Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 09 Apr 2022 17:15 IST

1. రైతులను రెచ్చగొట్టి వరి వేయించారు.. ఇప్పుడేమో నాటకాలాడుతున్నారు: కేటీఆర్‌

యాసంగి ధాన్యం కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా లేదని సీఎం కేసీఆర్ రైతులకు ముందే సూచించారని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అయినప్పటికీ.. రైతులను రాష్ట్ర భాజపా నేతలు రెచ్చగొట్టి వరి వేయించారన్నారు. ఇప్పుడు యాసంగి ధాన్యం కొనమంటే కేంద్రం నాటకాలు ఆడుతోందని కేటీఆర్ ట్విటర్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అన్నదాత పోరాటం మాత్రమే కాదని.. ఇది తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

2. తెరాస వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర: బండి సంజయ్‌

తెరాస వడ్ల రాజకీయం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. బ్రోకర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్కక్కై భారీ ఎత్తున కమీషన్లు దండుకునేందుకు వ్యూహం పన్నారని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర రైతులకు బండి సంజయ్‌ బహిరంగ లేఖ రాశారు. రైతులు అనివార్యంగా తక్కువ ధరకే ధాన్యం విక్రయించేలా పథకం పన్ని.. రైతుల నుంచి వచ్చే ఆగ్రహాన్ని కేంద్రంపై మళ్లించే ఎత్తుగడ వేశారన్నారు.


‘పంచెకట్టు’.. ఆ లిరిక్స్‌ వినగానే ఓకే చెప్పేశా: అరుణ సాయిరాం


3. కేబినెట్‌ విస్తరణపై జగన్ తుది కసరత్తు.. 8 మంది పాతవారిని కొనసాగించే అవకాశం!

మంత్రివర్గ విస్తరణపై ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ తుది కసరత్తు చేస్తున్నారు. సీఎంతో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమై కేబినెట్‌ విస్తరణపై చర్చిస్తున్నారు. కొత్తగా అధికారం చేపట్టనున్న మంత్రులకు రేపు సాయంత్రానికి అధికారికంగా లేఖలు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. లేఖలు వెళ్లిన తర్వాత వ్యక్తిగతంగా సీఎంవో అధికారులు ఫోన్లు చేసి సమాచారం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

4. సొంత పార్టీ వాళ్లు ఉన్నా వదలొద్దని సీఎం ఆదేశించారు: శ్రీనివాస్‌గౌడ్‌

తెలంగాణలో గంజాయి, మాదకద్రవ్యాలను నిరోధించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తోందని రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్‌ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తెలిపారు. సమాజంలో ఎప్పటినుంచో ఉన్న వీటిని క్రమంగా కూకటివేళ్లతో పెకిలించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు నగరంలోని పబ్ యజమానులతో శ్రీనివాస్ గౌడ్ సమీక్ష నిర్వహించారు. అబ్కారీ శాఖ సంచాలకులు సర్ఫరాజ్, అదనపు కమిషనర్ అజయ్ రావు సమీక్షలో పాల్గొన్నారు.

5. జగన్‌ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధం: చంద్రబాబు
ఏపీలో కరెంట్ పీకుతున్న సీఎం జగన్‌ను ఆ పదవి నుంచి పీకడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. విద్యుత్‌ కోతలు, పెరిగిన కరెంట్‌ ఛార్జీలపై జనం తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయన చెప్పారు. పరిశ్రమలకు విద్యుత్‌ కోతలతో కార్మికుల ఉపాధి పోతోందని, పంటలకు నీరందక రైతులు మరింత సంక్షోభంలోకి వెళ్లిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


మైగ్రేన్‌ ఎందుకు వస్తుంది.. ఎలా నివారించుకోవచ్చు..?


6. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌.. ఇక ప్రైవేట్లోనూ రూ.225/డోసు

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకా ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ టీకాల ధరలు రూ.225గా ఉండనున్నట్లు ప్రకటించాయి.

7. టాటా డిజిటల్‌లో టాటా సన్స్‌ ₹5882 కోట్ల పెట్టుబడి

ఈ-కామర్స్‌ రంగంలో అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పోటీపడేందుకు దేశీయ దిగ్గజం టాటా గ్రూప్‌ సిద్ధమవుతోంది. ఈ క్రమంలో తమ ఈ-కామర్స్‌ కంపెనీ టాటా డిజిటల్‌లో మార్చిలో టాటా సన్స్‌ రూ.5,882 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. ఇప్పటి వరకు ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ-కామర్స్‌లో టాటా గ్రూప్‌ ఒకేసారి ఇంత మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే తొలిసారి. దీంతో టాటా డిజిటల్‌లో మొత్తం పెట్టుబడులు 2021-22లో రూ.11,872 కోట్లకు చేరింది.

8. ఇమ్రాన్‌ను ప్రధానిగా చూడొద్దు.. ఆయన వల్ల పాక్‌ ప్రజలకు ప్రభుత్వమే లేదు..!

పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ అవిశ్వాస తీర్మానాన్ని తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఆ నిమిత్తమై సమావేశమైన జాతీయ అసెంబ్లీ అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలతో వాయిదా పడింది. దాంతో తీర్మానంపై ఓటింగ్‌ నిర్వహించడం కుదరలేదు. దీనిపై విపక్ష నేత మరియమ్ నవాజ్ సామాజిక మాధ్యమాల వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆ 20 రోజులు ఒకేలా అనిపించింది: పూజా హెగ్డే


9. వాట్సాప్ ‘డిస్‌అపియరింగ్‌ చాట్‌’లో మరో కొత్త అప్‌డేట్‌!

కుప్పలు తెప్పలుగా వచ్చే మెసేజ్‌లను వాటంతట అవే డిలీట్‌ అయ్యేలా వాట్సాప్‌లో ‘డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌’  అనే ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే, సమస్య సగమే తొలగిపోయింది. డిస్‌అపియరింగ్‌ మెసేజెస్‌ ఆన్‌లో ఉన్నా.. వచ్చిన ఇమేజ్‌లు, వీడియోలు ఫోన్‌లోనే ఉండిపోతున్నాయి. దీంతో ఆ ఫీచర్‌ వల్ల లాభం తక్కువగా ఉంటోంది. ఈ క్రమంలో వాట్సాప్‌ తాజాగా ఈ ఫీచర్‌లో మార్పు చేసింది.

10. తెవాతియా సిక్సర్లకు.. హార్దిక్‌ ఎలా షాకయ్యాడో చూడండి!
టీ20 లీగ్‌లో భాగంగా గతరాత్రి పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్‌ 190 పరుగుల భారీ లక్ష్యాన్ని ఆఖరి బంతికి ఛేదించింది. చివరి రెండు బంతుల్లో 12 పరుగులు అవసరమైన వేళ అనూహ్యంగా పోరాడిన రాహుల్‌ తెవాతియా (13 నాటౌట్‌; 3 బంతుల్లో 2x6) రెండు సిక్సర్లను దంచికొట్టి తమ జట్టును అనూహ్య రీతిలో గెలిపించాడు. అంతకుముందు ఆ ఓవర్లో గుజరాత్‌ బ్యాట్స్‌మెన్‌ ఆటతీరు చూస్తే ఎవరూ ఆ జట్టు విజయం సాధిస్తుందని అనుకోలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని