Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 04 Dec 2021 16:55 IST

1.తెలిసో.. తెలియకో ఓట్లేస్తే ప్రాణాలు బలిగొంటారా?: చంద్రబాబు

రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదల సమయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. వరదల విషయంలో ఏం చేయాలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవస్థ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

2.ధాన్యం కొనుగోలుపై కేసీఆర్‌ కీలక సమీక్ష

ధాన్యం కొనుగోళ్ల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రగతిభవన్‌లో మంత్రులు, ఎంపీలు, పలువురు ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ధాన్యం కొనుగోలు అంశంపై పార్లమెంట్‌ ఉభయ సభల్లో తెరాస ఎంపీలు గళమెత్తుతున్న వేళ నిన్న కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ కూడా ఇదే అంశంపై వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. 

3.సీఎం జగన్‌కు ఆ నైతిక హక్కులేదు: సోము వీర్రాజు

ఏపీలో మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామనే నైతిక హక్కు సీఎం జగన్‌కు లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. విజయవాడలో జరుగుతున్న భాజపా రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీ సర్కార్‌ తీరుపై మండిపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణం విషయంలో భాజపాకే చిత్తశుద్ధి ఉందన్నారు.

4.భారత్‌లో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదు

భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ కలవరపెడుతోంది. ఇప్పటికే కర్ణాటక రాష్ట్రంలో రెండు కేసులు బయటపడగా..  తాజాగా దేశంలో మూడో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. గుజరాత్‌ రాష్ట్రంలోని జామ్‌నగర్‌లో ఓ వ్యక్తిలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ను గుర్తించినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. ఇటీవల జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తిలో కొత్త వేరియంట్‌ను గుర్తించినట్లు తెలిపారు.

5.టీమ్‌ఇండియా బౌలర్ల దెబ్బకు కుప్పకూలిన కివీస్‌

భారత బౌలర్ల ధాటికి రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో  న్యూజిలాండ్‌ 62 పరుగులకే కుప్పకూలింది. అత్యధిక స్కోరర్‌ జేమీసన్‌ (17) కావడం గమనార్హం. భారత్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌట్‌ చేసిన కివీస్‌.. బ్యాటింగ్‌లో ఏ దశలోనూ పోరాటం చేయలేకపోయింది. దీంతో మొదటి ఇన్నింగ్స్‌లో 263 పరుగులు వెనుకబడి ఉంది.

లైవ్‌బ్లాగ్‌ కోసం క్లిక్‌ చేయండి

6.అమేఠీలో 5లక్షల ఏకే-203 తుపాకుల తయారీ

రక్షణ ఉత్పత్తులలో స్వయం సమృద్ధి సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. అత్యాధునిక ఏకే-203 తుపాకులను ఉత్తర్‌ప్రదేశ్‌లోని అమేఠీలో తయారు చేయడానికి అంగీకారం తెలిపింది. రష్యా సహకారంతో మొత్తం ఐదు లక్షల తుపాకులను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. దీంతో ఉత్తర్‌ప్రదేశ్‌ రక్షణ ఉత్పత్తుల కేంద్రంగా మారనుందని ఓ ఉన్నతాధికారి అభిప్రాయపడ్డారు.

7.ఒమిక్రాన్‌ పుట్టుకకు జలుబూ సహకరించిందా?

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనిపై సమగ్ర సమాచారం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు విస్తృత పరిశోధనలు జరుపుతున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందుబాటులోకి వస్తే కట్టడి సులభమయ్యే అవకాశం ఉంది. ఈ తరుణంలో మసాచూసెట్స్‌ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ డేటా అనలిటిక్స్‌ ఎన్ఫరెన్స్‌ సంస్థ కీలక విషయాన్ని తెరపైకి తెచ్చింది.

8.ఆ దేశంలో మొట్టమొదటి కొవిడ్‌ కేసు నమోదు

కొవిడ్‌ మహమ్మారి ప్రపంచ దేశాలను చుట్టేస్తోన్న విషయం తెలిసిందే. కొత్త కొత్త వేరియంట్లతో.. ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలకు సవాల్‌ విసురుతోంది. కట్టడి చర్యలు చేపడుతోన్నా.. వ్యాప్తి చెందుతోంది. ఇదే క్రమంలో వైరస్‌ వ్యాప్తి మొదలైనప్పటినుంచి కొవిడ్‌ రహిత దేశంగా ఉన్న కుక్ ఐలాండ్స్‌లో శనివారం మొట్టమొదటి కేసు నమోదు కావడం గమనార్హం.

9.క్రిప్టో మార్కెట్‌లోనూ ఒమిక్రాన్‌ కుదుపు!

కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ భయాలు క్రిప్టో కరెన్సీ మార్కెట్లనూ వెంటాడుతున్నాయి. శనివారం బిట్‌కాయిన్ విలువ 42,296 డాలర్లకు పడిపోయింది. ఈ ఒక్కరోజే దాదాపు 11 శాతం నష్టాన్ని చవిచూసింది. ఇక బిట్‌కాయిన్‌ తర్వాత అత్యంత ఆదరణ కలిగిన ఈథర్‌ విలువ 17.4 శాతం వరకు కుంగింది.శనివారం ఒక్కరోజే 2.4 బిలియన్ డాలర్లు విలువ చేసే క్రిప్టో కరెన్సీని మదుపర్లు కోల్పోయారు.

10.ఉన్నట్టుండి ట్విటర్‌ ఫాలోవర్లు ఎందుకు తగ్గుతున్నారు?

ప్రముఖ మైక్రో బ్లాగింగ్‌ వేదిక ట్విటర్‌లో ఉన్నట్లుండి కొందరి వ్యక్తులకు ఫాలోవర్లు తగ్గుతున్నారు. పలువురు వందల సంఖ్యలో ఫాలోవర్లను ఒక్కసారిగా కోల్పోగా.. కొందరైతే వేల సంఖ్యలో అనుచరులను కోల్పోయారు. ఈ విషయమై పలువురు ఇదే ట్విటర్‌లో ఫిర్యాదు చేశారు. అయితే, అందులోని చాలా వరకు ఫాలోవర్లను ట్విటర్‌ పునరుద్ధరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని