Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 21 Jan 2022 17:03 IST

1.పీఆర్సీ జీవోల అమలుకుఏపీ కేబినెట్‌ ఆమోదముద్ర

ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసింది. సీఎం జగన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. కరోనా పరిస్థితులు, నియంత్రణ చర్యలపై ఈ భేటీలో చర్చించారు. ఒమిక్రాన్‌ కట్టడికి మరింత కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ జీవోలను యథాతథంగా అమలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

2.మంత్రుల కమిటీయా.. నాకు తెలియదు: పేర్ని నాని

కరోనా నియంత్రణ, నివారణకు తీసుకుంటున్న చర్యలపై కేబినెట్‌ భేటీలో చర్చించినట్లు మంత్రి పేర్ని నాని తెలిపారు. ఈ మేరకు కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాలను మంత్రి పేర్ని నాని మీడియాకు వెల్లడించారు. కరోనా మరణాలు మరింత తగ్గేలా చూడాలని శాఖాధిపతులను కోరినట్లు తెలిపారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో, వ్యాక్సినేషన్‌ కార్యక్రమంలో దేశంలోనే మెరుగైన స్థితిలో ఉన్నామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రంలో అగ్రవర్ణ మహిళలకు ఆర్థికంగా అండగా నిలుస్తున్నామని.. 45 నుంచి 60 ఏళ్ల మహిళలకు ఆర్థిక సాయం చేస్తున్నట్టు చెప్పారు.

Video: కేబినెట్‌ నిర్ణయాలు వివరించిన మంత్రి పేర్ని నాని

3.ఫిబ్రవరి 7 నుంచి ఏపీ ఉద్యోగుల సమ్మె

ఫిబ్రవరి 5వ తేదీ నుంచి సహాయ నిరాకరణ.. 7 నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఏపీ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పీఆర్సీని వ్యతిరేకిస్తూ పీఆర్సీ సాధన సమితి సమావేశమైంది. విజయవాడలోని ఎన్జీవో హోంలో ఏపీ ఐకాస, ఏపీ ఐకాస అమరావతి, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భేటీ అయ్యారు. పీఆర్సీ పోరాట కార్యాచరణపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు.

4.వారం రోజుల్లో ఫీవర్‌ సర్వే పూర్తి: సీఎస్‌ సోమేశ్‌కుమార్‌

తెలంగాణలో ఫీవర్‌ సర్వే వారం రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ తెలిపారు. ప్రజలందరూ ప్రభుత్వం చేస్తున్న ఫీవర్‌ సర్వేకు సహకరించాలని కోరారు. నగరంలోని ఖైరతాబాద్‌లో జరుగుతున్న ఫీవర్‌ సర్వేను సీఎస్‌, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌ కుమార్‌ ఇతర అధికారులు పరిశీలించారు. ఫీవర్‌ సర్వే సమయంలో జ్వరం, లేదా ఇతర లక్షణాలు ఉంటే అక్కడికక్కడే మెడిసిన్‌ కిట్లు అందజేస్తున్నట్టు చెప్పారు

5.క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలి: వర్ల రామయ్య

కృష్ణాజిల్లా పామర్రు పోలీస్‌ స్టేషన్‌ వద్ద తెదేపా నిజనిర్ధారణ కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతూ... కొడాలి నాని మంత్రి పదవిని అడ్డు పెట్టుకుని తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. గుడివాడలో క్యాసినో నిర్వహించారో లేదో డీజీపీ చెప్పాలని డిమాండ్‌ చేశారు. గుడివాడ పట్టణంలో వైకాపా నేతలను పోలీసులు కంట్రోల్‌ చేయలేరా? అని నిలదీశారు.

PRC : పీఆర్సీ జీవోలపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల మండిపాటు

6.‘మేం ఉద్యోగాలు ఎలా ఇస్తామంటే’.. యూత్ మేనిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్‌

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ కొత్త అస్త్రాలు సిద్ధం చేసింది. యూత్‌ మేనిఫెస్టో పేరిట యువతపై హామీల వర్షం కురిపించింది. శుక్రవారం దిల్లీలోని ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో ఈ మేనిఫెస్టోను విడుదల చేసింది. యువతకు తమ పార్టీ ఎలా ఉపాధి కల్పిస్తుందో తెలియజేయడమే ఈ యూత్ మేనిఫెస్టో వెనకున్న ఆలోచనని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ అన్నారు.

7.యూపీ ఎన్నికలు.. కాంగ్రెస్‌ సీఎం అభ్యర్థి ప్రియాంకే..?

మరికొద్ది వారాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్‌లో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా భాజపా నుంచి సీఎం యోగి ఆదిత్యనాథ్‌, సమాజ్‌వాదీ పార్టీ నుంచి మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ ఈసారి ఎన్నికల్లో పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ముఖ్యమంత్రిగా ఎవరు పోటీ చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారని గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

8.మోదీకి 71 శాతం ప్రజామోదం.. ప్రపంచంలోనే ‘నంబర్‌ 1’ దేశాధినేత

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ  మరోసారి అగ్ర స్థానంలో నిలిచారు. అమెరికాకు చెందిన మార్నింగ్‌ కన్సల్ట్‌ అనే సంస్థ ఆయా దేశాల్లో నిర్వహించిన తాజా సర్వేలో మోదీని 71 శాతం మంది ప్రజలు ఆమోదించారు. ఇక ఈ జాబితాలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరో స్థానంలో నిలిచారు.

Viral news : జూదం నిర్వహించానని నిరూపిస్తే ఆత్మహత్య చేసుకుంటా !

9.టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌కు కరోనా

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్‌ సింగ్ కరోనా బారిన పడ్డాడు. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ‘‘కరోనా పాజిటివ్‌గా నిర్థరణ అయింది. అయితే స్వల్ప లక్షణాలే ఉన్నాయి. స్వీయ నిర్బంధంలోకి వెళ్లా. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నా. నాతో కాంటాక్ట్‌ అయిన ప్రతి ఒక్కరూ పరీక్ష చేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. సురక్షితంగా ఉంటూ జాగ్రత్తలు పాటించండి’’ అంటూ ట్వీట్ చేశాడు.

10.దేశీయ విమానాల్లో కేబిన్‌లోకి ఒకటే బ్యాగ్‌కు అనుమతి

దేశీయ విమానాల్లో ప్రయాణికులకు ఇకపై క్యాబిన్‌లోకి కేవలం ఒకే హ్యాండ్‌ బ్యాగ్‌తో ప్రవేశానికి అనుమతి ఇవ్వనున్నారు. దేశవ్యాప్తంగా అన్ని విమానాశ్రయాలు, విమానయాన సంస్థలు ఈ నిబంధనను అమలు చేయాలంటూ బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) తాజాగా సర్క్యూలర్‌ జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని