Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 14 Jul 2022 17:25 IST

1. రాజ్యసభలో తెలంగాణ గొంతుక వినిపిస్తా: లక్ష్మణ్‌

రాజ్యసభలో తెలంగాణ గొంతుకను బలంగా వినిపిస్తానని ఎంపీ కె.లక్ష్మణ్‌ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పటికీ సొంత రాష్ట్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నారాయణగూడలో ఆయనకు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. కేంద్రం నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని ఆరోపించారు.

2. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం.. సాయంత్రం నుంచి రాకపోకలు బంద్‌!

గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. గురువారం మధ్యాహ్నానికి నదిలో నీటిమట్టం 60.30 అడుగులకు చేరుకోవడంతో సమీపంలోని లోతట్టు కాలనీలను వరద ముంచెత్తింది. ఎగువ ప్రాంతంలోని ప్రాజెక్టుల నుంచి భారీ స్థాయిలో నీటి ప్రవాహం కొనసాగుతుండడంతో గురువారం రాత్రికి భద్రాచలంలో వరద తీవ్రత మరింత ఎక్కువ అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.


Video: కన్నెర్ర చేసిన గంగమ్మ.. బాహుబలి సీన్‌ రిపీట్‌!


3. చిన్నారుల్లో మిస్టరీ కాలేయ వ్యాధి.. 35 దేశాల్లో 1000 కేసులు నమోదు

కొన్ని నెలలుగా ప్రపంచ దేశాలను మరో అంతుచిక్కని వ్యాధి వెంటాడుతూనే ఉంది. చిన్నారుల్లో కనిపిస్తోన్న మిస్టరీ కాలేయ వ్యాధి తాజాగా 35 దేశాలకు వ్యాపించింది. ఇప్పటికే వెయ్యి మంది చిన్నారుల్లో ఇది వెలుగు చూడగా.. 22 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని కారకాలను కనుక్కునేందుకు ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయని తెలిపిన డబ్ల్యూహెచ్‌ఓ.. ఆరోగ్యవంతులైన పిల్లల్లోనూ ఇవి బయటపడటం ఆందోళన కలిస్తోందని తెలిపింది.

4. విండీస్‌తో టీ20 సిరీస్‌.. కోహ్లీ లేకుండానే భారత్‌ జట్టు ప్రకటన

వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. అయితే టాప్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీకి జట్టులో స్థానం దక్కలేదు. పేసర్‌ జస్ప్రీత్‌ బుమ్రాతో చాహల్‌కు సెలక్షన్‌ కమిటీ విశ్రాంతినిచ్చింది. ఇప్పటికే ఇంగ్లాండ్‌తో తొలి వన్డేకు దూరమైన కోహ్లీ.. రెండో మ్యాచ్‌కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ క్రమంలో విండీస్‌తో టీ20 సిరీస్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు తెలుస్తోంది.

5. దేశీయ మార్కెట్లకు నాలుగోరోజూ తప్పని నష్టాలు!

అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాల్లో ముగిశాయి. చమురు ధరల తగ్గుదల, నిన్నటి నష్టాల నేపథ్యంలో ఉదయం సెషన్‌లో మార్కెట్‌లో కొనుగోళ్ల కళ కనిపించినప్పటికీ.. మధ్యాహ్నం తర్వాత అవి ఆవిరైపోయాయి. రూపాయి బలహీనత, అమెరికాలో ద్రవ్యోల్బణం 41 ఏళ్ల గరిష్ఠానికి చేరడం, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తప్పదన్న ఐఎంఎఫ్ అంచనాలు మదుపర్లను కలవరపెట్టాయి.


రివ్యూ: ది వారియ‌ర్‌


6. పెట్రోల్‌, డీజిల్‌పై వ్యాట్‌ తగ్గింపు.. ఎక్కడంటే..?

మహారాష్ట్రలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఊరట కల్పించింది. పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై వ్యాట్ తగ్గిస్తూ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది. లీటర్‌ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ. 3 తగ్గించింది.  ముంబయిలో లీటర్ పెట్రోల్ రూ.111.35కి లభిస్తోంది. ఇప్పుడది రూ.106.35కి తగ్గనుంది. అదే సమయంలో రూ.97.28గా డీజిల్.. రూ. 94.28కే లభ్యం కానుంది. ఈ తగ్గింపుతో రాష్ట్రంపై రూ.6 వేల కోట్ల మేర భారం పడనుంది.

7. రష్యా చేతికి అణు సునామీ ఆయుధం..!

ప్రపంచ నౌకాదళ చరిత్రలో గత వారం అత్యంత ప్రమాదకరమైన ఆయుధం ఆవిష్కృతమైంది. ఈ ఆయుధం సముద్రంలోని అత్యంత లోతుల్లో రహస్యంగా ఉండగలదు.. అవసరమైతే సముద్రపు అలలనే ఆయుధంగా మార్చి శత్రుదేశ తీరప్రాంత నగరాలపైకి సునామీ వలే ప్రయోగించగలదు. అదే ‘కే-329 బెల్గోరోడ్‌’ జలాంతర్గామి. దీని రాకతో సముద్రంపై జరిగే యుద్ధాల్లో కొత్త శకం మొదలైంది. ఇటీవల రష్యాకు అత్యంత కీలకమైన కోలా ద్వీపకల్పానికి సమీపంలోని తెల్ల సముద్రంలో సెవెరోడిన్స్క్‌లో రష్యా అమ్ములపొదిలోకి చేరింది.

8. ఫారం 26ఏఎస్ ధ్రువీకరించారా? ఒకవేళ తప్పులుంటే..?

మదింపు సంవ‌త్స‌రం 2022-23 (ఆర్థిక సంవ‌త్స‌రం 2021-22)కి సంబంధించిన ప‌న్ను రిట‌ర్నుల‌ను దాఖ‌లు చేసేందుకు గ‌డువు ద‌గ్గ‌ర పడుతోంది. వ్య‌క్తిగ‌త ప‌న్ను చెల్లింపుదారులు జులై 31లోపు ఈ ప‌ని పూర్తి చేయాల్సి ఉంటుంది. ఒక‌వేళ ఆల‌స్యంగా దాఖ‌లు చేస్తే రూ.5000 జ‌రిమానా చెల్లించాల్సి వ‌స్తుంది. అంతేకాకుండా, చివ‌రి రోజుల్లో హడావిడిగా రిట‌ర్నులు దాఖ‌లు చేయ‌డం వ‌ల్ల ఫారం 26ఏఎస్ వంటి ప‌త్రాల‌ను నిశితంగా ప‌రిశీలించ‌లేరు. ఒక‌వేళ ఆ ఫారంలో ఏదైనా త‌ప్పులు ఉంటే స‌రిచేసుకుని రిట‌ర్నులు ఫైల్ చేసే స‌రికి ఆల‌స్యం కావ‌చ్చు.


Video: రహదారుల దుస్థితిపై పవన్ కల్యాణ్‌ వ్యంగ్యాస్త్రాలు


9. రైలు రద్దు.. విద్యార్థి కోసం రైల్వేశాఖ చేసిన ఈ పనికి హ్యాట్సాఫ్‌..!

సాధారణంగా ఆకస్మిక కారణాల వల్ల రైళ్లను రద్దు చేసినప్పుడు రైల్వే శాఖ ప్రయాణికులకు టికెట్‌ డబ్బులను రీఫండ్‌ చేస్తుంటుంది. అంతేగానీ, వారికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయదు. కానీ, ఇటీవల రైలు రద్దు కారణంగా ఓ విద్యార్థి ప్రయాణం ఆగిపోవడంతో.. అతడిని సమయానికి యూనివర్శిటీకి చేర్చేందుకు రైల్వేశాఖ ముందుకొచ్చింది. ఆ విద్యార్థి కోసం ప్రత్యేకంగా కారు బుక్‌ చేసి గమ్యస్థానానికి పంపించి ఉదారతను చాటుకుంది.

10. మాల్దీవులు-సౌదీ అరేబియా వయా సింగపూర్..!

ద్వీపదేశం శ్రీలంకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. రాజీనామా చేయకుండా దేశం దాటిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స నిన్న ఉదయం మాల్దీవులకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ రోజు సౌదీ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో సింగపూర్‌కు బయల్దేరారని శ్రీలంక మీడియా సంస్థలు వెల్లడించాయి. గొటబాయ రాజీనామా చేయాలని గత శనివారం మొదలైన నిరసన జ్వాలలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని