Published : 06/12/2021 16:56 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1.తెరాస ఎంపీలు ప్రజల్ని మభ్యపెడుతున్నారు: రేవంత్‌రెడ్డి

ధాన్యం కొనుగోలు సమస్యను పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్‌ ప్రయత్నించడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో తెరాస ఎంపీలు తూతూ మంత్రంగా నిరసన తెలుపుతున్నారని ఆరోపించారు. దిల్లీలో రేవంత్‌ మీడియాతో మాట్లాడారు. సభ వాయిదా పడిన సమయంలో తెరాస ఎంపీలు సెంట్రల్‌హాల్లో ప్లకార్డులతో ఫొటోలు దిగి పార్లమెంట్‌లో నిరసన తెలుపుతున్నట్లు ప్రచారం చేసుకున్నారని ఆక్షేపించారు.

2.ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా?: చంద్రబాబు

జగనన్న సంపూర్ణ గృహహక్కు పథకం పేరుతో వైకాపా నేతలు ప్రజల్ని మోసం చేస్తున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఇళ్లకు ఓటీఎస్‌ పేరుతో పేదల మెడకు ఉరితాళ్లు వేస్తారా? అని నిలదీశారు. మంగళగిరిలోని తెదేపా కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఓటీఎస్‌ పేరుతో బలవంతంగా వసూలు చేస్తూ.. స్వచ్ఛందమంటారా? అని ప్రశ్నించారు.

3.కల్తీ రాయుళ్లకు రెండేళ్ల జైలు శిక్ష.. అవసరమైతే చట్టంలో మార్పులు: సీఎం జగన్‌

బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని ఏపీ సీఎం జగన్‌ సూచించారు. ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖపై ఆ శాఖ అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. మిల్లెట్స్‌ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలన్నారు. కల్తీ విత్తనాలు, పురుగుల మందులు, ఎరువులు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

4.ఓటీఎస్‌తో పేదలకు ఎలాంటి నష్టం ఉండదు: సజ్జల రామకృష్ణారెడ్డి

ఓటీఎస్ పథకం ద్వారా పేదలకు ఎలాంటి నష్టం ఉండదని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. పేదలందరూ దశాబ్దాలుగా ప్రభుత్వం ఇచ్చిన స్థలంలో ఇళ్లు కట్టుకొని ఉంటున్నారని.. సీఎం జగన్ చొరవతో ఇళ్ల రుణాలన్నీ మాఫీ చేసి ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయిస్తున్నామన్నారు. ఓటీఎస్‌పై ప్రజలు సహాయ నిరాకరణ చేయాలని తెదేపా అధినేత చంద్రబాబు కోరారంటే దాన్ని ఏమవాలో వారే ఆలోచించుకోవాలన్నారు.

5.ఉగ్రవాదులనే అనుమానంతోనే కాల్పులు.. పొరబాటుకు చింతిస్తున్నాం!

నాగాలాండ్‌లో సామాన్య పౌరులపై భద్రతా బలగాలు జరిపిన కాల్పుల ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు లోక్‌సభలో వివరణ ఇచ్చారు. ఉగ్రవాదులనే అనుమానంతోనే భద్రతా బలగాలు కాల్పులు జరిపాయని తెలిపారు. సైన్యం పొరబాటుకు కేంద్రం పశ్చాత్తాప పడుతోందన్న ఆయన.. ఘటనపై సిట్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 

6.ఒమిక్రాన్‌కు భయపడకండి.. ఇవి మాత్రం మరవకండి!

దేశ రాజధాని నగరంలో ఒమిక్రాన్‌ కేసు వెలుగు చూసిన నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు. ఎవరూ భయపడొద్దన్నారు. భౌతికదూరం పాటించడం, మాస్క్‌ ధరించడం వంటి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. కరోనా కొత్త వేరియంట్‌ కేసు దిల్లీలో నిన్న వెలుగుచూసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు పరిస్థితిపై సమీక్షిస్తున్నట్టు పేర్కొన్నారు.

ఒమిక్రాన్‌ కట్టడికా? ఆహ్వానానికా?.. రైల్వేస్టేషన్‌ను తలపించిన దిల్లీ ఎయిర్‌పోర్టు

7.టెస్టుల్లో టీమ్‌ఇండియా మళ్లీ నంబర్‌ 1

టీమ్‌ఇండియా టెస్టు క్రికెట్‌లో మళ్లీ నంబర్‌ 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ముంబయి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో కోహ్లీసేన సోమవారం 372 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించిన నేపథ్యంలో ఈ  ఘనత సాధించింది. ఐసీసీ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో భారత్‌ 124 పాయింట్లతో తొలి స్థానం సంపాదించగా.. కివీస్‌ 121 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచింది.

8.జిన్‌పింగ్‌ గర్వించేలా ఆమె..!

హాంకాంగ్‌ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంకాంగ్‌ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతపు చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు చేసిన ఉద్యమాన్ని చూసి భయంతో కన్నీటి పర్యంతమైన హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెరీ లామ్‌.. ఇప్పుడు విజృంభిస్తున్నారు.

9.ఒమిక్రాన్‌తో రీఇన్ఫెక్షన్‌ ముప్పు.. డెల్టా కంటే అధికంగానే..!

ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోన్న ‘ఒమిక్రాన్‌’ వేరియంట్‌ను ‘అత్యంత ఆందోళనకర రకం’గా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పేర్కొంది. తాజాగా సింగపూర్‌ ఆరోగ్యశాఖ ఈ వేరియంట్‌పై మరిన్ని కీలక విషయాలు వెల్లడించింది. గతంలో వెలుగుచూసిన కరోనా డెల్టా, బీటా వేరియంట్ల కంటే ‘ఒమిక్రాన్‌’తో రీఇన్ఫెక్షన్ల ముప్పు అధికంగా ఉండనుందని తెలిపింది.

10.అక్టోబరు నాటికి ఐపీఓల్లో రూ.52 వేల కోట్ల సమీకరణ

అక్టోబరు నాటికి దేశంలో 61 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూకి వచ్చినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ సోమవారం లోక్‌సభకు తెలిపారు. మొత్తం రూ.52,759 కోట్లు సమీకరించినట్లు వెల్లడించారు. గత ఏడాది మొత్తం ఐపీఓల్లో వచ్చిన నిధులతో పోలిస్తే ఇది ఎక్కువని పేర్కొన్నారు. 61 కంపెనీల్లో 34 చిన్న, మధ్య తరహా పరిశ్రమలని వెల్లడించారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని