Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Published : 02 Jul 2022 17:02 IST

1. హైదరాబాద్ వేదికగా మా ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పాలి: సీఎం కేసీఆర్

ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్రమోదీ అసత్య ఆరోపణలు చేస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ప్రధాని ఇవాళ హైదరాబాద్‌ వస్తున్నారని.. రెండు రోజులు ఇక్కడే ఉంటారన్నారు. తెరాస వేసే ప్రశ్నలకు హైదరాబాద్‌ వేదికగా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్‌ డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఎన్నికల విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతుగా జలవిహార్‌లో నిర్వహించిన సభలో కేసీఆర్‌ మాట్లాడారు.

2. హైదరాబాద్‌ డిక్లరేషన్‌ పేరుతో భాజపా కీలక రాజకీయ తీర్మానం?

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌ డిక్లరేషన్‌ పేరుతో హెచ్‌ఐసీసీ వేదికగా కీలక రాజకీయ తీర్మానాన్ని ఆమోదించేందుకు భాజపా సిద్ధమైంది. ఇప్పటివరకు అధికారంలో ఉన్న రాష్ట్రాలు, ఆయా రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులు.. వాటితో పాటు ఇకపై అధికారం కొనసాగించాల్సిన రాష్ట్రాల్లో పరిస్థితులపై చర్చించనున్నారు. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో అధికారం చేజిక్కించుకోవడమే ప్రధాన ఎజెండాగా కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి అనే నినాదాన్ని హైదరాబాద్‌ వేదికగా ఇవ్వడానికి కాషాయ దళం సిద్ధమైంది.


Video: పురుషులతో సమానంగా రాజకీయాల్లో రాణించాలి: నాగబాబు


3. ఒక వ్యక్తి చెబుతుంటే 135 కోట్ల మంది వినాలా..?: యశ్వంత్ సిన్హా

దేశంలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌(KCR) సవివరంగా చెప్పారని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా(Yashwant sinha) అన్నారు. తెలంగాణలో ప్రజాచైతన్యాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జలవిహార్‌లో ఏర్పాటు చేసిన సభలో యశ్వంత్‌ సిన్హా మాట్లాడారు. రాష్ట్రపతి ఎన్నికల్లో తెరాస సంపూర్ణ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌,  మంత్రి కేటీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తెరాస ప్రతినిధులు చూపించిన ఆదరాభిమానాలకు కృతజ్ఞతలు తెలిపారు.

4. ప్రభుత్వం నుంచి భాజపా అభ్యర్థి.. ఎంవీఏ నుంచి శివసేన నేత..!

మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ శిందే నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వం బలపరీక్షకు సిద్దమవుతోంది. దానిలో భాగంగా రేపటి నుంచి అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. అలాగే స్పీకర్‌ ఎన్నిక జరగనుంది. ఆ పదవి  కోసం ప్రభుత్వం తరఫు నుంచి భాజపా ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ బరిలో ఉండగా.. మహా వికాస్ అఘాడీ నుంచి శివసేన ఎమ్మెల్యే రాజన్ సల్వి పోటీలో నిలిచారు. ఆయన ఈ రోజు నామినేషన్ వేశారు. రేపు దీనిపై ఓటింగ్ జరగనుంది.

5. ఈవీ రేస్‌: నాలుగో స్థానానికి ఓలా.. టాప్‌లో ఎవరంటే?

చమురు ధరలు పెరగడం.. ప్రభుత్వం ఇచ్చే రాయితీ పెరగడం.. ఎలక్ట్రిక్‌ వాహనాల (electric scooters) ధరలు తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో ప్రజల్లో విద్యుత్‌ వాహనాలపై మోజు పెరుగుతోంది. దీనికి అనుగుణంగా ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు సైతం అందుబాటులోకి వస్తుండడంతో వీటి కొనుగోలుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ వాహనాలు తయారు చేసే కంపెనీలు విరివిగా పుట్టుకొస్తున్నాయి. దీంతో వాటి మధ్య తీవ్ర పోటీ నెలకొంది.


Video: భారత్‌ భూభాగంలోకి వచ్చిన పాక్‌ బాలుడు.. 


6. ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌..?

భారత తదుపరి రాష్ట్రపతిగా ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్మూ గెలుపు దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. దీంతో అధికార పార్టీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిపై దృష్టి పెట్టింది. ఈ రేసులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పేరు తాజాగా వినిపిస్తోంది. ఉపరాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని మాజీ సీఎం కార్యాలయం శనివారం వెల్లడించింది.

7. జడేజా సెంచరీ.. బుమ్రా సంచలనం.. టీమ్‌ఇండియా భారీ స్కోర్‌

ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న ఐదో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆట పూర్తయింది. లోయర్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ రవీంద్ర జడేజా (104; 194 బంతుల్లో 13x4) శతకం బాదాడు. 338/7 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం రెండోరోజు మహ్మద్‌ షమి(0)తో కలిసి బ్యాటింగ్‌ ఆరంభించిన అతడు 183 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో మూడంకెల స్కోర్‌ అందుకున్నాడు. ఈ క్రమంలోనే షమి(16; 31 బంతుల్లో 3x4)తో కలిసి ఎనిమిదో వికెట్‌కు 48 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.

8. ఇన్‌స్టాలో కొత్త ఫీచర్‌.. వీడియో పోస్ట్‌లన్నీ రీల్స్‌గా మారిపోతాయ్‌!

ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారా..? అయితే మీకో శుభవార్త. ఇన్‌స్టా యూజర్లకు కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది మెటా సంస్థ. ఇందులో కొత్తేముంది? అంటారా.. కానీ, ఈ ఫీచర్‌ యూజర్ల వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చేస్తుందట. అవునండీ.. మెటా సంస్థ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల కోసం ఈ ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ‘‘ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో అనుభూతిని మరింత సులభతరం చేయడంతోపాటు, మెరుగుపరచాలనే ఉద్దేశంతో వీడియో పోస్ట్‌లను రీల్స్‌గా మార్చే ఫీచర్‌ను పరీక్షిస్తున్నాం’’ అని మెటా సంస్థ తెలిపింది.


Video: షిఫ్టు డ్యూటీల వల్ల సమస్యలు..బయటపడే మార్గాలు


9. ఉక్రెయిన్‌కు అమెరికా మరోసారి చేయూత.. 820 మిలియన్‌ డాలర్ల సాయం ప్రకటన

రష్యా ముప్పేట దాడులతో తీవ్రంగా చితికిపోతున్న ఉక్రెయిన్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోమారు ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్‌కు 820 మిలియన్‌ డాలర్ల సైనిక సాయాన్ని అందజేయనున్నట్లు వైట్‌హౌజ్‌ వెల్లడించింది. ఉక్రెయిన్‌ సైనిక శక్తిని బలపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఉపరితలం నుంచి గగనతలానికి ప్రయోగించే సరికొత్త క్షిపణి వ్యవస్థను కూడా ఉక్రెయిన్‌కు అందివ్వనున్నట్లు పేర్కొంది.

10. పాత, కొత్త ప‌న్ను విధానాల్లో ఏది బెట‌ర్‌?

నిర్దిష్ట పరిమితికి మించి ఆదాయం ఉన్న ప్రతి ఉద్యోగీ ప్రభుత్వానికి ఏటా పన్ను చెల్లించాలి. భార‌త్‌లో వ్య‌క్తుల స‌గ‌టు ఆదాయాన్ని ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుని ప‌న్ను స్లాబులను రూపొందించారు. అందువ‌ల్ల‌ వ్యక్తి పొందుతున్న ఆదాయం ఆధారంగా పన్ను స్లాబులు వర్తిస్తాయి. పన్ను చెల్లింపుదారుని ఆదాయం పెరుగుతున్న కొద్దీ చెల్లించాల్సిన పన్ను కూడా పెరుగుతుంది. ఏటా బడ్జెట్లో సూచించే ప్రతిపాదనల మేరకు స్లాబులు మారుతుంటాయి. ఈ పన్ను స్లాబులు వేర్వేరు కేటగిరీలకు చెందిన వ్యక్తులకు వేర్వేరుగా ఉంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు