Updated : 14 May 2022 17:04 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తీసుకున్న అప్పులపై వివరాలివ్వండి: ఏపీ ప్రభుత్వానికి పీఏజీ లేఖ

ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు తీసుకున్న అప్పులపై వివరాలు సమర్పించాలని ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (పీఏజీ) కార్యాలయం కోరింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థికశాఖ కార్యదర్శికి లేఖ రాసింది. ప్రభుత్వ పథకాల అమలుకు బడ్జెట్‌లో నమోదుకాని రుణాల వివరాలు చెప్పాలని పేర్కొంది. ప్రభుత్వ హామీతో పీఎస్‌యూలు, కార్పొరేషన్లు, సొసైటీలు తీసుకున్న రుణాలపై వివరాలను తెలపాలని లేఖలో కోరింది.

2. మరోసారి అవకాశం ఇవ్వమని అడుగుతుంటారు.. వాళ్లను నమ్మొద్దు: కేటీఆర్‌

సాగు, తాగునీరులో దేశానికి ఆదర్శంగా నిలిచామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏమీ చేయలేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. నల్గొండ జిల్లాలో సుంకిశాల ఇన్‌టేక్‌వెల్‌కు భూమిపూజ చేసిన అనంతరం కేటీఆర్‌ హాలియాలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.


Video: డిస్కమ్‌లకు బకాయిలు ఎందుకు పెట్టారు: పట్టాభి


3. మీ కుతంత్రం ఇక్కడ పని చేయదు: అమిత్‌షాకు రేవంత్‌ 9 ప్రశ్నలు

మాటలు కోటలు దాటుతున్నాయి.. చేతలు గడప దాడటం లేదన్న సామెత కేంద్ర ప్రభుత్వానికి అతికినట్లు సరిపోతుందని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. 2022 నాటికి దేశంలో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ హామీ ఒట్టి బూటకమని అర్థమైందన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి ఇవాళ తెలంగాణకు వస్తున్న అమిత్‌షాకు రేవంత్‌రెడ్డి తొమ్మిది ప్రశ్నలు సంధించారు.

4. రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దు: భాజపా ఎంపీ జీవీఎల్‌

తెదేపాను దెబ్బతీసేందుకే అమరావతిని నిర్లక్ష్యం చేశారని భాజపా ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఆరోపించారు. అమరావతి పరిధిలోని ప్రాంతాల్లో నిర్మాణాలను పరిశీలించిన అనంతరం తుళ్లూరు రైతులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జీవీఎల్‌ మాట్లాడుతూ తెదేపా అధినేత చంద్రబాబును రాజకీయంగా దెబ్బతీసేందుకు వైకాపా యత్నిస్తోందని చెప్పారు. రాజకీయాల కోసం అమరావతిని బలిపెట్టొద్దన్నారు.

5. దేశ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.. రీసెట్‌ చేయాలి..!

దేశ ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని, ఆర్థిక విధానాలను మార్చాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి. చిదంబరం అభిప్రాయపడ్డారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగుతోన్న కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌లో దేశ ఆర్థిక వ్యవస్థ, వృద్ధిరేటు అంశాలపై పార్టీ నేతలు చర్చించారు. ఈ వివరాలను చిదంబరం నేడు మీడియాకు వెల్లడించారు.


Heart Failure: హార్ట్‌ ఫెయిల్యూర్‌ ముప్పు నుంచి ఇలా కాపాడుకోండి..


6. గుడ్‌ లక్‌ అండ్ గుడ్‌బై కాంగ్రెస్‌.. పార్టీ వీడిన సీనియర్‌ నేత

కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు చింతన్‌ శిబిర్‌ నిర్వహిస్తోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. సీనియర్‌ నేత, పంజాబ్‌ పీసీసీ మాజీ చీఫ్‌ సునీల్‌ జాఖఢ్‌ పార్టీని వీడారు.. కొద్ది గంటల క్రితమే తన సోషల్‌మీడియా ఖాతాల్లో ‘కాంగ్రెస్‌’ పదాన్ని తొలగించిన ఆయన.. నేడు ఫేస్‌బుక్‌ లైవ్‌లో మాట్లాడుతూ పార్టీకి గుడ్‌బై చెప్పారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఇటీవల జాఖఢ్‌పై కాంగ్రెస్‌ క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.

7. రాయుడు ‘రిటైర్మెంట్‌’ షాక్‌.. క్లారిటీ ఇచ్చిన చెన్నై..!

ఆంధ్రా క్రికెటర్‌, చెన్నై టీమ్‌ టాప్‌ కీలక బ్యాట్స్‌మన్‌ అంబటి రాయుడు ఒక్క ట్వీట్‌తో అభిమానులకు షాకిచ్చి తర్వాత గందరగోళానికి గురిచేశాడు. దీంతో ఇప్పుడు అతడి పేరు ట్విటర్‌లో మార్మోగుతోంది. ఈ మధ్యాహ్నం రాయుడు ఒక ఆసక్తికర ట్వీట్‌ చేసి వెంటనే దాన్ని తొలగించాడు. ఇదే తనకు చివరి టీ20 లీగ్‌ అని, వచ్చే ఏడాది నుంచి ఈ మెగా ఈవెంట్‌లో ఆడనని అందులో పేర్కొన్నాడు.

8. రాఖీ అభిమానులకు శుభవార్త.. ‘కేజీయఫ్‌3’ షూటింగ్‌ మొదలయ్యేది అప్పుడే!

పాన్‌ ఇండియా మూవీగా బాక్సాఫీస్‌ వద్ద రికార్డులను తిరగరాస్తోంది ‘కేజీయఫ్‌2’. ఇప్పటికే రూ.1000కోట్ల కలెక్షన్లు దాటి ‘ఆర్ఆర్ఆర్‌’ను దాదాపు బీట్‌ చేసేసింది. సినిమా విడుదలై నెల రోజులు అయినా ఇప్పటికీ బాలీవుడ్‌లో రాఖీభాయ్‌కు ఏమాత్రం క్రేజ్‌ తగ్గలేదు. ఈ క్రమంలో ‘కేజీయఫ్‌’ అభిమానులకు మరో తీపి కబురు. ఈ ఏడాదిలోనే ‘కేజీయఫ్‌3’ షూటింగ్‌ మొదలు పెట్టనున్నట్లు నిర్మాత విజయ్‌ కిరంగదూర్‌ తెలిపారు.


Viral Video: బస్సు వెనక నిచ్చెనపై.. విద్యార్థి ప్రయాణం..!


9. త్రిపుర సీఎం బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ రాజీనామా

త్రిపుర ముఖ్యమంత్రి బిప్లబ్‌ కుమార్‌ దేబ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఈ మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసిన ఆయన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. వచ్చే ఏడాది రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ కీలక పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. పలు వివాదాస్పద వ్యాఖ్యలతో అనేక సార్లు వార్తల్లో నిలిచిన బిప్లబ్‌పై ఇటీవల కొన్ని రోజులుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

10. ఈ యుద్ధం ఎంతకాలం సాగుతుందో..? ముగింపు ఎప్పుడో..?

‘ఈ యుద్ధం ఎన్నాళ్లు సాగుతుందో..’ అంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దేశం నుంచి రష్యన్లను వెళ్లగొట్టేందుకు మా సైనికులు చేయాల్సిందంతా చేస్తున్నారని చెప్పారు. కానీ ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ అంచనా వేయలేరన్నారు.  ‘ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు. మా సైనికులు అత్యున్నతంగా పోరాడుతున్నారు. దురదృష్టవశాత్తూ దీని ముగింపు మా ఒక్కరిపైనే ఆధారపడిలేదు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని