Published : 20 May 2022 20:59 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణలో పోలీసు నియామకాల దరఖాస్తు గడువు పొడిగింపు

తెలంగాణలో పోలీసు ఉద్యోగ నియామకాల్లో అభ్యర్థుల వయోపరిమితిని మరో 2 సంవత్సరాలు పొడిగిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో 95 శాతం స్థానికత ఆధారంగా నియామకాలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వయోపరిమితి పెంచుతూ నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం తాజాగా దరఖాస్తు గడువును సైతం పొడిగించింది. నోటిఫికేషన్‌ ఆధారంగా ఈ నెల 2వ తేదీన ప్రారంభమమైన దరఖాస్తుల ప్రక్రియ నేటితో ముగియనుంది.

2. కేసీఆర్‌.. ఇక్కడేం సాధించారని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారు?: ఈటల

తెలంగాణలో సరైన పరిపాలన అందించలేని సీఎం కేసీఆర్.. ఏం సాధించాలని దేశవ్యాప్త పర్యటనకు వెళ్లారని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రజల డబ్బుతో ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసుకొని తిరగడానికి వెళ్లిన సీఎంను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గూట్లో రాయి తీయలేనివాడు ఏట్లో రాయి తీస్తా అన్నట్లుగా సీఎం కేసీఆర్‌ వ్యవహార శైలి ఉందని ఎద్దేవా చేశారు.


Video: నాలుగు వారాల్లో పెగాసస్‌పై నివేదిక ఇవ్వండి: సుప్రీంకోర్టు


3. ప్రతి 2వేల జనాభాకు ఒక వైఎస్‌ఆర్ హెల్త్ క్లీనిక్: కృష్ణబాబు

బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవదానానికి వారి కుటుంబసభ్యులను మానసికంగా సిద్ధం చేయాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు అన్నారు. ఒక బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి అవయవాలు 8 మందికి అమర్చే అవకాశముందన్నారు. మంగళగిరిలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో నిర్వహించిన జీవన్‌దాన్ వర్క్‌షాప్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ట్రాన్స్ ప్లాంట్ కో-ఆర్డినేటర్లుగా శిక్షణ పొందిన వారికి ధ్రువపత్రాలను అందజేశారు.

4. ఎన్‌డీఏ@8ఏళ్లు.. 2014 తర్వాత ప్రభుత్వంపై పెరిగిన విశ్వాసం

దేశవ్యాప్తంగా సంతులిత అభివృద్ధి, సామాజిక న్యాయంతోపాటు సామాజిక భద్రత కల్పించేందుకే భాజపా నేతృత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం అంకితమయ్యిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. అంతేకాకుండా 2014 తర్వాత ప్రభుత్వ పాలనపై ప్రజల్లో విశ్వాసం పునరుద్ధరించబడిందన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా జైపుర్‌లో నిర్వహించిన భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుల సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని మోదీ పాల్గొన్నారు.

5. జ్ఞానవాపి మసీదు కేసు.. జిల్లా కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం నిర్ణయం

జ్ఞాన​వాపి మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసును వారణాసి జిల్లా జడ్జికి బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉత్తర్​ప్రదేశ్​ న్యాయ విభాగానికి సంబంధించి.. సీనియర్​, అనుభవజ్ఞులైన జ్యుడీషియల్​ అధికారి ఈ కేసును విచారించాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. కేసు సున్నితత్వాన్ని దృష్టిలో పెట్టుకొని సివిల్​ జడ్జి సీనియర్​ డివిజన్​ నుంచి కేసును వారణాసి జిల్లా​ జడ్జికి బదిలీ చేసినట్లు స్పష్టం చేసింది.


Ukraine: ఆ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైంది: జెలెన్‌ స్కీ


6. ప్రభుత్వానికి ఆర్‌బీఐ ₹30,307 కోట్ల డివిడెండు

మార్చి 2022తో ముగిసిన త్రైమాసికిగానూ కేంద్ర ప్రభుత్వానికి రూ.30,307 కోట్లు డివిడెండ్‌గా చెల్లించనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. ఈ మేరకు బోర్డు ఆమోదం కూడా లభించినట్లు తెలిపింది. కంటింజెన్సీ రిస్క్‌ బఫర్‌ కింద 5.50 శాతం నిధుల్ని తమ వద్దే ఉంచనున్నట్లు పేర్కొంది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

7. నా ముందున్న లక్ష్యం అదే.. దానికోసం ఏమి చేయడానికైనా సిద్ధమే: విరాట్‌

టీమ్‌ఇండియాకు ఆసియా కప్‌, టీ20 ప్రపంచకప్‌ను అందించడమే తన ముందున్న లక్ష్యమని భారత స్టార్‌ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. దీని కోసం తనవంతు కృషి చేస్తానని పేర్కొన్నాడు. గత టీ20 ప్రపంచకప్‌ తర్వాత కెప్టెన్సీ నుంచి తప్పుకొన్న విరాట్ కోహ్లీని తర్వాత వన్డే సారథ్యం నుంచి బీసీసీఐ తొలగించింది. అయితే కెప్టెన్‌గా ఒక్క ఐసీసీ టైటిల్‌ను సాధించకపోవడం మినహా విరాట్ నాయకత్వంలో భారత్‌ అద్భుత విజయాలను నమోదు చేసింది.

8. కెనడా పార్లమెంట్‌లో ఎంపీ ‘కన్నడ’ ప్రసంగం.. వీడియో వైరల్‌
కెనడా పార్లమెంట్‌లో ఓ భారత సంతతి ఎంపీ చేసిన ప్రసంగం ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఆ ఎంపీ తన మాతృభాష అయిన కన్నడలో మాట్లాడటమే అందుకు కారణం. మాతృభాష మీద ఆయన చూపించిన ప్రేమకు తోటి ఎంపీలతో పాటు నెటిజన్లు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. కెనడాలోని నెపియన్‌ ప్రాంత ఎంపీ అయిన చంద్ర ఆర్య  పార్లమెంట్‌లో మాట్లాడారు.


pakisthan: మరోసారి తన వక్రబుద్ధి బయటపెట్టిన పాకిస్థాన్‌..


9. జైలు నుంచి విడుదలైన ఇంద్రాణీ ముఖర్జియా

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జీయా జైలు నుంచి విడుదలయ్యారు. బుధవారం సుప్రీంకోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో విడుదలకు సంబంధించిన వ్యవహారాలను పూర్తి చేసిన ముంబయి జైలు అధికారులు విడుదల చేశారు. ఈ కేసు విచారణ త్వరలో ముగిసే అవకాశం కనపడటంలేదని, ఆమె ఆరున్నరేళ్లు (2015 నుంచి)గా జైల్లో ఉండటం సుదీర్ఘ కాలమని పేర్కొంటూ జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యానిస్తూ బుధవారం బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

10. వచ్చే సీజన్‌లో ఆడటంపై ధోనీ ఏమన్నాడంటే..?

ప్రస్తుత టీ20 టోర్నీ సీజన్‌లో చెన్నై చివరి లీగ్‌ మ్యాచ్‌ ఆడుతోంది. అయితే ఇప్పుడందరి మదిలో మెదిలే ప్రశ్న.. చెన్నై సారథి ఎంఎస్ ధోనీ వచ్చే సీజన్‌ ఆడతాడా...? లేదా..?. అయితే దీనిపై రాజస్థాన్‌తో టాస్‌ సందర్భంగా ధోనీ తనదైన శైలిలో స్పందించాడు. ఇప్పటి వరకు ఏమీ అనుకోలేదని, అయితే వచ్చే సీజన్‌లో తిరిగి రావడానికి తీవ్రంగా కృషి చేస్తానని చెప్పాడు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని