Published : 25 Jun 2022 17:01 IST

Top Ten news @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. టీచర్ల ఆస్తులపై పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు

ఉపాధ్యాయుల ఆస్తులపై తెలంగాణ పాఠశాల విద్యాశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాశాఖ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు ఏటా ఆస్తుల వివరాలు ప్రకటించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. స్థిర, చరాస్తుల క్రయవిక్రయాలకు ముందస్తు అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. ఇటీవల నల్గొండ జిల్లా దేవరకద్ర మండలం గుంటిపల్లి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జావీద్‌ ఆలీపై ఆరోపణల నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

2. ప్రజావేదిక కూల్చివేతకు మూడేళ్లు... తెదేపా అధినేత చంద్రబాబు ఇంటి వద్ద ఉద్రిక్తత

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉండవల్లి కరకట్ట సమీపంలో నిర్మించిన ప్రజావేదికను కూల్చేసి నేటికి మూడేళ్లు పూర్తైన సందర్భంగా తెదేపా శ్రేణులు నిరసన తెలుపుతారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమైయ్యారు. సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు ప్రజావేదిక లో కలెక్టర్ల సమావేశం నిర్వహించిన సీఎం జగన్‌... అక్రమంగా నిర్మించిన ప్రజావేదికను కూల్చివేయాలని ఆదేశించారు.

3. ప్రభుత్వ మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు: తెదేపా

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ దుకాణాల్లో లభించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్థాలు ఉన్నాయని తెదేపా నాయకులు పంచమర్తి అనురాధ, ఆనం వెంకటరమణా రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో లభించే మద్యం తాగుతున్న వారి ఆరోగ్యం దశలవారీగా క్షీణిస్తోందని తెలిపారు. ‘‘వివిధ ప్రాంతాల నుంచి మద్యం సేకరించి టెస్టులు చేయించాం. ఆంధ్రా గోల్డ్‌ విస్కీ, 9సీ హార్స్‌ విస్కీలో కెమికల్‌ కాంపౌండ్స్‌ ఉన్నాయి. వైరాగేలాల్‌, ఐసోఫ్లోరిక్‌ యాసిడ్‌ లాంటివి ఉన్నాయి. మద్యంలో హానికారక కెమికల్‌ కాంపౌండ్స్‌ ఉన్నాయని బహుళ జాతీయ ల్యాబ్‌ నివేదిక ఇచ్చింది’’ అని తెదేపా నాయకులు వెల్లడించారు.


Video: పెట్రోల్‌ బంకులో యువకులపై ఎస్సై వీరంగం.. వీడియో వైరల్‌


4. శిందే వర్గం పార్టీ పెట్టనుందా..? పేరు అదేనా..?

మహారాష్ట్ర రాజకీయాలు రోజులు గడుస్తున్నా కొద్దీ కాకపుట్టిస్తున్నాయి. ఇటు ఉద్ధవ్ వర్గం.. అటు శిందే వర్గం ఏ నిర్ణయం తీసుకుంటుందోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. శిందే వర్గం కొత్తపార్టీపై ప్రకటన చేయొచ్చని వార్తలు వస్తున్నాయి. అసమ్మతి నేతలు తమ బృందానికి ‘శివసేన బాలాసాహెబ్ ఠాక్రే’ అనే పేరు పెట్టనున్నట్టు సంబంధిత వర్గాలు మీడియాకు వెల్లడించాయి. శివసేన జాతీయ కార్యవర్గంతో ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడనున్న సమయంలో ఈ పేరు గురించి బయటకువచ్చింది. 

5. బంగ్లాదేశ్‌లోనే పొడవైన వంతెన ప్రారంభం.. విశేషాలివే!

బంగ్లాదేశ్‌లో పద్మా నదిపై ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘పద్మా వంతెన’ను ప్రధాని షేక్‌ హసీనా శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. రోడ్డు, రైలు మార్గాలు కలిగి ఉన్న ఈ మల్టీపర్పస్‌ వంతెన.. దేశంలోనే అతి పొడవైన బ్రిడ్జ్‌ కావడం విశేషం. రాజధాని నగరం ఢాకా.. ప్రాంతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కీలకమైన మోంగ్లా ఓడరేవు మధ్య దూరాన్ని ఇది గణనీయంగా తగ్గిస్తుంది.

6. బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్‌ తీసుకుంటున్నారా?ఈ BSNL ప్యాక్‌పై లుక్కేయాల్సిందే!

భారత్‌లో టాప్‌ ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లలో బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) ఒకటి. గత కొన్నేళ్లుగా తనదైన బ్రాడ్‌బ్యాండ్‌ సేవల (Broadband Services)తో దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు దీని నెట్‌వర్క్ విస్తరించింది. భారత్‌ ఫైబర్‌ (Bharat Fibre) ద్వారా ఇప్పుడు ఫైబర్‌ బ్రాడ్‌బ్యాండ్‌ మార్కెట్‌లోనూ గట్టి పోటీనిస్తోంది.

7. SBI ఖాతాదారుల‌కు గుడ్ న్యూస్.. ఒక్క కాల్‌తో వివిధ‌ బ్యాంకింగ్ సేవ‌లు!

దేశీయ అతిపెద్ద బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) త‌న ఖాతాదారుల‌కు కొత్త సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం ఓ కొత్త టోల్ ఫ్రీ నంబ‌రును (SBI Toll free) ప్రారంభించింది. ఈ నంబ‌రుకు కాల్ చేయ‌డం ద్వారా బ్యాంకు ఖాతాదారులు వివిధ ర‌కాల ఆర్థిక సేవ‌లు ఇంటి వ‌ద్ద నుంచే సుల‌భంగా పొందొచ్చు. దీంతో ప్రాథ‌మిక బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల కోసం బ్యాంకు శాఖ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉండ‌దు.


Video: ఫస్ట్‌ నైట్‌కు సిద్ధమైన భాస్కర్‌ తండ్రి.. నిప్పులపై నడిచిన రాంప్రసాద్‌..!


8. ఆరోజు యువరాజ్‌ ఐదో సిక్సర్‌ కొట్టగానే..: రవిశాస్త్రి

టీ20 ప్రపంచకప్‌ ఆరంభ సీజన్‌ 2007లో టీమ్‌ఇండియా ఛాంపియన్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది. ముఖ్యంగా లీగ్‌ స్టేజ్‌ ఆఖరి దశలో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో యువరాజ్‌ సింగ్‌(58; 16 బంతుల్లో 3x4, 7x6) రెచ్చిపోయి ఆడాడు. స్టువర్ట్‌ బ్రాడ్‌ వేసిన 19వ ఓవర్‌లో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది జట్టు స్కోరును 200 దాటించాడు. అయితే, ఆరోజు వ్యాఖ్యాతగా ఉన్న టీమ్‌ఇండియా మాజీ హెడ్‌కోచ్‌ రవిశాస్త్రి తాజాగా ఓ కార్యక్రమంలో యువీ సిక్సర్లపై స్పందించాడు.

9. వారానికి 4 రోజులే పని.. తగ్గనున్న వేతనం.. జులై 1 నుంచి కొత్త రూల్స్‌..!

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన నాలుగు కార్మిక చట్టాలు (New Labour codes) జులై 1 నుంచి అమల్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ చట్టాలకు సంబంధించి నిబంధనలను రూపొందించాయి. ఇప్పటికే కొన్ని నెలలుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చట్టాలు అమల్లోకి వస్తే ఉద్యోగుల వేతనం, పీఎప్‌ కాంట్రిబ్యూషన్‌, పని సమయం, వీక్లీ ఆఫ్‌లు వంటి వాటిలో పలు మార్పులు చేసుకోనున్నాయి.

10. ఆవుల సుబ్బారావుకు రిమాండ్ విధించిన రైల్వే కోర్టు

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌లో చెలరేగిన అల్లర్లకు సంబంధించి అభియోగాలు ఎదుర్కొంటున్న ఆవుల సుబ్బారావుకు రైల్వే కోర్టు రిమాండ్‌ విధించింది. సాయి డిఫెన్స్‌ అకాడమీని నిర్వహిస్తోన్న సుబ్బారావును సికింద్రాబాద్‌ అల్లర్లలో ప్రధాన సూత్రధారిగా పోలీసులు తేల్చారు. సుబ్బారావుతో పాటు అతని ముగ్గురు అనుచరులు మల్లారెడ్డి, శివ, బీసీ రెడ్డిలను పోలీసులు అరెస్టు చేసి ఇవాళ రైల్వే కోర్టులో హాజరుపరిచారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని