Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 30 Jun 2022 17:11 IST

1. మహారాష్ట్ర సీఎంగా ఏక్‌నాథ్‌ శిందే

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు మాజీ సీఎం, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ప్రకటించారు. ఈ మధ్యాహ్నం ఫడణవీస్‌, శిందే కలిసి గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీని కలిశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన మెజార్టీ తమకు ఉందని, అందుకు అవకాశం ఇవ్వాలని కోరారు.

2. అన్న రాజీనామా.. రాజ్‌ ఠాక్రే కీలక ట్వీట్‌

మహారాష్ట్ర రాజకీయ పరిణామాలపై ఉద్ధవ్‌ ఠాక్రే సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ్‌ సేన(MNS) అధినేత రాజ్‌ ఠాక్రే(Raj Thackeray) తాజాగా స్పందించారు! ‘ఒక వ్యక్తి తన అదృష్టాన్ని సొంత విజయంగా భావించిన నాటినుంచే.. అతని పతనం మొదలవుతుంది’ అని గురువారం ఆయన ఓ ట్వీట్‌ చేశారు. అయితే, సీఎం పదవికి రాజీనామా చేసిన ఉద్ధవ్‌ను ఉద్దేశించే ఈ వ్యాఖ్య చేసినట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

3. బల్మూరి వెంకట్‌ను పరామర్శించిన రేవంత్‌రెడ్డి

పోలీసులు అరెస్ట్‌ చేస్తున్న క్రమంలో జరిగిన తోపులాటలో గాయపడిన ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌ను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పరామర్శించారు. సోమాజీగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లిన రేవంత్‌.. వెంకట్‌ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. విద్యార్థుల ప్రయోజనాల కోసం పోరాడుతున్న బల్మూరి వెంకట్‌పై పోలీసులు దాడి చేశారని రేవంత్‌ ఆరోపించారు. 

4. ప్రపంచంలోని టాప్‌ 5 కంపెనీలకు హైదరాబాదే రెండో కేంద్రం: కేటీఆర్‌

ప్రపంచంలోని టాప్‌ 5 ఐటీ కంపెనీలు తమ రెండవ అతిపెద్ద కేంద్రాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.  ప్రపంచ దిగ్గజ ఐటీ, ఫైనాన్స్‌ కంపెనీలు తమ సంస్థలను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయన్నారు. నివాసానికి అత్యంత అనువైన ప్రాంతంగా హైదరాబాద్‌ నిలుస్తోందన్నారు. హెచ్‌ఐసీసీలో నాస్కామ్‌ 12వ ఎడిషన్‌ జీసీసీ కాంక్లేవ్‌లో కేటీఆర్‌ పాల్గొన్నారు.

5. డబ్బులు ఏమయ్యాయంటే?..పిట్ట కథలు చెబుతున్నారు: సూర్యనారాయణ

జీపీఎఫ్‌ ఖాతాల్లో డబ్బుల మాయంపై ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్‌ రావులు గురువారం సచివాలయంలో సీఎస్‌ సమీర్‌ శర్మను కలిశారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము డెబిట్ కావడంపై ప్రభుత్వ వివరణ కోరారు. సాంకేతిక కారణాలతోనే నగదు డెబిట్ అయినట్లు అధికారులు చెబుతున్నారని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. అధికారులు చెబుతున్న సమాధానంపై తాము సంతృప్తి చెందలేదని సీఎస్‌కు వివరించామని పేర్కొన్నారు. 

6. ప్రారంభమైన ఆషాఢ బోనాలు.. ముస్తాబవుతోన్న గోల్కొండ కోట

తెలంగాణకే ప్రత్యేకమైన బోనాల ఉత్సవానికి గోల్కొండ ముస్తాబవుతోంది. ఆషాఢమాసం బోనాలు చారిత్రక కోట నుంచి ప్రారంభమయ్యాయి. భాగ్యనగరంలో నెల రోజుల పాటు జరగనున్న బోనాల జాతరను అంగరంగవైభవంగా నిర్వహించనున్నారు. రెండేళ్లుగా కరోనా కారణంగా కాస్త సందడి తగ్గినా ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

7. మదుపర్ల అప్రమత్తత.. మార్కెట్ల ఊగిసలాట

దేశీయ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడుదొడుకుల మధ్య సాగాయి. అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాలకు తోడు జూన్‌ డెరివేటివ్‌ కాంట్రాక్టుల గడువు నేటితో ముగిసిన నేపథ్యంలో మదుపర్లు అప్రమత్తత పాటించారు. దీంతో ఆద్యంతం లాభ నష్టాల్లో ఊగిసలాడిన సూచీలు చివరకు స్తబ్దుగా ముగిశాయి. సెన్సెక్స్‌ స్వల్పంగా 8 పాయింట్లు నష్టపోగా.. నిఫ్టీ 19 పాయింట్లు తగ్గింది.

8. మణిపుర్‌లో విషాదం.. కొండ చరియలు విరిగిపడి ఏడుగురు మృతి

మణిపుర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అక్కడ నోనీ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో రైలుమార్గ నిర్మాణ పనుల్లో ఉన్న అనేకమంది గల్లంతయ్యారు.  ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు తెలిపారు. ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు భావిస్తున్నారు.

9. కేరళలో ఆంత్రాక్స్‌ కలకలం.. మృత్యువాతపడుతున్న అడవి పందులు!

కేరళను వరుస అంటువ్యాధులు వెంటాడుతూనే ఉన్నాయి. ఇప్పటికే ప్రమాదకర వైరస్‌ల వ్యాప్తితో వణుకుతున్న కేరళలో తాజాగా ఆంత్రాక్స్‌ (Anthrax) కేసులు వెలుగు చూడడం కలవరం రేపింది. అత్తిరప్పిళ్లి అటవీ ప్రాంతంలో ఆంత్రాక్స్‌ కారణంగా అడవి పందులు మృత్యువాత పడుతున్నట్లు గుర్తించారు. అయితే, వీటిని పరిశీలించిన అధికారులు ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.

10. మహమ్మారి మార్పు చెందుతోంది.. ముగిసిపోలేదు..!

‘కరోనా మహమ్మారి మార్పు చెందుతోంది. కానీ ముగిసిపోలేదు. కొత్త కేసులు రిపోర్టింగ్‌, జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రక్రియలు తగ్గిపోవడంతో.. వైరస్‌ను ట్రాక్‌ చేయగల సామర్థ్యం ప్రమాదంలో ఉంది. దాంతో ఒమిక్రాన్‌ను గుర్తించడం, భవిష్యత్తు వేరియంట్ల గురించి విశ్లేషించడం కష్టంగా మారుతోంది. బీఏ.4, బీఏ.5 సబ్‌ వేరియంట్ల కారణంగా 110 దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి’ అని డబ్ల్యూహెచ్‌ఓ అధిపతి టెడ్రోస్ అధనామ్ వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని