Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 30 Nov 2022 21:12 IST

1. మెట్రో రైలు రెండో దశతో ప్రజా రవాణా మరింత బలోపేతం: మంత్రి కేటీఆర్‌

మెట్రో రైల్‌ రెండో దశ విస్తరణకు డిసెంబరు 9న సీఎం కేసీఆర్‌ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆ కార్యక్రమం సన్నాహక సమావేశాన్ని మంత్రి కేటీఆర్‌ నిర్వహించారు. మంత్రులు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మహమూద్‌ అలీ, సబితా ఇంద్రారెడ్డి, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మెట్రో రైల్‌, పురపాలక, ఎయిర్‌పోర్టు అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అమిత్‌ అరోరా రిమాండ్‌ రిపోర్టులో ఎమ్మెల్సీ కవిత పేరు

దిల్లీ మద్యం కుంభకోణం కేసులో మంగళవారం రాత్రి అరెస్టు చేసిన అమిత్‌ అరోరాను దిల్లీలోని రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఈడీ అధికారులు హాజరుపర్చారు. ఈ సందర్భంగా దిల్లీ లిక్కర్‌ స్కామ్‌ రిమాండ్‌ రిపోర్టులో ఈడీ అధికారులు తెరాస ఎమ్మెల్సీ కవిత పేరును ప్రస్తావించారు. సౌత్‌ గ్రూప్‌ను శరత్‌రెడ్డి, కవిత, ఎంపీ మాగుంట నియంత్రించారని ఈడీ పేర్కొంది. సౌత్‌గ్రూప్‌ ద్వారా రూ.100 కోట్లు విజయ్‌ నాయర్‌కు చేరాయని తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. కేంద్రం నిధులు ఆపటంపై బండి సంజయ్‌ సమాధానం చెప్పాలి: మంత్రి హరీశ్‌రావు

సీఎం కేసీఆర్ అడగ్గానే కొత్త మండలాలు ఏర్పాటు చేశారని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి, అక్బర్‌పేట్‌లో ఇవాళ పర్యటించిన మంత్రి.. కొత్త మండలాల్లో ఏర్పాటు చేసిన తహశీల్దార్‌ కార్యాలయాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదీ ఫొటోలు పెట్టట్లేదని భాజపా నేతలు గొడవలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఎమ్మెల్యేలకు ఎర కేసు.. సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయం: న్యాయవాది దవే

ఎమ్మెల్యేలకు ఎర కేసులో సిట్‌ దర్యాప్తు పారదర్శకంగా కొనసాగుతోందని, ఈ కేసును సీబీఐకి అప్పగిస్తే వీగిపోవడం ఖాయమని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది దుష్యంత్‌ దవే హైకోర్టులో వాదించారు. దేశవ్యాప్తంగా సీబీఐ దర్యాప్తు చేసిన కొన్ని కేసులు వీగిపోయిన ఉదాహరణలను ఈ సందర్భంగా ఆయన ఉటంకించారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని భాజపాతో పాటు నిందితులు దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో 4గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. మోదీ-షా ఖిల్లాలో తొలి ఫైట్‌ రేపే.. గుజరాత్‌ ఓటరు గురి ఎటువైపో?

దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గుజరాత్‌ ఎన్నికల(Gujarat Election)కు వేళైంది. తొలి విడత ఎన్నికలకు రాజకీయ పార్టీల ప్రచార హోరు నిన్నటితో ముగియడంతో డిసెంబర్‌ 1న పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. మోదీ-షా ఖిల్లా అయిన గుజరాత్‌లో వరుసగా ఏడోసారి కాషాయ జెండాను ఎగురవేయాలని భాజపా సర్వశక్తుల్ని ధారపోయగా.. ఈసారి కమలం కంచుకోటను బద్దలుకొట్టి పునర్‌ వైభవం చాటుకోవాలన్న కసితో కాంగ్రెస్‌ శ్రేణులు అహర్నిశలూ శ్రమించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కార్టూన్‌లా ఆడుతున్నాడన్నాడు.. అతడికి బౌన్సర్లతో సమాధానమిచ్చా: షోయబ్‌ అక్తర్‌

ఇంగ్లాండ్‌, పాకిస్థాన్‌ మధ్య మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ గురువారం రావల్పిండి వేదికగా ప్రారంభం కానుంది. చివరి సారిగా 2005లో టెస్టుల్లో తలపడిన ఈ దేశాలు పదిహేడేళ్ల విరామం తర్వాత మరోసారి ఢీకొనబోతున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌ పేస్‌ దిగ్గజం షోయబ్‌ అక్తర్‌ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకొన్నాడు. నాటి సిరీస్‌లో 17 వికెట్లు తీసి అదరగొట్టిన ఈ మాజీ ఆటగాడు అద్భుతమైన ప్రదర్శన చేసిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. డిసెంబరు 29 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం!

ఆస్ట్రేలియా, భారత్‌ మధ్య కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం డిసెంబరు 29 నుంచి అమల్లోకి రానుంది. దీంతో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెండింతలై 45-50 బిలియన్‌ డాలర్లకు చేరనుంది. ఈ ఒప్పందాన్ని అమలు చేసేందుకు దేశీయంగా చేపట్టాల్సిన ప్రక్రియ పూర్తయిందని భారత ప్రభుత్వం తమకు తెలియజేసినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. 62,000 ట్విటర్‌ ఖాతాల పునరుద్ధరణకు మస్క్‌ శ్రీకారం!

గతంలో నిషేధించిన ట్విటర్‌ ఖాతాల పునరుద్ధరణకు మస్క్‌ శ్రీకారం చుట్టారు. దాదాపు 62 వేల ఖాతాలను ఆయన తిరిగి క్రియాశీలకంగా మార్చనున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. అయితే, కనీసం 10 వేల ఫాలోయర్లు ఉన్న ఖాతాలను మాత్రమే పునరుద్ధరిస్తున్నారని సమాచారం. వీటిలో ఒక ఖాతాకు 5 మిలియన్ల మంది ఫాలోయర్లు ఉన్నారని తెలుస్తోంది. అలాగే 75 శాతం ఖాతాలకు 1 మిలియన్‌ కంటే ఎక్కువ ఫాలోయర్లు ఉన్నారట. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గనున్న ఆ రైలు టికెట్‌ ధరలు..!

దేశంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతో పాటు భారతీయ సంస్కృతిని చాటిచెప్పేందుకు రైల్వే శాఖ ప్రత్యేకంగా ‘భారత్‌ గౌరవ్‌ (Bharat Gaurav)’ పేరుతో పర్యాటక రైళ్లను తీసుకొచ్చింది. అయితే ఈ రైళ్లకు ఆశించిన స్థాయిలో డిమాండ్‌ లభించలేదు. దీంతో ఐఆర్‌సీటీసీ (IRCTC) కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రైళ్ల టికెట్ల ధరను దాదాపు 30శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఉబర్‌లో ప్రయాణిస్తుంటారా? కొత్తగా వచ్చిన ఫీచర్లివే..

ప్రముఖ క్యాబ్‌ సేవల సంస్థ ఉబర్‌ (UBER) తన సేవలను మెరుగు పరుచుకోవడంలో భాగంగా భారత్‌లో కొన్ని కొత్త ఫీచర్లను తీసుకొచ్చింది. ప్రయాణికుల భద్రతకు పెద్దపీట వేస్తూ వీటిని తీసుకొచ్చినట్లు ఆ కంపెనీ తెలిపింది. వెనుకవైపు కూర్చునేవారు సీటు బెల్టు ధరించాలని చెప్పడం, అత్యవసర కస్టమర్‌కేర్‌ సదుపాయం వంటివి ఇందులో ఉన్నాయి. తరచూ క్యాబుల్లో ప్రయాణించేవారు ఈ విషయాలు తెలుసుకోవడం మంచిది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు