Top 10 News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 23 Feb 2024 17:45 IST

1.రాజధాని రైతులకు రూ.60లక్షలు విరాళమిచ్చిన కర్ణాటక రైతులు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి వీధుల్లో కర్షకులు కదం తొక్కారు. అమరావతి ఆకాంక్షను వాయులింగేశ్వరుడి వాకిట చాటుతూ రాజధాని రైతులు 39వ రోజు పాదయాత్రను జోరువానను సైతం లెక్కచేయకుండా కొనసాగించారు. సాటి తెలుగువారి వేదన చూసి కర్ణాటక నుంచి యలమంచిలి వెంకటవాసుదేవరావు దంపతుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రవాసాంధ్రులు.. రైతుల మహాపాదయాత్రకు మద్దతు పలికి రూ.60లక్షల విరాళం అందజేశారు.

2.తెలంగాణలో 4కోట్లు దాటిన వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ

తెలంగాణలో టీకా పంపిణీ కార్యక్రమం సరికొత్త మైలురాయిని దాటింది. రాష్ట్ర వ్యాప్తంగా 4కోట్లకు పైగా వ్యాక్సిన్‌ డోసుల పంపిణీ పూర్తయింది. ఈ రోజు మధ్యాహ్నం 3గంటల వరకు తెలంగాణలో 4,01,64,958 డోసులు పంపిణీ చేసినట్టు ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో 2,61,58,671 మందికి తొలిడోసు అందగా.. 1,40,06,287 మందికి రెండు డోసులూ అందించినట్టు పేర్కొంది.

3.రైల్వేజోన్‌ సంగతేంటి?: లోక్‌సభలో గళమెత్తిన రామ్మోహన్‌ నాయుడు

దక్షిణకోస్తా రైల్వేజోన్‌ ఏర్పాటులో కేంద్రం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని తెదేపా ఎంపీ రామ్మోహన్‌ నాయుడు ఆగ్రహం వ్యక్తంచేశారు. 2019 ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిన కొత్త జోన్‌ ఏర్పాటుపై ఇప్పటికీ పురోగతిలేదని లోక్‌సభలో గళమెత్తారు. మూడేళ్లు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం చొరవచూపడంలేదని మండిపడ్డారు. 2021-22 బడ్జెట్‌లో దక్షిణ కోస్తా రైల్వేజోన్‌కు కేవలం ₹40 లక్షలు మాత్రమే కేటాయించారనీ, ఆ డబ్బుతో భవనం నిర్మించడమే కష్టమన్నారు.

4.ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం..

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో నంబర్‌ 59ను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. జీవో 59పై దాఖలైన వ్యాజ్యాల విచారణ సందర్భంగా ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

పీఆర్సీ అప్‌డేట్‌.. ఆర్థికశాఖ అధికారులతో జగన్‌ సమీక్ష

5.రావత్‌ మంచినీళ్లు కావాలని అడిగారు: ప్రత్యక్ష సాక్షి 

హెలికాప్టర్‌ ప్రమాదం తర్వాత సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌ కొంతసేపు ప్రాణాలతో ఉన్నారని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను మంచినీళ్లు కావాలని అడిగారని, అయితే ఆయనే రావత్‌ అనే విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు. 

6.ఒమిక్రాన్‌ వ్యాప్తి.. డెల్టాతో పోల్చితే 4.2 రెట్లు ఎక్కువే!

కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఒకవైపు ప్రపంచ దేశాలకు విస్తరిస్తుండగా.. మరోవైపు దాని వ్యాప్తి వేగం, తీవ్రత, టీకాల సమర్థతపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత స్థాయి పరిశోధనలు జరుగుతున్నాయి. ఇదే క్రమంలో తాజాగా జపాన్‌ శాస్త్రవేత్త చేసిన ఓ అధ్యయనంలో కొత్త అంశం వెల్లడైంది. ఒమిక్రాన్‌ ప్రారంభ దశలో.. డెల్టా వేరియంట్‌ కంటే 4.2 రెట్లు ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్లు తేలింది.

7.సైన్యంలో దిశా నిర్దేశకుల ప్రాణాలకు అత్యంత విలువ..!

ఈ ఏడాది ధ్రువ్‌ అడ్వాన్స్‌డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ హఠాత్తుగా గుజరాత్‌లోని ఖేడ్‌ జిల్లా వద్ద ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ అయ్యింది. ఆర్మీ ట్రైనింగ్‌ కమాండ్‌ అధిపతి లెఫ్టినెంట్‌ జనరల్‌ రాజ్‌శుక్లా, వాయుసేన సౌత్‌వెస్ట్రన్‌ కమాండ్‌ అధిపతి ఎయిర్‌ మార్షల్‌ సురేంద్ర కుమార్‌ దానిలో ప్రయాణిస్తున్నారు. వీరు గుజరాత్‌ కెవడియాలో జరుగుతున్న కంబైన్డ్‌ కమాండర్స్‌ సదస్సుకు వెళుతున్నారు.

8.టీమ్‌ఇండియా వైస్‌ కెప్టెన్‌గా రాహుల్‌.!

ఇటీవల టీమ్‌ఇండియా వన్డే పగ్గాలను ఓపెనర్‌ రోహిత్ శర్మకు అప్పగించిన సెలెక్షన్‌ కమిటీ.. త్వరలోనే యువ ఆటగాడు కేఎల్‌ రాహుల్‌ని వైస్‌ కెప్టెన్‌గా నియమించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇన్నాళ్లు కోహ్లీకి డిప్యూటీగా ఉన్న రోహిత్‌కి‌.. బీసీసీఐ తాజాగా కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది. దీంతో తదుపరి వైస్‌ కెప్టెన్‌ ఎవరు అనే విషయంపై చర్చ నడుస్తోంది.

9.రాజమౌళి సర్‌.. మతిపోతోంది..!

రామ్‌చరణ్‌ - తారక్‌ ప్రధాన పాత్రల్లో రాజమౌళి తెరకెక్కించిన భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR). సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 7న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ట్రైలర్‌ (RRR Trailer)ని చిత్రబృందం విడుదల చేసింది. తారక్‌ - చరణ్‌ల పవర్‌ప్యాక్డ్‌ పెర్ఫార్మెన్స్‌లతో నిండిపోయిన ఈ ట్రైలర్‌పై సినీ ప్రముఖులు స్పందించారు. ట్రైలర్‌ అత్యద్భుతంగా ఉందంటూ వ్యాఖ్యానించారు.

నెట్టింట ఆర్‌ఆర్‌ఆర్‌ సందడి‌.. 

10.10 లక్షల మైలురాయిని దాటిని బాలినో..!

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ వాహనం బాలినో మరో కీలక మైలురాయిని దాటింది. ఆ కారు విక్రయాలు 10లక్షల మైలు రాయిని దాటినట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ మోడల్‌ను తొలిసారిగా 2015 అక్టోబర్‌లో మార్కెట్లోకి విడుదల చేశారు. దీనిని కంపెనీ ప్రీమియం రిటైల్‌ విక్రయ కేంద్రాలైన నెక్సాలో అందుబాటులోకి తెచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని