Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసమే..

Updated : 09 Jun 2022 17:44 IST

1.జులై 18న రాష్ట్రపతి ఎన్నిక

దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్‌ ఖరారైంది. జులై 18న  రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. జులై 21న కౌంటింగ్‌ చేపట్టనున్నారు. ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్‌ విడుదల కానుంది. ఈ మేరకు కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈసీ) రాజీవ్‌ కుమార్‌ గురువారం వెల్లడించారు. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ పదవీకాలం జులై 24తో ముగియనుంది. 

2.‘అమ్మఒడి’ ఇవ్వాల్సి వస్తుందనే ఎక్కువ మందిని ఫెయిల్‌ చేశారు

తెదేపా మహానాడుకు వచ్చిన స్పందన చూసి భయంతోనే అధికార పార్టీ వైకాపా వర్క్‌షాప్‌ నిర్వహించిందని తెదేపా రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్‌ అన్నారు. పార్టీని కాపాడుకోవడానికే వర్క్‌షాప్‌, ప్లీనరీలు ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అధికార పార్టీ ఎమ్మెల్యేలు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

3.పెళ్లి ఫొటో షేర్‌ చేసిన విఘ్నేశ్‌

నటి నయనతార, దర్శకుడు విఘ్నేశ్‌ శివన్‌ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. విఘ్నేశ్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ‘నేను రౌడీనే’ చిత్రంతో పరిచయమైన వీరిద్దరూ సుమారు ఏడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు. ఈ క్రమంలో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం మహాబలిపురంలోని ఓ ప్రముఖ హోటల్‌లో ఘనంగా జరిగింది. తమ వివాహబంధాన్ని తెలియజేస్తు తాజాగా విఘ్నేశ్‌ ఓ ఫొటో షేర్‌ చేశారు.

4.లోకేశ్‌ జూమ్‌ మీటింగ్‌లో కొడాలి నాని, వల్లభనేని వంశీ

టెన్త్‌ విద్యార్థులతో తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ నిర్వహించిన జూమ్‌ సమావేశంలో అనూహ్య సంఘటన చోటుచేసుకుంది. వైకాపాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూమ్‌ మీటింగ్‌లో ప్రత్యక్షమయ్యారు. దీన్ని గమనించిన లోకేశ్‌.. సమావేశంలో ఆ పార్టీ నేతలు ఉన్నా ఫర్వాలేదని, వైకాపా ప్రభుత్వం ఎలా ఏడ్చిందో వారికీ తెలుస్తుందని వ్యాఖ్యానించారు.

5.ఎన్టీఆర్‌ మనిషిగా ఉండటాన్ని గర్విస్తున్నా

ఎన్టీఆర్‌ అనే మూడు అక్షరాలు తెలుగుజాతికి అపూర్వ శక్తిని అందిస్తాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. ఆయన జనం నాడి తెలిసిన వ్యక్తి అని.. పార్టీ ప్రారంభించిన తర్వాత నిర్విరామ కృషితో అధికారంలోకి వచ్చారని గుర్తుచేశారు. తిరుపతిలోని ఎస్వీయూ ఆడిటోరియంలో నిర్వహించిన ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకల ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీజేఐ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు.

6.జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌ కేసు.. పోలీసుల కీలక నిర్ణయం?

జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులు ఇప్పటికే ఆరుగురిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నిందితులైన ఐదుగురు మైనర్లను విచారణ సమయంలో మేజర్లుగా పరిగణించాలని జూబ్లీహిల్స్ పోలీసులు జువైనల్ జస్టిస్ బోర్డును కోరే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రస్థాయి నేరాలకు పాల్పడిన మైనర్లను చట్ట ప్రకారం మేజర్లుగా పరిగణించవచ్చని పోలీసులు భావిస్తున్నారు.

7.పంత్‌కు అనుకోకుండా వచ్చిన అవకాశం... అదరగొడతాడా?

రిషభ్‌ పంత్‌ను ధోనీ వారసుడు అంటుంటారు. అనుకున్నట్లుగానే కెప్టెన్సీ రేసులో ఉన్నాడు. అయితే కేఎల్‌ రాహుల్‌ గాయపడటంతో అనుకోకుండా దక్షిణాఫ్రికా సిరీస్‌కి కెప్టెన్‌ అయిపోయాడు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, షమి, కేఎల్‌ రాహుల్‌ లాంటి కీలక ఆటగాళ్లు లేని నేపథ్యంలో జట్టును ఎలా నడిపిస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పంత్‌ సారథ్యంపై ప్రత్యేక కథనం.

8.రాష్ట్రపతి ఎన్నికల్లో ఈ ప్రత్యేకతలు మీకు తెలుసా..?

భారత రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్‌ వచ్చేసింది. దేశ 16వ రాష్ట్రపతి ఎన్నిక జులై 18న నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దేశ ప్రథమ పౌరుడి ఎన్నిక ఆద్యంతం ఆసక్తికరమే. మన రాజ్యాంగంలో అత్యున్నత స్థానంలో ఉండే రాష్ట్రపతిని ఎన్నుకునేందుకు నిర్వహించే ఎన్నికల ప్రక్రియలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందామా!

9.రష్యాను స్విచ్ఛాఫ్ చేయాలి.. అప్పుడే ముందడుగు..!

మూడు నెలలకు పైగా సాగుతోన్న ఉక్రెయిన్‌-రష్యా యుద్ధంలో శాంతి దిశగా ఎటువంటి పురోగమనం కనిపించడం లేదు. తాను ఇంకా శక్తిమంతంగా ఉన్నానని రష్యా భావించడం వల్లే ఒక్క అడుగు కూడా ముందుకు పడటం లేదని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వ్యాఖ్యానించారు. యూఎస్‌ కార్పొరేట్‌ లీడర్లతో జరిపిన సమావేశంలో భాగంగా ఈ మాటన్నారు.

10.ఈ బ్యాంకులు.. గృహ రుణ రేట్లు పెంచేశాయ్‌..!

రెపో రేటును పెంచుతున్నట్లు రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్‌ ఇండియా అలా ప్రకటించిందో లేదో.. అనేక బ్యాంకులు రుణ రేట్ల పెంపును మొదలుపెట్టాయి. రేపో రేటుకు అనుసంధానమైన రుణ రేటును పెంచుతున్నట్లు ఆయా బ్యాంకులు ప్రకటించాయి. దీంతో ఈ బ్యాంకు ఖాతాదారులకు హోం లోన్‌, కార్‌ లోను ఈఎంఐలు మరింత భారం కానున్నాయి. అయితే రుణాలపై తక్షణమే వడ్డీని పెంచేసిన పలు బ్యాంకులు.. డిపాజిట్లపై వడ్డీ రేట్ల పెంపు గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని