Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

Top Ten News in Eenadu.net: ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 31 Mar 2023 17:06 IST

1. అంతిమంగా గెలిచేది.. నిలిచేది అమరావతే: చంద్రబాబు

రాజధాని ప్రాంత రైతుల ఉద్యమంలో న్యాయముందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. ధర్మం వారివైపే ఉందని.. అమరావతే గెలుస్తుందని చెప్పారు. రాజధాని రైతుల ఉద్యమం 1200 రోజులకు చేరిన సందర్భంగా ఆయన ట్వీట్‌ చేశారు. రైతుల పోరాట స్ఫూర్తిని చంద్రబాబు అభినందించారు. అమరావతి ఉద్యమం వైకాపా ప్రభుత్వ ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి ముందుకు సాగుతోందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. హైదరాబాద్‌ మెట్రో.. రద్దీ వేళల్లో రాయితీ రద్దు

నగరవాసులకు హైదరాబాద్‌ మెట్రో రాయితీల్లో కోత విధించనుంది. ఏప్రిల్ 1 నుంచి మెట్రో రాయితీల్లో కోత విధించనున్నట్లు మెట్రో అధికారులు వెల్లడించారు. రద్దీ వేళల్లో డిస్కౌంట్‌ను పూర్తిగా ఎత్తివేయనున్నట్లు తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకూ... రాత్రి 8 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకూ మాత్రమే రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3.  తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌లో మార్పులు.. పరీక్ష తేదీలివే!
తెలంగాణ ఎంసెట్‌ పరీక్ష షెడ్యూల్‌లో మార్పులు జరిగాయి. మే 7 నుంచి 11 వరకు జరగాల్సిన ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెల్లడించింది. ఇంజినీరింగ్‌ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. నీట్‌, టీఎస్‌పీఎస్సీ నిర్వహించే పరీక్షలను దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్‌లో మార్పులు చేసినట్టు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ‘వైకాపాతో జరుగుతున్న యుద్ధంలో అంతిమ విజయం అమరావతిదే’

వైకాపా ప్రభుత్వంతో చేస్తున్న యుద్ధంలో అంతిమ విజయం అమరావతిదేనని అమరావతి పరిరక్షణ సమితి నేతలు చెప్పారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ ఆ ప్రాంత రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం నేటికి 1200 రోజులకు చేరుకుంది. ఈ సందర్భంగా ఐకాస ఆధ్వర్యంలో రాజధాని పరిధిలోని మందడంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పేపర్‌ లీకేజీ కేసు.. నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్నపత్రాలు

సంచలనం సృష్టిస్తున్న టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా నిందితుల పెన్‌డ్రైవ్‌లో 15 ప్రశ్న పత్రాలను సిట్‌ గుర్తించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్‌ - ఏఈఈ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ - డీఏవో జనరల్ స్టడీస్, మ్యాథ్స్ - ఏఈ జనరల్ స్టడీస్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ పేపర్లు - ఏఈ సివిల్, ఎలక్ట్రికల్ పేపర్ 2  - టౌన్ ప్లానింగ్ - జులైలో జరగాల్సిన జేఎల్‌ ప్రశ్నపత్రాలు నిందితుల పెన్‌డ్రైవ్‌లో లభ్యమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆ కల తీరిపోయింది.. ఇక అదే మా లక్ష్యం: హార్దిక్‌ పాండ్య

అత్యంత ప్రజాదరణ పొందిన లీగుల్లో ఐపీఎల్ (IPL 2023) ముందుంటుంది. ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్‌ సిద్ధమవుతోంది. గతేడాది ఛాంపియన్‌ గుజరాత్ టైటాన్స్,  చెన్నై సూపర్ కింగ్స్‌ (GT vs CSK) జట్ల మధ్య మొదటి మ్యాచ్‌తో మెగా టోర్నీ ప్రారంభం కానుంది. కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) నాయకత్వంలోని గుజరాత్‌ మరోసారి అత్యుత్తమ ప్రదర్శనతో రాణించాలని ఆశిస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌కు కొత్త విదేశీ వాణిజ్య విధానం.. 2లక్షల కోట్ల డాలర్ల ఎగుమతులే లక్ష్యం

భారత ఎగుమతుల్ని 2030 నాటికి రెండు ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త ‘విదేశీ వాణిజ్య విధానాన్ని (FTP 2023)’ ప్రవేశపెట్టింది. దీన్ని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం ఆవిష్కరించారు. 2023 ఏప్రిల్‌ 1 నుంచి ఈ నూతన విధానం అమల్లోకి రానుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మోదీ ‘డిగ్రీ’ని చూపించాల్సిన అవసరం లేదు.. కేజ్రీవాల్‌కు జరిమానా

ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) విద్యార్హతల వ్యవహారంలో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు (Arvind Kejriwal) భంగపాటు ఎదురైంది. ఈ అంశంపై గుజరాత్‌ హైకోర్టు (Gujarat High Court) శుక్రవారం కీలక తీర్పు వెలువరించింది. ప్రధాని డిగ్రీ, పీజీ పత్రాలను పీఎంవో చూపించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. కిమ్‌ రాజ్యంలో దారుణాలు.. గర్భిణులు, స్వలింగ సంపర్కులకు ఉరిశిక్షలు

ఉత్తరకొరియా(North Korea)లో చిన్నచిన్న నేరాలకే కఠినమైన శిక్షలు విధిస్తారనే విషయం అందరికీ తెలిసిందే. ఆ శిక్షలు ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.  తాజాగా దీనిపై పొరుగు దేశం దక్షిణ కొరియా (South Korea) సంచలన ఆరోపణలు చేసింది. కిమ్‌ ఆగడాలు మితిమీరుతున్నాయని ఆరోపించింది. చిన్నారులను, గర్భిణులను ఉరితీస్తూ ఆ దేశం మానవ హక్కులను ఉల్లంఘిస్తోందని ఆరోపించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పోర్న్‌ స్టార్‌ కేసులో అభియోగాలు.. ట్రంప్‌ భవితవ్యమేంటి?

అగ్రరాజ్య రాజకీయ చరిత్రలో సంచలనం. పోర్న్‌ స్టార్‌తో అనైతిక ఒప్పందం కేసులో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump)పై నేరపూరిత అభియోగాలు నమోదయ్యాయి. ఈ మేరకు ఆయనపై నేరారోపణలను న్యూయార్క్‌లోని మాన్‌హట్టన్‌ గ్రాండ్‌ జ్యూరీ ధ్రువీకరించింది. దీంతో ఇప్పుడు ఆయన క్రిమినల్‌ విచారణను ఎదుర్కోనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని