Published : 26 Jun 2022 16:58 IST

Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కాసుల కోసం వేట... రాజధానిలో భవనాలు అద్దెకిచ్చేందుకు సిద్ధమైన ప్రభుత్వం

రాజధానిలో అభివృద్ధి పనుల కోసం రుణాలిచ్చేందుకు బ్యాంకులు ముందుకు రాకపోవడంతో ఏపీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించింది. ఆదాయ మార్గాలను అన్వేషిస్తూ కాసుల వేట ప్రారంభించింది. ఇందులో భాగంగా రాజధానిలో గ్రూప్‌-డి ఉద్యోగులకు నిర్మించిన భవనాలను లీజుకు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీఆర్డీఏ చేసిన ఈ ప్రతిపాదనకు ముఖ్యమంత్రి జగన్‌ ఆమోదం తెలిపినట్టు సమాచారం.

2సీఎంను ప్రజలే పట్టించుకోవట్లేదు.. భాజపా సైతం పట్టించుకోదు: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్రంలో మార్పు కోసం భాజపా పనిచేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఒక్కసారి తమ పార్టీకి అవకాశం ఇవ్వాలని రాష్ట్ర ప్రజలను కోరారు. భాజపా కట్టడికి సీఎంవోలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ను ప్రజలే పట్టించుకోవట్లేదని.. భాజపా కూడా పట్టించుకోదని తెలిపారు. పులి వస్తే జింక పారిపోయినట్లు కేసీఆర్‌ పారిపోతున్నారని విమర్శించారు.


Video: వర్షంలోనూ వెరవని సంకల్పం.. ఉక్కు పరిరక్షణ కోసం భారీ ర్యాలీ!


3. 28నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు: మంత్రి నిరంజన్‌రెడ్డి

తెలంగాణలో తొమ్మిదో విడత రైతుబంధు నిధులు ఎల్లుండి నుంచి రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10 వేల చొప్పున ఇప్పటివరకు రూ.50,447.33 రైతుల ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు. రైతు బీమా పథకం ద్వారా 83,118 మంది రైతు కుటుంబాలకు రూ.4,150.90 కోట్లు పరిహారం అందజేసినట్లు పేర్కొన్నారు.

4. వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి

బెజవాడ కనకదుర్గమ్మ సన్నిధి వరుస ఉత్సవాలకు ముస్తాబవుతోంది. ఏటా ఆషాఢమాసంలో నిర్వహించే పవిత్ర సారె మొదలుకొని.. తెలంగాణ నుంచి ఉమ్మడి దేవాలయాల కమిటీ దుర్గమ్మ సన్నిధికి తీసుకొచ్చే బంగారు బోనం సమర్పణ, ఆ తర్వాత శాకంబరీదేవి ఉత్సవాల కోసం దేవస్థానం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది భక్తుల రద్దీ పెరుగుతుందనే అంచనాతో పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని భావిస్తోంది.

5. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించిన ‘మనసానమః’

తెలుగు సినిమా గర్వించేలా మరో అరుదైన రికార్డు నమోదైంది. యువ దర్శకుడు దీపక్‌రెడ్డి(deepak reddy) తెరకెక్కించిన లఘు చిత్రం ‘మనసానమః’(Manasanamaha) గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.  అత్యధిక అవార్డులు అందుకున్న లఘు చిత్రంగా రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకూ ఏ లఘు చిత్రం సాధించని విధంగా ఏకంగా 513 అవార్డులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ గిన్నిస్‌ బుక్ ఆఫ్ వరల్డ్‌ రికార్డ్స్‌ ప్రశంసాపత్రాన్ని అందించింది.


Video: అర్ధరాత్రి.. కత్తులు తల్వార్లతో డ్యాన్స్‌లు..వీడియో వైరల్‌!


6. కేంద్రం ఓ కాపీ క్యాట్‌.. ఎత్తుకొచ్చిన పథకాలు ఇక్కడ సూట్‌ కావు: కాంగ్రెస్‌ ఎంపీ

కేంద్రం నూతనంగా తీసుకొచ్చిన అగ్నిపథ్‌ పథకంపై (Agnipath scheme) కాంగ్రస్‌ నేత, రాజ్యసభ సభ్యుడు దీపేందర్‌ హుడా మండిపడ్డారు. ఇదో కాపీ పథకమని వ్యాఖ్యానించారు. విదేశాల్లో అమలౌతున్న పథకాలను కేంద్రం కాపీ కొట్టి ఇక్కడ రూపకల్పన చేస్తోందని విమర్శించారు. ఆ పథకాలు ఇక్కడ పరిస్థితులకు సరిపోవని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఇక్కడ పీసీసీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

7. శివసైనికుల ఆందోళనలు.. 15 మంది రెబల్‌ ఎమ్మెల్యేలకు ‘వై ప్లస్‌’ భద్రత

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం(Maharashtra Crisis) కొనసాగుతూనే ఉంది. అస్సాంలోని గువాహటిలో మకాం వేసిన శివసేన(Shivsena) రెబెల్‌ ఎమ్మెల్యేలు.. మరో రెండు రోజులు అక్కడే ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 12 గంటలకు హోటల్‌లోనే మరోసారి భేటీ అయిన వారు.. తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.

8. మధ్యప్రదేశ్‌ సరికొత్త రికార్డు.. తొలిసారి రంజీ ట్రోఫీ కైవసం

దేశవాళీ క్రికెట్‌లో మధ్యప్రదేశ్‌ సత్తాచాటింది. ఈ ఏడాది రంజీ ట్రోఫీని ఆ రాష్ట్ర క్రికెట్‌ జట్టు సొంతం చేసుకుంది. క్రికెట్‌కు పవర్‌హౌస్‌లాంటి ముంబయి జట్టును  ఆరు వికెట్ల తేడాతో ఓడించి రంజీ చరిత్రలో తొలిసారి  ట్రోఫీని దక్కించుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో ముంబయిను 269 పరుగులకు కట్టడి చేసి, 108 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా ఛేదించింది. కోచ్‌గా వ్యవహరిస్తున్న చంద్రకాంత్‌ పండిత్‌ నేతృత్వంలో జట్టు వరుసగా ఆరో నేషనల్‌ టైటిల్‌ గెలవడం విశేషం.


Video: మత్తుకు చిత్తు కాకండి.. వ్యసనాలకు ఇలా వీడ్కోలు చెప్పండి


9. ఒకరు విజయవంతమైతే.. మా సీనియర్లు తట్టుకోలేరు: పాక్‌ క్రికెటర్‌

ఒకరు విజయవంతమైతే తమ సీనియర్లు తట్టుకోలేరని, వారు సంతోషంగా ఉండలేరని పాకిస్థాన్‌ బ్యాటర్‌ అహ్మద్‌ షెజాద్‌ తెలిపాడు. ఈ విషయం తాను ఇదివరకే చెప్పినా మళ్లీ చెబుతున్నానన్నాడు. చాలా రోజులుగా జట్టులో చోటు కోల్పోయిన అతడు తాజాగా క్రికెట్‌ పాకిస్థాన్‌తో మాట్లాడుతూ తనకు జరిగిన అన్యాయంపై స్పందించాడు. ఈ సందర్భంగా టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ విజయవంతమవ్వడానికి ధోనీనే కారణమని చెప్పాడు.

10. దక్షిణాఫ్రికా నైట్‌క్లబ్‌లో అనుమానాస్పద స్థితిలో 17 మంది మృతి

దక్షిణాఫ్రికాలోని ఈస్ట్‌లండన్‌ సిటీలోని ఒక నైట్‌ క్లబ్‌లో నేడు 17 మంది అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఈ విషయం ఆదివారం తెల్లవారుజామున బయటకు వచ్చింది. ఈ క్లబ్‌లో పలు ప్రదేశాల్లో మృతదేహాలు పడిఉన్నట్లు సమాచారం. మృతుల శరీరాలపై గాయాలు లేకపోవడంతో.. మరణానికి కారణాలు వెంటనే చెప్పలేమని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు. మృతుల సంఖ్య మరింత పెరగవచ్చని చెబుతున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని