సాధించిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Pattabhi: ఇన్నర్ రింగ్‌రోడ్డుపై వాస్తవాలివిగో.. పట్టాభిరాం పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌

హెరిటేజ్ సంస్థ ముందస్తుగానే ఊహించి.. ఇన్నర్ రింగురోడ్డు ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిందంటూ వైకాపా నాయకులు చేస్తున్న ఆరోపణల్ని తెలుగుదేశం పార్టీ తిప్పికొట్టింది. హెరిటేజ్ సంస్థ 2014 మార్చిలోనే కంతేరు ప్రాంతంలో భూముల కొనుగోలుకు తీర్మానం చేసిందని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం (PattabhiRam) తెలిపారు. ఈ మేరకు ఇన్నర్ రింగురోడ్డుకు సంబంధించిన అంశాలను పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

4. Yuvagalam: నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర వాయిదా

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర పునఃప్రారంభ తేదీ వాయిదా పడింది. చంద్రబాబు అరెస్టు, అనంతర పరిణామాల నేపథ్యంలో ఈనెల 9న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలో పాదయాత్ర నిలిపివేసిన విషయం తెలిసిందే. అక్టోబర్ 3న స్కిల్ డెవలప్‌మెంట్ కేసుకి సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు ఉన్నందున యువగళం పాదయాత్ర పున:ప్రారంభ తేదీని వాయిదా వేసుకోవాలని పార్టీ ముఖ్య నేతలు లోకేశ్‌ని కోరారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం జగన్‌కు ఓటేసి తప్పు చేశాం: మోకాళ్లపై కూర్చుని ఉద్యోగుల నిరసన

జీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీసీపీఎస్‌ఈఏ ఆధ్వర్యంలో ఉద్యోగులు విజయనగరం కలెక్టరేట్ వద్ద జీపీఎస్‌ బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. సీఎం జగన్‌కు ఓటేసి తప్పు చేశామంటూడ ఉద్యోగులు మోకాళ్లపై కూర్చుని చెప్పులతో చెంపలను కొట్టుకున్నారు. ఓపీఎస్ విధానాన్ని తీసుకొస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్ ఉద్యోగులను మోసం చేశారని విమర్శించారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

6. TDP: సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై చర్యలు తీసుకోండి: అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌ ఫిర్యాదు

ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఫిర్యాదు చేశారు. సర్వీస్‌ రూల్స్‌ను అతిక్రమించి వైకాపాకు తొత్తుగా సీఐడీ చీఫ్‌ పనిచేస్తున్నారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఎంపీ లేఖ రాశారు. సంజయ్‌పై చర్యలు తీసుకోవాలంటూ సంబంధిత ఆధారాలను జతచేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 2000 Note: 2000 నోట్ల మార్పిడికి ముగుస్తున్న డెడ్‌లైన్‌.. తర్వాత ఏంటి?

రెండు వేల రూపాయల నోట్ల మార్పిడికి (2000 Note exchange) ఆర్‌బీఐ (RBI) ఇచ్చిన గడువు దగ్గర పడింది. సెప్టెంబర్‌ 30తో గడువు తీరబోతోంది. ఒకవేళ ఇప్పటికీ మీ దగ్గర రూ.2 వేల నోట్లు ఉంటే.. మార్చుకోవడానికి ఇంకా మూడు రోజులే గడువు ఉంది. అయితే, డెడ్‌లైన్‌ తర్వాత రూ.2 వేల నోట్ల పరిస్థితి ఏంటి? ఆర్‌బీఐ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది? ఆసక్తిగా మారింది. దీనిపై ఇప్పటి వరకు ఆర్‌బీఐ నుంచి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. USA: అమెరికా పిల్లలకి ‘లెక్కలు’ రావడం లేదట..!

అగ్రరాజ్యం అమెరికాను మ్యాథ్స్‌ (Mathematics) సబ్జెక్ట్‌ కలవరపెడుతోంది. అవును.. మీరు చదివింది నిజమే. అమెరికాలో గణితంలో నిష్ణాతులైన ఉద్యోగుల కొరత ఉందని పలు కంపెనీలు, యూనివర్శిటీలు తమ నివేదికల్లో పేర్కొన్నాయి. రాబోయే రోజుల్లో ఇదే తీరు కొనసాగితే.. అమెరికా జాతీయ భద్రతకు ముప్పుగా పరిణమించడంతోపాటు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీపడలేదని కంపెనీల యాజమాన్యాలు, విద్యారంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Kota: కోటాలో ఆగని ఆత్మహత్యలు.. 26కు చేరిన విద్యార్థుల మరణాలు

రాజస్థాన్‌(Rajasthan)లోని కోటా(Kota)లో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు (Kota Suicides) కలవరపెడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నామని చెప్తున్నప్పటికీ.. తాజాగా మరో మరణం వెలుగుచూసింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యార్థి బుధవారం ఆత్మహత్య  చేసుకున్నట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Asian Games 2023: ఈక్వెస్ట్రియన్‌లో మరో పతకం.. చరిత్ర సృష్టించిన అనుష్‌

ఆసియా క్రీడల్లో ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. వ్యక్తిగత డ్రెస్సేజ్‌ విభాగంలో అనుష్  గార్వాలా కాంస్య పతకంతో చరిత్ర సృష్టించాడు. ఆసియా క్రీడల్లో వ్యక్తిగత డ్రస్సేజ్ ఈవెంట్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం. ఈక్వెస్ట్రియన్‌లో ఇప్పటికే  భారత్‌ బంగారు పతకం సాధించిన సంగతి తెలిసిందే. సుదీప్తి హజెలా, హృదయ్ విపుల్, అనూష్ గార్వాలా, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత బృందం ఈక్వస్ట్రియన్‌లో డ్రస్సేజ్ ఈవెంట్‌లో గెలిచి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని