Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 23 May 2022 16:59 IST

1. పోలీసుల అదుపులో ఎమ్మెల్సీ అనంతబాబు

మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మృతి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అదనపు ఎస్పీ శ్రీనివాస్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం అనంతబాబును విచారిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతబాబును ఇవాళ రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. సుబ్రహ్మణ్యం మృతిపై ఇప్పటికే పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతున్నాయి.

2. రుషికొండ తవ్వకాలపై ఎన్జీటీ స్టే.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

విశాఖలోని రుషికొండ తవ్వకాలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విశాఖ వద్ద రుషికొండ తవ్వకాలపై ఇటీవల జాతీయ హరిత ట్రైబ్యునల్‌ (ఎన్జీటీ) ప్రిన్సిపల్‌ ధర్మాసనం స్టే విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. పర్యావరణ అనుమతులు అన్నీ పొందాకే తవ్వకాలు మొదలుపెట్టినట్లు పేర్కొంది. పర్యావరణానికి ఎలాంటి హాని తలపెట్టకుండా తవ్వకాలు చేపడతామని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది.


Video: పెళ్లిలో ఊడిన వరుడి విగ్గు.. వివాహానికి నిరాకరించిన వధువు


3. కేంద్రం బాటలో.. పెట్రోల్‌పై పన్నులు తగ్గించిన రాష్ట్రాలివే..!

అధిక ధరల భారంతో అల్లాడిపోతున్న ప్రజలకు ఊరట కల్పిస్తూ పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. లీటర్‌ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 మేర సుంకం తగ్గిస్తున్నట్లు గత శనివారం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. దీంతో ఆ రెండు ఇంధనాల ధర లీటర్‌కు వరుసగా రూ.9.50, రూ.7 వరకు దిగి వస్తుందని తెలిపారు. ఇప్పుడు కేంద్రం బాటలోనే పలు రాష్ట్రాలు కూడా పెట్రో ఉత్పత్తులపై పన్నులు తగ్గించాయి. మహారాష్ట్ర, రాజస్థాన్‌, కేరళ రాష్ట్రాలు ఈ ఇంధనాలపై వ్యాట్‌ను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి.

4. అదో అర్థం లేని వాదన: అధిక సంతానంపై స్పందించిన మస్క్

అధిక సంతానం పర్యావరణానికి హాని కలిగిస్తుందనే వాదనను టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్ కొట్టిపారేశారు. ఇది అర్థం లేని అభిప్రాయమంటూ తోసిపుచ్చారు. ‘తక్కువ సంతానం కలిగిఉంటే పర్యావరణానికి మంచిదని కొంతమంది భావిస్తారు. జనాభా రెట్టింపైనా..పర్యావరణం బాగానే ఉంటుంది. జపాన్‌లో జననాల రేటు అత్యల్పంగా ఉంది. నాగరికతను కాపాడుకోవడానికి పిల్లలు ఉండాల్సిన అవసరం ఉంది. నాగరికత క్షీణించిపోవడాన్ని చూస్తూ ఉండలేం’ అంటూ ఇటీవల ఓ సదస్సులో మాట్లాడుతూ మస్క్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

5. నిన్ను నువ్వు నమ్ముకుంటే.. అన్నీ నీవెంటే: దినేశ్‌ కార్తీక్

ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే అవకాశాలు వాటంతటవే వస్తాయని నిరూపించాడు బెంగళూరు బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌. 2019 వన్డే ప్రపంచకప్‌ తర్వాత భారత జట్టులో చోటు కోల్పోయిన అతడు ప్రస్తుత సీజన్‌లో అత్యుత్తమ ఫినిషర్‌గా సత్తా చాటాడు. దీంతో ఆదివారం మళ్లీ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. వచ్చేనెల దక్షిణాఫ్రికాతో జరిగే 5 టీ20ల సిరీస్‌కు సెలెక్షన్‌ కమిటీ అతడిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో దినేశ్‌ కార్తీక్‌కు అభినందనలు వెల్లువెత్తాయి.


Health News: ఊపిరితిత్తుల్లో నీరు చేరిందా.. వైద్యులు ఏమంటున్నారంటే..!


6. చైనా-అమెరికా మాటల యుద్ధం..!

జపాన్‌ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన వ్యాఖ్యలపై చైనా విదేశాంగశాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ స్పందించారు. తైవాన్‌ విషయంలో జాతీయ ప్రయోజనాలను కాపాడుకొంటామని ఆయన పునరుద్ఘాటించారు. ‘‘జాతీయ ప్రయోజనాలు, ప్రాదేశిక సమగ్రతను కాపాడుకోవడంలో చైనాను ఎవరూ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. చైనా జాతీయ భద్రత కాపాడుకొనే విషయంలో ప్రజల దృఢ చిత్తాన్ని తక్కువగా అంచనావేయలేము’’ అని అమెరికాను హెచ్చరించారు. 

7. శ్రీలంకలో ఔషధాల కొరత.. రోగులకు ‘మరణశిక్ష’ లాంటిదే..!

తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్లాడుతోన్న ద్వీప దేశం శ్రీలంకను అత్యవసరాల కొరత కూడా వేధిస్తోంది. సంక్షోభం కారణంగా ఔషధాల కొరత ఏర్పడటంతో వైద్యులు అత్యవసర శస్త్రచికిత్సలను కూడా వాయిదా వేయాల్సి వస్తోంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో మరణాలు తప్పవని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఔషధాల సరఫరా కోసం శ్రీలంక విదేశాలపై ఆధారపడాల్సిందే. ఆ దేశం వినియోగించే మొత్తం ఔషధాల్లో 80శాతం దిగుమతి చేసుకునేవే.

8. ‘రైళ్లలో సీనియర్‌ సిటిజన్లకు రాయితీ పునరుద్ధరించండి’!

రైళ్లలో వయో వృద్ధులకు రాయితీలను పునరుద్ధరించాలని కేరళ సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వమ్‌ కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌కు ఆయన లేఖ రాశారు. కరోనా విజృంభణ సమయంలో రైళ్లలో సీనియర్‌ సిటిజన్ల ప్రయాణ టిక్కెట్ల రుసుములో ఇచ్చే రాయితీలను కేంద్రం ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేరళ ఎంపీ లేఖ రాస్తూ.. కరోనా వైరస్‌ పేరిట రైళ్లలో ఇచ్చే రాయితీలను రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం కోట్లాది మంది సీనియర్‌ సిటిజన్లపై పడిందన్నారు.

9. ఈ ఐఫోన్‌ మోడల్స్‌కు వాట్సాప్ సేవలు బంద్‌.. ఎప్పటి నుంచి అంటే?

టెక్నాలజీలో వస్తోన్న మార్పులు, డేటా భద్రత వంటి వాటి ఆధారంగా కంపెనీలు యూజర్లకు అందించే సేవల్లో మార్పులు చేస్తుంటాయి. ఇందులో భాగంగా పాత తరం డివైజ్‌లకు సేవలు నిలిపివేస్తాయి. తాజాగా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కూడా కొన్ని ఐఫోన్లకు తమ సేవలను నిలిపివేస్తున్నట్లు వెల్లడించింది. ఐఓఎస్‌ 10, ఐఓఎస్‌ 11 వెర్షన్‌ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఐఫోన్లలో అక్టోబరు 24, 2022 నుంచి వాట్సాప్‌ పనిచేయదని తెలిపింది.

10. ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం

ఇండో-పసిఫిక్‌ దేశాల మధ్య వాణిజ్యబంధం పెంపొందించేలా సరికొత్త అధ్యాయం మొదలైంది. జపాన్‌ పర్యటనలో ఉన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌ ఇండో-పసిఫిక్‌ ట్రేడ్‌ బ్లాక్‌కు శ్రీకారం చుట్టారు. మొత్తం 13 దేశాలతో ప్రారంభించిన ఈ బ్లాక్‌లో భారత్‌, జపాన్‌ కూడా సభ్యులుగా ఉన్నాయి. ఈ ప్రాంత శ్రేయస్సు కోసం ఇండో-పసిఫిక్‌ ఎకనామిక్‌ ఫ్రేమ్‌ వర్క్‌ (ఐపీఈఎఫ్‌) ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని