Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 22 May 2022 17:01 IST

1. దావోస్‌లో ఏపీ పెవిలియన్‌ను ప్రారంభించిన సీఎం జగన్
స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో ఏపీ ప్రభుత్వం తరఫున ఏర్పాటు చేసిన పెవిలియన్‌ను సీఎం జగన్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు. అంతకుముందు వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం కాంగ్రెస్‌ సమావేశంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సహ వ్యవస్థాపకుడు ప్రొఫెసర్‌ క్లాస్‌ ష్వాప్‌తో సీఎం సమావేశమయ్యారు.

2. కేజ్రీవాల్‌తో కేసీఆర్‌ భేటీ.. జాతీయ రాజకీయాలపై చర్చ!

ఉత్తరాది రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. దేశ రాజధాని పర్యటనలో ఉన్న కేసీఆర్‌ దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. కేజ్రీవాల్‌ నివాసంలో జరిగిన ఈ విందు సమావేశంలో.. ఇరువురు నేతలు పలు అంశాలపై చర్చించారు. జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి తదితర అంశాలు వీరి భేటీలో చర్చకు వచ్చినట్లు సమాచారం. దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై వీరు చర్చించినట్లు తెలుస్తోంది.

3. అభివృద్ధి ముసుగులో రైతుల ఉసురు తీయొద్దు: రేవంత్‌రెడ్డి

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామం అక్కంపేట అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘అక్కంపేటలో కనీస మౌలిక సదుపాయాలు లేవు. రెవెన్యూ గ్రామ హోదా కూడా లేదు. అక్కంపేటపై అలక్ష్యం.. జయశంకర్‌పై అక్కసును చాటుతోంది. దళిత బంధు అంటూ గొప్పలు చెప్పుకోవడం తప్పితే దళితుల జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు’అని పేర్కొన్నారు.


Video: మద్యం మత్తులో ఇద్దరు యువతుల రచ్చ..


4. ‘శేఖర్‌’ మూవీ ప్రదర్శనలు నిలిపివేత.. రాజశేఖర్‌ ఏమన్నారంటే!

రాజశేఖర్‌ కీలక పాత్రలో నటించిన చిత్రం ‘శేఖర్‌’. జీవితా రాజశేఖర్‌ దర్శకత్వం వహించారు. ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌నే తెచ్చుకుంది.  ఈ క్రమంలో ‘శేఖర్‌’ చిత్రానికి ఊహించని పరిస్థితి ఎదురైంది. చిత్ర ప్రదర్శన నిలిపివేయాలంటూ సిటీ సివిల్‌ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.  జీవితా రాజశేఖర్‌ డబ్బులు చెల్లించలేదని ఫైనాన్షియర్‌ పరంధామరెడ్డి కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్‌ విచారణకు స్వీకరించిన కోర్టు ‘శేఖర్‌’ సినిమా ప్రదర్శన నిలిపివేయాలంటూ ఆదేశాలు జారీ చేసింది.

5. ఆధ్యాత్మిక కేంద్రాలు స్టార్టప్‌లకు స్ఫూర్తినివ్వాలి.. ప్రధాని మోదీ పిలుపు

దేశంలోని స్టార్టప్‌లు, మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాలకు ఇక్కడి ఆధ్యాత్మిక నిలయాలు స్ఫూర్తిదాయక కేంద్రాలుగా నిలవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మైసూరు అవధూత దత్త పీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి 80వ జన్మదిన వేడుకలు పురస్కరించుకుని ఆదివారం ప్రధాని ఆన్‌లైన్‌ వేదికగా తన సందేశం అందజేశారు. అందరి కోసం పాటుపడాలంటూ మన సాధువులు ఎల్లప్పుడూ ప్రజల్లో స్ఫూర్తి నింపారని పేర్కొన్నారు.

6. ఎస్‌బీఐ ఖాతాదారులకు హెచ్చరిక‌.. మరో ఫేక్‌ మెసేజ్‌!

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లకు అలర్ట్‌. మీ ఎస్‌బీఐ ఖాతా బ్లాక్‌ చేశారని మరో ఫేక్‌ మెసేజ్‌ తాజాగా సర్య్యూలేట్‌ అవుతోంది. దీని పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ నకిలీ ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్‌లకు ఎట్టిపరిస్థితుల్లోనూ స్పందించవద్దని సూచించింది. ఈ మేరకు వ్యక్తిగత, బ్యాంకింగ్‌ వివరాలను పంచుకోవద్దని వెల్లడించింది. ఒకవేళ అటువంటి సందేశాలు మీకు వస్తే report.phishing@sbi.co.inకు నివేదించాలని కోరింది.


Video: ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. నూనె కోసం ఎగబడ్డ స్థానికులు


7. వచ్చారు.. ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.. వెళ్లారు..!

సమ్మర్‌ సెన్సేషనల్‌ సక్సెస్‌ని తన ఖాతాలో వేసుకున్నారు సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు. ఆయన నటించిన ‘సర్కారువారి పాట’ బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టి సూపర్‌హిట్‌ని సొంతం చేసుకుంది. ‘పోకిరి’ తర్వాత అదే స్థాయిలో మహేశ్‌ నుంచి సినిమా రావడంతో సూపర్‌స్టార్‌ అభిమానులు ఫుల్‌ ఖుషీలో ఉన్నారు. మరోవైపు ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఫ్యామిలీతో కలిసి సినిమా సక్సెస్‌ని ఎంజాయ్‌ చేయడానికి మహేశ్‌బాబు తాజాగా విదేశాలకు వెళ్లారు.

8. కాల్పుల విరమణ ఉండకపోవచ్చు..!

మాస్కోతో కాల్పుల విరమణ లేదా ఇతర ఒప్పందాలు జరిగే అవకాశాలను ఉక్రెయిన్‌ తోసిపుచ్చింది. డాన్‌బాస్‌ ప్రాంతంలో పోరు తీవ్రం కావడం, ఫిన్లాండ్‌కు రష్యా గ్యాస్‌ నిలిపివేయడం వంటి చర్యలపై  స్పందిస్తూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ పై వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే  మేరియుపోల్‌ నగరం రష్యా చేతికి దక్కడంతో.. ఇప్పుడు క్రెమ్లిన్‌ దృష్టి లుహాన్స్క్‌ ప్రాంతంపైకి మళ్లించింది. డాన్‌బాస్‌ ప్రాంతాన్ని ఉక్రెయిన్‌ నుంచి పూర్తి స్వాధీనం చేసుకోవాలని భావిస్తోంది.


Video: పునర్వివాహం చేసుకున్న భార్యాభర్తలు..!


9. ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌కూ పాకిన మంకీపాక్స్‌

ప్రపంచాన్ని కలవరపాటుకు గురిచేస్తున్న మంకీపాక్స్‌ తాజాగా ఇజ్రాయెల్‌, స్విట్జర్లాండ్‌కూ వ్యాపించింది. తొలికేసు నమోదైనట్లు ఆయా దేశాల ఆరోగ్యశాఖలు ప్రకటించాయి. విదేశాల నుంచి తిరిగొచ్చిన వ్యక్తిలో లక్షణాలు గుర్తించి పరీక్షలు చేయగా.. మంకీపాక్స్‌గా తేలినట్లు ఇజ్రాయెల్‌ వెల్లడించింది. ప్రస్తుతం రాజధాని తెల్‌ అవీవ్‌లోని ఓ ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని పేర్కొంది.

10. ఫలితం రాకపోయినా ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు: వార్నర్‌

గతరాత్రి ముంబయితో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలవ్వడంతో దిల్లీ ఈ సీజన్‌లో లీగ్‌ దశ నుంచే నిష్క్రమించింది. దీంతో ఆ జట్టు ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సామాజిక మాధ్యమాల్లో భావోద్వేగపూరితమైన పోస్టు పెట్టాడు. ఈ సీజన్‌లో తనకు అవకాశం ఇచ్చిన దిల్లీ యాజమాన్యానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని